యువతకు స్వయం ఉపాధి అవకాశాలు దూరం

అమరావతి : ఎస్‌సి కార్పొరేషన్‌ ప్రతి ఏడాది సబ్సిడీపై ఇచ్చే రుణాలు ఇకపై లేనట్టేనని తెలుస్తోంది. ఎస్‌సి యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కార్పొరేషన్‌ వివిధ రూపాల్లో ఆర్థిక చేయూతను ఇస్తుంది. వీటిలో గేదెలు, గొర్రెలు, చిరువ్యాపారాల రుణాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకు సంబంధిత, బ్యాంకుయేతర రుణాలను 60 శాతం సబ్సిడీతో ప్రతిఏడాదీ మంజూరు చేయాల్సి ఉంది. వైసిపి అధికారంలోకి వచ్చాక ఒక్క లోన్‌ కూడా ఇవ్వలేదు. పలు పథకాలకు 2020-21 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.7,525.04 కోట్లు కేటాయించారు. ఈ పథకాల వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు లభించేందుకు ఆస్కారం లేదని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

గతంలో ఎస్‌సిల అభివృద్ధికి ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా బ్యాంక్‌లింకు పథకాలు, నాన్‌బ్యాంకు లింక్‌ పథకాలు, ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి, ఎస్‌ఎస్‌కెఎఫ్‌డిసి పథకాల ద్వారా స్వయం ఉపాధికి కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, చిరువ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు 60 శాతం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. సఫాయి కర్మచారి ఉద్యోగులకు ఆర్థిక అభివృద్ధి పథకాలు, ఎయిడ్స్‌ రోగులకు, వితంతువులకు ఆర్థికసాయం, భూమి కొనుగోలు పథకం, మైనర్‌ ఇరిగేషన్‌ (బోరుబావులు, సబ్‌మెర్సిబుల్‌ పంప్‌సెట్స్‌, విద్యుత్‌ మోటార్స్‌ ఉచిత ఏర్పాటు), స్కిల్‌ డెవలప్‌మెంటు కార్యక్రమాలు నిర్వహించేవారు. అంబేద్కర్‌ స్టడీ సర్కిల్స్‌ ద్వారా పోటీ పరీక్షలకు కోచింగ్‌, బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలు, విద్యోన్నతి పథకం, వివిధ రకాల స్కాలర్‌షిప్‌లు, అట్టడుగు తరగతులకు సహాయం, చర్మకారులు, పారిశుధ్య పనులు, వెట్టిచాకిరీ పనులు, జోగినిలు, జైలుశిక్ష అనుభవించిన వారికి, అత్యాచార బాధితులకు ఆర్థిక సహాయం వంటి పథకాలు రాజ్యాంగబద్ధంగా అమలయ్యేవి. టిడిపి ప్రభుత్వ హయాం నుంచి ఈ పథకాలన్నీ అటకెక్కాయి. ఫలితంగా ఎస్‌సిల అభివృద్ధి కూడా నిలిచిపోయింది. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రుణాలు పెండింగ్‌ ఉండగా, ఇప్పటి వరకు వీటికి మోక్షం కలగలేదు. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క సెంటు భూమి కూడా టిడిపి, వైసిపి ప్రభుత్వాలు కొనుగోలు చేసి దళితులకు ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా దళితుల వద్దనున్న 2.5 శాతం భూమిలో 0.5 శాతం భూములను ఈ రెండు ప్రభుత్వాలు వివిధ సాకులు చూపి దౌర్జన్యంగా లాక్కున్నాయి. రాజ్యాంగబద్ధంగా రూపొందించిన ఎస్‌సి అభివృద్ధి పథకాలను యథావిధిగా కొనసాగించి దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని కొన్ని దళిత సంఘాలు ఇటీవల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ను కోరినట్లు సమాచారం. మంత్రి నుంచి వీటిపై తగినంత స్పందన లభించలేదని తెలుస్తోంది. కొత్తరుణాలకు నోటిఫికేషన్‌ వెలువడడం పక్కనబెడితే, 2017-18, 19 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న రుణాలకు రూ.18 కోట్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారని సమాచారం. ఎస్‌సి కార్పొరేషన్‌ను మూడు ముక్కలుగా చేయడంపైనా దళిత వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎస్‌సి అభివృద్ధి పథకాలు అమలు చేయాలని దళితులు, దళిత సంఘాలు కోరుతున్నాయి.

దళితుల రాజ్యాంగ హక్కులపై దాడి హేయం
వైఎస్‌ఆర్‌, జగనన్న పేర్లతో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎస్‌సిల సంక్షేమ పథకాలు రద్దు చేసి దళితుల రాజ్యాంగ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తోంది. ఇది హేయమైన చర్య. వైఎస్‌ఆర్‌, జగనన్న పేర్లతో రూపొందించిన పథకాలతో దళితులకు చెందాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. దళితుల జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయింపులు జరగడం లేదు. కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా దళితులకు ఖర్చు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది. గతంలో ఉన్న ఎస్‌సి కార్పొరేషన్‌ పథకాలను అమలు చేయాలి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగంపై ప్రత్యక్షంగా దాడిచేస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి దళితుల రాజ్యాంగబద్ధమైన హక్కులపై పరోక్షంగా దాడి చేస్తున్నారు. ఈ వైఖరిని కెవిపిఎస్‌ తీవ్రంగా ఖండిస్తోంది.
– అండ్ర మాల్యాద్రి, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి