బీహార్‌ ఎన్నికల్లో నేరగాళ్లు!
లైంగికదాడి, హత్య చేసినా.. స్వేచ్ఛగా పోటీ
తీవ్ర నేరారోపణలున్నా అడ్డుకోలేకపోతున్న ఎన్నికల సంస్థ

న్యూఢిల్లీ : ‘క్రిమినల్‌ నేర చరిత్రఉన్నవారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వటాన్ని సుప్రీంకోర్టు కొద్దినెలల క్రితం తప్పుబట్టింది. ఒకవేళ నేర చరిత్ర ఉన్నవాళ్లకు టికెట్లు ఇచ్చిన పక్షంలో, సంబంధిత రాజకీయ పార్టీ దానికిగల కారణాన్ని ఎన్నికల సంఘానికి తెలపాల్సి ఉంటుంది. ఇది ఫిబ్రవరి 13, 2020లో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల్లో కీలకమైంది. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు, మార్గదర్శకాలు అమలయ్యే పరిస్థితి కనపడటం లేదు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు పాత విధానాల్నే కొనసాగించాయి. నేర చరిత్ర ఉన్నవాళ్లకు పెద్ద సంఖ్యలో టికెట్లు అందజేశాయి.

మొదటి దశపోలింగ్‌ అక్టోబరు 2871 స్థానాలకు జరుగుతుండగా, ఇందులో ప్రధాన పోటీ ఆర్జేడీ, బీజేపీ మధ్య నెలకొంది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు ఇస్తారా? ఇలాంటి వారికి పన్ను మినహాయింపులు వర్తింపజేస్తారా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇస్తున్న రాజకీయ పార్టీ గుర్తింపు రద్దు చేసేవిధంగా ఎన్నికల నిబంధనలు రావాలని వారు చెబుతున్నారు. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 1066మంది అభ్యర్థులు 71 స్థానాల్లో పోటీకి నిలబడ్డారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌‘ (ఏడీఆర్‌) తాజా నివేదిక ప్రకారం, 328మంది అభ్యర్థులు (31శాతం) నేర చరిత్ర కలిగినవారున్నారు. ఇందులో 29మందిపై లైంగికదాడి, మహిళా హత్య, మహిళలపై నేరాలు వంటి ఆరోపణలున్నాయి. ఇద్దరు అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్‌ తప్ప, మిగతా 1064మంది అఫిడవిట్లను బీహార్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం సరైన పరిశీలన జరపలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్జేడీకి చెందిన 41మంది అభ్యర్థులు తమకు నేర చరిత్ర ఉందని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొదటి దశ పోలీంగ్‌లో బీజేపీ అభ్యర్థులు 29మంది పోటీ చేస్తుండగా, అందులో 21మందికి నేర చరిత్ర ఉందని తేలింది. లోక్‌జన్‌శక్తి పార్టీ నుంచి 41మంది పోటీ చేస్తుండగా, 24మందికి నేర చరిత్ర ఉంది. కాంగ్రెస్‌ నుంచి 21మంది అభ్యర్థుల్లో 12మందికి, జనతా దళ్‌(యు) నుంచి 26 మంది అభ్యర్థుల్లో 8మందికి నేరచరిత్ర ఉంది.

244మందిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు
మొత్తం నేరచరిత్ర ఉన్నవాళ్లలో 244మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా నాన్‌ బెయిలబుల్‌ కేసులు. విచారణ సరిగా జరిగితే..కనీసం 5ఏండ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుంది. హత్రాస్‌లో లైంగికదాడి ఘటనపై దేశం యావత్తు ఆగ్రహం వ్యక్తమవుతున్నవేళ, బీహార్‌లో పలు రాజకీయ పార్టీలు లైంగికదాడి కేసుల్లో ఆరోపణలున్న అభ్యర్థుల్ని నిలబెట్టడం దేశ ప్రజల్ని నివ్వెరపర్చాయి. క్రిమినల్స్‌ ఎన్నికల్లో గెలిచి రేపు చట్టసభల్లో అడుగుపెడితే..ప్రజలు ఎవరితో తమ గోడు వెళ్లబోసుకోవాలి? అనే ప్రశ్న ఉదయిస్తున్నది. ధనబలం, కండబలం ఆధారంగా అభ్యర్థుల్ని ఎంచుకొని ఎన్నికల్లో గెలవటమంటే, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ధనబలమున్నవారికి ప్రాధాన్యత
ఈసారి బీహార్‌ ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలు ఎక్కువగా ధనబలం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చాయి. మొదటి దశ పోలింగ్‌లో నిలబడ్డ 1064మందిలో 375 మంది కోటీశ్వరులే. 5వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య విద్యార్హతలున్న అభ్యర్థులు 455మంది ఉన్నారు. డిగ్రీ విద్యార్హత కలిగినవారు 522మంది ఉన్నారు. నిరక్షరాస్యులు ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Courtesy Nava Telangana