– జియో పేమెంట్స్‌ బ్యాంక్‌తో ఎస్బీఐ ఒప్పందంపై అనుమానాలు
– అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి కీలక సమాచారం!
– ఎస్బీఐ-జియో జాయింట్‌ వెంచర్‌లో పరస్పర ప్రయోజనాల ఉల్లంఘన : ఆర్థిక నిపుణులు
– కార్పొరేట్‌ సంస్థల్ని..ఇటేటు రమ్మంటే… ఇల్లంతా నాదేఅనే రకం..

రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత (ఆర్‌ఐఎల్‌) ముకేష్‌ అంబానీకి చెందిన జియోలో ఫేస్‌బుక్‌ సహా అబుదాబీ, సౌదీ అరేబియాకి చెందిన కంపెనీలు లక్ష కోట్లరూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టాయన్న సంగతి తెలిసిందే. దీనివల్ల మన బ్యాంకింగ్‌రంగానికి ప్రమాదం పొంచివున్నదని ఆర్థికరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదెలా? అంటారా..! జియో-స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)కి మధ్య జాయింట్‌ వెంచర్‌ ఒకటి ఉంది. అదే..’జియో పేమెంట్స్‌ బ్యాంక్‌’. ఇందులో ఎస్బీఐకి చెందిన కోట్లాదిమంది ఖాతాదారుల సమాచారం ఉంది. ఈ ఒప్పందాల వల్ల ఎస్బీఐ బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు రక్షణ కొరవడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జియో పేమెంట్స్‌ బ్యాంక్‌…ఆవిర్భావం వెనుక కేంద్రంలోని రాజకీయ పెద్దల పాత్ర ఉన్నదనీ, వారి ఆదేశాలతో ఎస్‌బీఐ పెద్దల ఆమోదం లభించిందన్న ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. వాటిలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా'(ఎస్బీఐ). కోట్లాది మంది ఖాతాదారులు, గ్రామగ్రామాన బ్యాంకు శాఖలు కలిగివున్న సంస్థ ఇది. ఇంత పెద్ద సంస్థ ‘జియో పేమెంట్‌ ్స బ్యాంక్‌’ (డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు)తో కొన్నేండ్ల క్రితం ఒప్పందం చేసుకోవటంపై బ్యాంకింగ్‌ రంగ నిపుణులు ఆశ్చర్యం, అనుమానాలు వ్యక్తం చేశారు. ఎస్బీఐ చైర్మెన్‌గా ఉన్న అరుంధతీ భట్టాచార్య తీసుకున్న నిర్ణయాలు, జియోతో జాయింట్‌ వెంచర్‌కు ఆమోదం తెలపటం వెనుక పరస్పర ప్రయోజనాల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడవి మరింత బలపడుతున్నాయి. జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ను ఏప్రిల్‌, 2018లో ప్రారంభించారు. ఇందులో 30శాతం వాటా ఎస్బీఐదికాగా, 70శాతం వాటా రిలయన్స్‌ జియోది. ఏప్రిల్‌ 3, 2018 నుంచి జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే దీనికంటే ముందే 2017లో ఎస్బీఐ వారు డిజిటల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ‘యోనో’ సేవలు మొదలయ్యాయి. 2017లోనే యోనో ప్రారంభించాక, తిరిగి ‘జియో పేమెంట్స్‌ బ్యాంక్‌’తో జాయింట్‌ వెంచర్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది సమాధానం లేని ప్రశ్న. జాయింట్‌ వెంచర్‌ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసిన ఎస్బీఐ చైర్మెన్‌ అరుంధతీ భట్టాచార్య…తదనంతర కాలంలో ముకేష్‌ అంబానీ వ్యాపార సామ్రాజ్యమైన ‘రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌'(ఆర్‌ఐఎల్‌) బోర్డ్‌ ఆఫ్‌ డైరెకర్స్‌లో చేరటం అప్పట్లో సంచలనం రేపింది. అలాగే ఎస్బీఐ మాజీ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మంజు అగర్వాల్‌ ‘జియో పేమెంట్స్‌’ బోర్డ్‌ సభ్యురాలుఉన్నారు.

ఎస్బీఐకి ఆ అవసరం ఏంటి?
మారుమూల గ్రామాలకు బ్యాంకింగ్‌ సేవల్ని విస్తరించ డానికి ‘జియో పేమెంట్స్‌ బ్యాంక్‌’తో జాయింట్‌ వెంచర్‌ ఉపయోగపడుతుందనే కారణాన్ని చూపి ఒప్పందానికి ఉన్నతస్థాయిలో ఆమోదముద్ర వేశారు. అయితే ఎస్బీఐకి చెందిన బ్యాంకు శాఖలు మారుమూల గ్రామాల్లోకి విస్తరించాక కూడా ఈ కొత్త ఒప్పందం అవసరం ఏంటన్న సందేహాలున్నాయి. బ్యాంకింగ్‌రంగంలో అపార అనుభవం, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఎస్బీఐ వద్ద ఉంది. దీనిని జియోతో పంచుకోవాల్సిన అవసరం లేదన్నది నిపుణుల అభిప్రాయం. ఎస్బీఐ ఖాతాదారుల సమాచారం జియోతో పంచుకోవటమేంటి? అనే సందేహం వారు వ్యక్తం చేశారు. అరుంధతీ భట్టాచార్య రిలయన్స్‌ డిజిటల్‌కు పెద్ద ఎత్తున రుణాలు మంజూరుచేసి, జియోతో జాయింట్‌ వెంచర్‌కు ఆమోదం తెలిపారనీ, ఈ వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తున్నదని ఆరోపణలున్నాయి.

వెనుక ద్వారం…
ఆర్‌ఐఎల్‌ లాంటి బడా కార్పొరేట్‌ సంస్థకు బ్యాంకింగ్‌ లైసెన్స్‌ ఇవ్వటమే సరైంది కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ సంస్థకు చెందిన ఇతర వ్యాపారవాణి జ్యాలు దెబ్బతింటే, దాని ప్రభావం బ్యాంకింగ్‌పైనా పడు తుందని వారు చెప్పారు. ఎస్బీఐ-జియో జాయింట్‌ వెంచర్‌ నే తీసుకుంటే, ఇక్కడ జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలా పాలు అంత చురుకుగా లేవు. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు సక్సెస్‌ కాలేదు. అలాంటప్పుడు ఈ జాయింట్‌ వెంచర్‌ను ఆర్‌ఐఎల్‌ ఎందుకు కొనసాగిస్తున్నది? అనేదానిపై అనేక సందేహాలున్నాయి. ఎస్బీఐ ఖాతాదార్లకు సంబంధించిన కీలక సమాచారమే ఆర్‌ఐఎల్‌కు కావాలనీ, దీనికోసమే ఈ ఒప్పందం జరిగిందని మార్కెట్‌ రంగ నిపుణులు చెబుతు న్నారు. బ్యాంకింగ్‌ రంగంలోకి చొరబడటానికి ఇదొక ‘బ్యాక్‌ డోర్‌’గా ఆర్‌ఐఎల్‌ ఉపయోగించుకుందని వారు విశ్లేషిం చారు. ఎస్బీఐ, జియోతో ఉన్న చిన్న జాయింట్‌ వెంచర్‌ ఒప్ప ందం ఇప్పుడు ముకేష్‌ అంబానీకి పెద్ద ఎత్తున కలిసివ చ్చిం దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎస్బీఐ ఖాతాదార్లకు సంబంధించి విలువైన సమాచారం ఆర్‌ఐఎల్‌ వద్ద ఉంది కాబట్టే, ఫేస్‌బుక్‌సహా ఇతర అంతర్జాతీయ కార్పొరేట్‌ కంపె నీలు జియోలో వాటా కొనుగోళ్లకు ముందుకు వచ్చాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ముకేష్‌ అంబానీ ఈకా మర్స్‌ వ్యాపారంలోకి (జియో మార్ట్‌) అడుగుపెట్టడానికి దోహదపడిన అంశం ‘జియో పేమెంట్స్‌’. ‘జియోమార్ట్‌’లో జరిగే ప్రతి లావాదేవీ నేడు జియో పేమెంట్స్‌ ద్వారా నిర్వహిస్తున్నారు.

మనదేశంలో బడా కార్పొరేట్‌ సంస్థలకు చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి. వారి ప్రతినిధులు కేంద్ర ఆర్థిక శాఖలో, ఆర్బీఐలో స్థానం సంపాదించుకొని లాబీయింగ్‌ చేస్తున్నారు. ఎస్‌బీఐ, జియో జాయింట్‌ వెంచర్‌ అందుకు ఒక ఉదాహరణ. అరుంధతీ భట్టాచార్య చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎస్బీఐకు ఉన్న 30శాతం వాటా విలువ కేవలం రూ.69.3కోట్లుగా ఆమె లెక్కగట్టారు. దీనివల్ల ఎస్బీఐ ప్రయోజనాలు కచ్చితంగా దెబ్బతిన్నాయి. ఆమెకంటే ముందు ఎస్బీఐ చైర్మెన్‌ పదవిలో (2006-11) ఉన్న ఒ.పి.భట్టా, భారతీ ఎయిర్‌టెల్‌తో జాయింట్‌ వెంచర్‌ ప్రతిపాదనను తిరస్కరించారు.
– దేవిదాస్‌ తుల్జాపుర్కార్‌, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి

Courtesy Nava Telangana