Image result for ఎన్‌కౌంటర్‌పై సుప్రీం విచారణ కమిషన్‌"దిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌ ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్‌లో సరైన చోట ఉండి విచారణ చేయాలని కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. తొలి విచారణ తేదీ విచారణ కమిషన్‌కి నేతృత్వం వహిస్తున్న వారి ఇష్టమేనని, అప్పటి నుంచి ఆరు నెలల్లో కోర్టుకు నివేదిక అందించాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్‌పై ఉన్న ఇతర దర్యాప్తులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాల వరకు ఇతర విచారణలు జరపొద్దని ఆదేశించింది.
ఎన్‌కౌంటర్‌పై న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌, ముఖేశ్‌ కుమార్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ బోబ్డే ధర్మాసనం రెండో రోజు విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. సుప్రీం నేతృత్వంలో విచారణకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఇప్పటికే సిట్‌ దర్యాప్తు జరుగుతున్నందున దానికి సమాంతరంగా విశ్రాంత న్యాయమూర్తి విచారణ అవసరం లేదని రోహత్గి వాదించారు. కాగా.. ఆయన అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
‘మీరు తప్పు చేశారని మేం అనడం లేదు. కానీ దర్యాప్తులో లభిస్తున్న ప్రతి ఆధారం మీడియాకు ఎలా వెంటనే వెళ్తోంది? అందుకే పారదర్శక విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉంది’ అని జస్టిస్‌ బోబ్డే ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. ఈ కేసులో మీడియా, సోషల్‌మీడియాను కట్టడి చేయాలని ఆదేశించింది.

(Courtesy Eenadu)