మందగమనంతో తగ్గుతున్న సేవింగ్స్‌ రేటు
కుటుంబ పొదుపు నేల చూపులు
పెరుగుతున్న ధరలు, ఉపాధి తగ్గుదలే కారణం

ముంబయి: దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రజల పొదుపు ఆలోచనలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సర్కారు విధానాల కారణంగా ఆర్థిక వ్యవస్థ వెనుకంజ వేస్తుండడం ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. దీనికి తోడు దేశంలో చుక్కలనంటుతున్న ధరలు, తగ్గిపోతున్న ఉపాధి అవకాశాల వల్ల కూడా పొదుపు అంతకంతకు పడిపోతూ వస్తోంది. తాజాగా వెలువడిన గణాంకాల మేరకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ పొదుపు రేటు ఏకంగా 15 ఏండ్ల కనిష్టానికి దిగజారింది. ధరలకు తోడు మన్నికైన వస్తువుల కొనుగోళ్లు, ప్రయాణాలపై ప్రజలు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుండడం కూడా పొదుపును ప్రభావితం చేస్తున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. పొదుపు రేటు 15 ఏండ్ల కనిష్టానికి పడిపోవడానికి ప్రధాన కారణం కుటుంబ పొదుపు కుంగడమేనని విశ్లేషణలు చెబుతున్నాయి. మొత్తం సేవింగ్స్‌లో దాదాపు 60 శాతం వాటా కుటుంబ పొదుపుదే కావడం విశేషం.

సామాన్య, మధ్య తరగతిపై అధిక ప్రభావం..
కేంద్రంలో మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పన అమాంతం పడిపోయింది. ముఖ్యంగా ఉపాధి తగ్గడంతో ప్రజల వద్ద విరివిగా నగదు లభ్యత లేకుండా పోతోంది. ఈ అంశం కూడా పొదుపు ఆలోచన స్థాయిని భారీగా దెబ్బతీస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్టుబడులు పడిపోవడం, ఆర్ధిక వ్యవస్థలో బలహీనతలు తారాస్థాయికి చేరుతుండడం కూడా పొదుపు స్థాయిని సన్నగిల్లేలా చేస్త్తున్నాయని ఒక ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. దేశ పొదుపులో గృహ పొదుపు వాటా దాదాపు 60 శాతంగా ఉంటుంది. కేంద్ర గణంకాల సంస్థ నివేదిక ప్రకారం 2018-19లో దేశ స్థూల పొదుపు జీడీపీలో 30.1 శాతానికి క్షీణించింది. 2003-04 తరువాత స్థూల పొదుపు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అప్పట్లో దేశ స్థూల పొదుపు జీడీపీలో 29 శాతంగా ఉండేదని కేంద్ర గణాంకాల కార్యాలయం రికార్డులు చెబుతున్నాయి. గరిష్టంగా 2007-08లో దేశ స్థూల పొదుపు జీడీపీలో 36 శాతంగా నిలిచింది. మరోవైపు కుటుంబ పొదుపు 2012లో 23 శాతంగా నిలవగా.. గత ఏడాది ఇది 18 శాతానికి కుంగింది. భారత పొరుగు దేశం చైనా సేవింగ్స్‌ రేటు మాత్రం దాని జీడీపీలో 46 శాతంగా ఉండడం విశేషం. వినియోగదారుల వినిమయ వ్యయం పెరగడం గృహ పొదుపు పతనానికి కారణమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ.. అది అర్థ సత్యమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ప్రజల వినిమయం పెరిగితే తయారీ రంగం పుంజుకోవాలి. కాని అలా జరగడం లేదు. దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ డీలా పడుతూ వస్తోంది. దీనిబట్టి చూస్తుంటే ప్రజలు పొదుపు దిశగా ఆలోచించే పరిస్థితులు దూరమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత మందగమనమూ దేశీయ పొదుపు పతనానికి కొంతమేర కారణమేనని హెచ్‌ఎస్‌బీసీ నిపుణులు ప్రంజుల్‌ భండారీ పేర్కొన్నారు. పొదుపు రేటు పడిపోతుండడం ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags- India, economic recession, savings rate, down, unemployment, inflation reason for families could not save

 

స్వదేశీ రుణాలపై తీవ్ర ప్రభావం..
దేశీయంగా పొదుపు స్థాయి తగ్గడంతో భారత కంపెనీలు నిధుల కోసం విదేశీ మార్గాల వైపు దృష్టి సారించాల్సి వస్తోందని నిపుణులంటున్నారు. ఇది క్రమంగా దేశ విదేశీ రుణం పెరిగేందుకు దోహదం చేస్తుందని వారు ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ గణంకాల ప్రకారం గడిచిన ఆర్ధిక సంవత్సరం 2018-19లో భారత కంపెనీల విదేశీ రుణాలు 54,300 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఇది 2015లో 47,500 కోట్ల డాలర్లుగా ఉంది. విదేశాల నుంచి రుణాల సేకరణ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మేలు కాదని వారు చెబుతున్నారు. దీర్ఘకాలంలో దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రతిబింబించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

Courtesy Nava Telangana