• నామినేషన్లు వేసేందుకు సంఘ నేతల పయనం
  • నకిరేకల్‌ వద్ద పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు
  • సంఘం అధ్యక్షురాలు ధనలక్ష్మి, మరొకర్ని కూడా
  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోక్యంతో ఇద్దరి విడుదల
  • పాత కేసుల్లో కడెం కోర్టులో భూమన్న హాజరు
  • 14 రోజుల రిమాండ్‌ విధించిన న్యాయస్థానం
  • నా తండ్రి కిడ్నాప్‌.. ఈసీకి కుమారుడి ఫిర్యాదు
  • మేమేమన్నా ఉగ్రవాదులమా.. ఎందుకాపారు?
  • నామినేషన్లు వేసి తీరతాం.. ధనలక్ష్మి స్పష్టీకరణ

నల్లగొండ, సెప్టెంబరు 28 :సర్పంచుల డిమాండ్ల సాధనే ధ్యేయంగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో నామినేషన్‌ వేసేందుకు బయల్దేరిన సర్పంచుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ దాటాక ఆయనను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌, నిర్మల్‌ జిల్లా పోలీసులు శనివారం కడెంలో అరెస్టు చూపించారు. ఈ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. ఈనెల 27 శుక్రవారం ఉదయం భూమన్న యాదవ్‌, రాష్ట్ర అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి, సర్పంచ్‌ మల్లేశ్‌తోపాటు మరికొందరు సర్పంచ్‌లు సిరిసిల్లకు బయల్దేరారు. అక్కడ కలెక్టర్‌కు, ఓ సర్పంచ్‌కు తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. కామారెడ్డి దాటుకొని వెళ్తుండగా దోమకొండ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, తొలుత నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలనే యోచనతో హుజూర్‌నగర్‌ వైపు కదిలారు. సూర్యాపేట సమీపంలోని కేతపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌గేట్‌ వద్దకు చేరుకోగానే సుమారు 50 మంది సివిల్‌ డ్రెస్‌లో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వచ్చి ఒక్కసారిగా భూమన్నను అదుపులోకి తీసుకున్నారు.

సర్పంచ్‌ మల్లేశ్‌ను మరో పోలీస్‌ వాహనంలో ఎక్కించారు. ధనలక్ష్మిని ఆమె వాహనంలోనే ఉంచి అదుపులోకి తీసుకున్నారు. మూడు వాహనాల్లో వారిని ఎల్బీ నగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ మీదుగా ప్యాట్నీ సెంటర్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకోగానే ధనలక్ష్మి తన భర్త నారాయణకు విషయాన్ని తెలియజేశారు. వెనువెంటనే ఆయన పలువురు సర్పంచ్‌లతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. ఎందుకు అరెస్టు చేశారని సర్పంచ్‌లు ప్రశ్నించగా, తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పడం మినహా మరో సమాధానం ఇవ్వలేదు. దాంతో, నారాయణతోపాటు ఇతర సర్పంచ్‌లు బీజేపీ నాయకురాలు డీకే అరుణకు ఫోన్‌ చేసి విషయాన్ని తెలిపారు. ఆమె వెంటనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలిపారు. ఆయన డీజీపీతో మాట్లాడి సర్పంచ్‌లను విడుదల చేయాలని కోరారు. రాత్రి 10.30 గంటల సమయంలో భూమన్న మినహా మిగిలిన వారిని విడుదల చేశారు.

sశనివారం ఉదయాన్నే భూమన్నను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిర్మల్‌ వైపు తరలించినట్లు సమాచారం. దీనిపై ధనలక్ష్మి ప్రశ్నించగా, భూమన్నను నిర్మల్‌లో సరెండర్‌ చేస్తామని సమాధానం ఇచ్చారు. చివరికి, భూమన్నను అదుపులోకి తీసుకున్న కడెం పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్‌ విధించారు. భూమన్నపై నిర్మల్‌, కడెం పోలీసు స్టేషన్లలో 12 కేసులు ఉన్నాయని, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, భూమన్న అరెస్టుపై తనకు తెలియదని, ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని హోం మంత్రి మహమూద్‌ అలీ చెప్పారు. పోలీసులు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

మా నాన్నను కిడ్నాప్‌ చేశారు ఈసీకి భూమన్న కొడుకు ఫిర్యాదు : శుక్రవారం రాత్రి అరెస్టు చేసినా శనివారం మధ్యాహ్నం వరకు భూమన్న జాడ లేకపోవడంతో ఆయన కుమారుడు రమణ సీఈవో రజత్‌కుమార్‌ను కలిశారు. తన తండ్రి ఆచూకీ తెలపాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న తన తండ్రిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. 24 గంటల్లో తన తండ్రిని విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామన్నారు.

రేపు నామినేషన్లు: ధనలక్ష్మి : మేమేమన్నా టెర్రరిస్టులమా? నామినేషన్‌కు వెళితే అక్రమంగా అరెస్టు చేస్తారా? భూమన్నను ఒక్కొక్కచోట దాచిపెట్టి అరెస్టు చేయడం ఏమిటి? తెలంగాణలో సర్పంచులపై ఇంత దారుణమా?’’ అని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జూలూరి ధనలక్ష్మి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే కావాలని తమను అడ్డుకుందని, భూమన్నను అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు. ముందుగా అనుకున్నట్లుగానే ఉప ఎన్నికలో నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 30న సర్పంచ్‌లంతా హుజూర్‌నగర్‌కు చేరుకోవాలని ఆమె కోరారు.

కేసీఆర్‌.. మీకు నౌకర్లం కాదు: పాండుయాదవ్‌, సర్పంచ్‌ : కేసీఆర్‌.. మీకు నౌకర్లం కాదు. మేం ప్రజా సేవకులం. భూమన్నను బేషరతుగా విడుదల చేయాలి. లేకపోతే, రాష్ట్రంలో సర్పంచులంతా కలిసి పరిపాలన ఆపుతాం’’ అని సర్పంచ్‌ పాండు యాదవ్‌ హెచ్చరించారు. భూమన్నను అరెస్ట్‌ చేసి నిర్బంధించడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అఽఽధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. సర్పంచులకు అండగా ఉంటామని జనసేన తెలంగాణ ఇన్‌చార్జి శంకర్‌ గౌడ్‌ చెప్పారు.

Courtesy Andhrajyothi…