న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకువస్తూ సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. న్యాయవ్యవస్థలో స్వతంత్రత అనేది జవాబుదారీతనాన్ని తప్పించుకోలేదంటూ ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో పారదర్శకత ఉండాలనీ.. స్వతంత్రత, జవాబుదారీతనం చేయి చేయి కలిపి నడవాలని ధర్మాసనం పేర్కొంది. గోప్యతకు, జవాబుదారీ తనానికి మధ్య సమతుల్యత ఉండాలని పేర్కొంది. జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా తదితరులు ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నారు.

సుప్రీంకోర్టుతో పాటు సీజే ఆఫీసులు కూడా ప్రభుత్వ సంస్థలేనని.. అవి ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తాయంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఇవాళ తుది తీర్పును వెలువరించింది.

Courtesy Andhrajyothy..