శిరంశెట్టి కాంతారావు
సెల్‌ : 9849890322

జ్యోతిబా ఫూలే జన్మించినప్పుడు సంఘపరంగా చాలా సంక్లిష్టతలను ఎదుర్కొంటున్నకాలం. శివాజీ పాలన అంతమొంది క్రమంగా దేశం పీష్వా (బ్రాహ్మణుల)ల పాలనలోకి వచ్చింది. వారి పాలనలో కుల, మత, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బ్రాహ్మణుల ఏకచ్చత్రాధిపత్యం పరాకాష్టకు చేరింది. సంస్కృతీ విపరిణామం కారణంగా అనేకులు మానసికంగా, శారీరకంగా అలసిపోయారు. క్రమంగా అది సమాజ క్షీణతకు, పతనానికి దారితీసింది. మిగతా వారి కోసం అక్కడక్కడా ఎవరో కొందరు వ్యక్తులు తమ ఇండ్లల్లోనే నడుపుతున్న పాఠశాలలుండేవి. అయినా సమాజంలో కింది తరగతులవారు అసలు చదువుకోగూడదని ఆదేశాలుండేవి.
ఇటువంటి నేపథ్యంలో జ్యోతిబా తన ఏడో ఏట ఒక మరాఠి పాఠశాలలో విద్యార్థిగా చేరాడు. జ్యోతిబా చురుకైన విద్యార్థిగా బాగా చదువుకుంటున్న విషయాన్ని గమనించిన కొందరు బ్రాహ్మణులు తండ్రి గోవిందరావుకు లేనిపోని కట్టుకథలు చెప్పి బడిమానిపించారు. బడి మానివేసిన జ్యోతిబా తండ్రి, అన్నలతోపాటు పూలతోటల్లో పనులు చేస్తున్నప్పటికీ రాత్రిపూట బుడ్డి దీపం ముందు కూర్చుని చదువుకుంటుండేవాడు. చదువు పట్ల అతనికున్న శ్రద్ధను, చురుకుదనాన్ని గమనించిన వాళ్లంతా ఎంతో ఆశ్చర్యపడుతుండేవారు. అటువంటి వారిలో వారి ఇంటిపక్కనే ఉండే ఉర్దూ భాషా పండితుడు జఫ్వర్‌ బేగ్‌ మున్సీ ఒకరు కాగా మరొకరు లెజిట్‌ అనే మతాధికారి. వీరిద్దరి సూచన మేరకు మూడు సంవత్సరాల తరువాత గోవిందరావు తన కొడుకును తిరిగి పాఠశాలకు పంపించాడు. అప్పటికి అతని వయసు పద్నాలుగేండ్లు.
జ్యోతిబాకు పదమూడో ఏట ఏడేండ్ల సావిత్రిబాయితో వివాహం జరిగింది. 1847 నాటికి జ్యోతిబా ఇంగ్లీష్‌ బడి చదువు కూడా పూర్తి చేశాడు. అప్పటికి అతనిలో స్వాతంత్య్రోద్యమ భావాలు బలపడ్డాయి. అప్పటి సామాజిక వ్యవస్థ ప్రకారం జ్యోతిరావు, తండ్రి అడుగుజాడల్లో పూలతోటలో పని చేయాల్సి ఉంది. కానీ జ్యోతిరావు అందరి మాదిరిగా గుడ్డిగా పాతబాటను వెళ్లేవాడు కాదు. ఎప్పుడూ కొత్తను వెతుక్కుంటూ ముందుకు వెళ్లే స్వభావం ఉన్నవాడు. కాబట్టి ఏం చేయాలన్న ఆలోచనతో ఉక్కిరిబిక్కిరి కాసాగాడు. సరిగ్గా అటువంటి సమయంలో జరిగిన ఒకానొక సంఘటన అతని జీవిత గమనాన్నే మార్చివేసింది.
సహజంగా స్నేహమంటే ప్రాణంపెట్టే జ్యోతిరావుకున్న అనేకమంది మిత్రుల్లో ఒక అగ్రకుల మిత్రుని పెండ్లికి వెళ్లాడు. పెండ్లి ఊరేగింపు నడుస్తున్నది. ఊరేగింపులో ఉన్నవారందరూ అగ్రకులస్థులే. వారితోపాటు తనూ నడవసాగాడు. హఠాత్తుగా ఒక బ్రాహ్మణుడు అతన్ని గమనించి ‘ఒరేరు శూద్రుడా! ఒక మాలి కొడుకువైన నువ్వు చదువుకున్నానన్న పొగరుతో సంఘపు కట్టుబాట్లను అతిక్రమించి మాతో పాటు నడుస్తావా? నువ్వు ఎంత చదివినా మాతో సమానుడవు కావు గుర్తుంచుకో.. వస్తే మా వెనుక దూరంగా రా, లేదంటే ఇక్కన్నుండి వెళ్లిపో’ అంటూ నోటికొచ్చినట్టు తిట్టడం మొదలు పెట్టాడు.
ఆ బ్రాహ్మణుని తీరుకు ఆశ్చర్యంతో ఖిన్నుడైపోయిన జ్యోతిబాకు అవమానం నరనరాన వ్యాపించింది. ఆ రాత్రి జ్యోతిరావు నిద్రపోలేదు. సమాజంలో సమానత్వం కోసం ఏం చేయాలన్న ఆలోచనతో రగిలిపోయాడు. సమాజంలో కింది వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రతిఘటన ఒక్కటే పరిష్కారమని జ్యోతిబా నిశ్చయించుకున్నాడు. ఒక లక్ష్యమే మానవుడిని తీర్చిదిద్దుతుందన్నమాట జ్యోతిరావు పట్ల నిజమైంది. ఒక వ్యక్తి పొందిన అవమానం జాతి మొత్తానికే జరిగిన అవమానంగా భాసించి ఆ జాతి పురోగతికి దారి తీసింది. జ్యోతిబా తను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణ యోగ్యంగా మల్చడానికి ఎంతో శ్రమించాడు. ఆ క్రమంలో ఆయనకు రాజకీయ దాస్యం కంటే సాంఘిక దాస్యం ధారుణమైంది, అది మనిషి మనుగడకు గొప్ప అవరోధంగా ఉందన్న విషయం అవగాహనకొచ్చింది. కాబట్టి ముందు దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలనుకున్నాడు.
‘జీవనది జలాలవలె వీరులు వారి గమనాన్ని వారే నిర్ణయించుకుంటారు’ అన్నట్టు సమాజంలోని ఒక పాఠశాల బాగుపడాలంటే వారికి, ముఖ్యంగా స్త్రీలకు విద్య కావాలనుకున్న జ్యోతిబా 1948లో నిమ్నజాతి బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాడు. ఒక శూద్రుడు శూద్రుల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన పాఠశాల అది. జ్యోతిబా చర్య అగ్రకుల సమాజంలో గొప్ప అలజడికి కారణమైంది. దాంతో వాళ్లు ‘ఆడపిల్ల చదువుకుంటే ఆమె భర్త అర్ధంతరంగా చచ్చిపోతాడు. స్త్రీ బుద్ధి ప్రళయాంకత: న స్త్రీ స్వాంత్య్ర మ్హసి’ అంటూ రకరకాల పుకార్లు లేవదీశారు. జ్యోతిబా హిందూ ధర్మ శాస్త్ర నియమాలను సవాల్‌ చేశాడు. ‘మనువు పెట్టిన ఆంక్షలకు కాలం చెల్లిపోయింది. మీరంతా నా వెంట రండి! చదువు మీకు ఆనందాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది’ అంటూ ఆడ పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చాడు. పూనే నగరంలో అప్పటికీ ఆడ పిల్లలకు పాఠాలు చెప్పడానికి స్త్రీలెవ్వరూ లేకపోవడంతో జ్యోతిబా తన భార్య సావిత్రిబాయిని ఉపాధ్యాయినిగా నియమించాడు. అప్పటికావిడింకా చదువుకోలేదు. కాబట్టి ముందు ఆవిడకు చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ఆవిడ కూడా భర్త అడుగు జాడల్లో నడవాలనుకుంది. కాబట్టి శ్రమనుకోకుండా ఏరోజు నేర్చుకున్న పాఠాలను ఆ రోజు తిరిగి పాఠశాలలో పిల్లలకు నేర్పసాగింది. అందుకు అగ్రకులస్థులు ఆవిడను అనరాని మాటలన్నారు. తిట్టగూడని తిట్లు తిట్టారు. అప్పుడావిడ నేను చేస్తున్నది తప్పుకానప్పుడు ఎవరో ఏదో అన్నారని ఎందుకు భయపడాలనుకున్నది. అలా బాలికల కోసం పాఠశాల తెరిచిన మొట్టమొదటి భారతీయుడు జ్యోతిబానే. భారతదేశానికి సంబంధించి మూడు వేల ఏండ్ల చరిత్రను తిరగేసి చూస్తే హిందూ సమాజంలోని కింది వర్గాలవారు పాఠశాలకు వెళ్లి చదువుకోవడం ఇదే మొదటి సారని తెలుస్తుంది. నిమ్నజాతులకు జ్ఞానద్వారాలు తెరుచుకోవడం అనేది ఓ గొప్ప చరిత్రాత్మక ఘటన. ఈ ఘటనకు కారకుడు జ్యోతిబా ఫూలేనే. శూద్రులలో మానసిక బానిసత్వాన్ని, మత మడ్యాన్ని తొలిగించాలనుకున్న జ్యోతిబా 1855లో ‘తృతీయ రత్నం’ అనే నాటిక రాశాడు. అందులో మూఢనమ్మకాలపైన తిరుగుబాటును ప్రోత్సహించాడు. దేవునిపేరుతో పుక్కిటిపురాణాలు ప్రచారం చేసి, కాకమ్మ కథలు చెప్పి నమ్మించే వారి గుట్టును బట్టబయలు చేశాడు.
ఓ రాత్రి జ్యోతిబాను చంపడానికి కొంతమంది అవ్రర్ణాలవారు ఇద్దరు నిమ్నజాతి వ్యక్తులకు చెరో వెయ్యి రూపాయలిచ్చి ఆయన ఇంటికి పంపిస్తారు. ఆ సమయంలో హఠాత్తుగా మేలుకున్న జ్యోతిబా తనను చంపవచ్చిన వాళ్లిద్దరినీ మాటల్లోకి దింపి అసలు విషయం రాబడతాడు. ఆ క్షణం నుండి వాళ్లిద్దరూ అతనికి అత్యంత ఆప్తులుగా మారిపోతారు. ఆయన నిర్వహిస్తున్న రాత్రిబాడిలో చేరి శ్రద్ధగా చదువుకుంటారు. వారిలో ఒకడు ఆయన వ్యక్తిగత అంగరక్షకుడుగానూ మరొకడు గొప్ప పండితుడుగానూ మారిపోయి సత్యశోధక్‌ సమాజంలో కీలకమైన వ్యక్తిలుగా మారిపోతారు. ఈ సంఘటనతో జ్యోతిబా వ్యక్తిత్వం ఎటువంటిదో మరోసారి ప్రపంచానికి తెలిసిపోయింది.
సమానత్వం, స్వేచ్ఛ, హేతువాదం పునాదులుగా సమాజం పురోగమించాలన్నది జ్యోతిబా ఆశయం. అందులో భాగంగానే సతీసహగమనం, వితంతు వివాహం మొదలైన దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఆరంభించాడు. అటువంటి దురాగతాలకు బలైనవారి పిల్లల కోసం దేశంలోనే మొట్టమొదటి శరణాలయాన్ని స్థాపించాడు. తన కార్యకలాపాలలో భాగంగా తను చేస్తున్న పనులకు సంబంధించిన అనుభవాన్ని జన బాహుళ్యానికి అందించాలన్న ఉద్దేశంతో జ్యోతిబా అనేక రచనలు చేశాడు. వాటన్నింట్లో ‘గులాంగిరి’ అనే రచన అత్యంత ప్రసిద్ధమైన రచన.
జ్యోతిబా ఏర్పాటు చేసిన సంస్థల్లో సత్యశోధక్‌ సమాజ్‌ చాలా ముఖ్యమైన సంస్థ. ఆ సంస్థ ద్వారా అనేక సమాజ హిత కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ సంస్థను పాడుచేయడానికి అగ్రవర్ణాలు అనేక విధాల ప్రయత్నించాయి. ఆ సంస్థవారు బ్రాహ్మణ పురోహితుల ప్రమేయం లేకుండా కేవలం ఆకు చెక్కలు పూల దండల మార్పిడితో అతి తక్కువ ఖర్చుతో వివాహాలు చేయడం మొదలు పెట్టారు. దానికి సంబంధించిన విధి విధానాలను జ్యోతిబానే రూపొందించారు. ఆ రోజుల్లో ఇదో గొప్ప సంచలన సంఘటనగా నిలిచిపోయింది. సంస్థ ఆధ్వర్యంలో బాల బాలికలకు అనేక విషయాల మీద వ్యాస రచన పోటీలు నిర్వహించి పెద్దల చేత బహుమతి ప్రదానాలు చేయించారు. ఇంకా బట్టల మిల్లులు, మున్సిపల్‌ కార్మికుల సంక్షేమంతోపాటు మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఎంతో చేశారు.
ప్రతి గ్రామంలో పాఠశాల, ప్రతి రైతుకూ ఆధునిక వ్యవసాయ పరికరాల అందుబాటు, మురికివాడల నిర్మూలన, అప్పులు లేని సుఖవంతమైన జీవితం, పరిశుభ్రమైన పరిసరాలు, కులం, పౌరోహిత్యం వంటివాటి నుండి విముక్తి కోసం శ్రమించి దు:ఖంతో, వేగిపోతున్న హృదయాలకు జ్యోతిబా ఊరటను, ఆశను కలిగించాడు. 1888లో కన్నాట్‌ ప్రభువు సమక్షంలో జ్యోతిబా ఉపన్యసించాడు. అదే సంవత్సరం ఆయన పూనే గౌరవ మెజిస్ట్రేట్‌గా నియమితుడయ్యాడు.
ప్రజా సేవే పరమావధిగా భావించిన కర్మయోగి అతను. అలాంటి ఆయనను సన్మానించుకోవడం తమ ధర్మంగా భావించుకున్న ఆనాటి నాయకులంతా కలిసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రజలందరి సమక్షంలో బరోడా మహారాజు ఆయనకు మహాత్మ అన్న బిరుదును ప్రదానం చేశాడు. అంత గొప్ప బిరుదు ఇవ్వడం ఆధునిక భారతదేశ చరిత్రలో అదే ప్రథమం. 1888 జూలైలో జోతిరావుకి ఆరోగ్యం దెబ్బతిన్నది. గుండెపోటు, దాంతోపాటు పక్షవాతం కూడా వచ్చింది. శరీరంలో కుడిభాగం అంతా చచ్చుబడిపోయింది. 1890 నవంబర్‌ 28 నాటికి జ్యోతిరావు ఆరోగ్యం విషమ స్థితికి చేరుకుంది. శూద్రులను, అతి శూద్రులను ఉద్దరించడం కోసం వారికి మానవతా హక్కులు కలిగించడం కోసం జీవితమంతా ధారపోసిన ఆ త్యాగమూర్తి ప్రశాంతగా కన్నుమూశాడు. వీరులు బతికుండగా పరుల కోసమే జీవిస్తారు. మరణించి నింగిలో చక్కలుగా మారిపోయి దారి చూపుతుంటారు. జ్యోతిరావు ఫూలే నింగిలో చుక్కగా మారి నేటికీ ఓ ఆశాజ్యోతిగా ప్రకాశిస్తూనే ఉన్నాడు.