-మాస్కులు, గ్లౌజులు లేకుండానే విధులకు హాజరు
– తక్కువ వేతనాలు
– అధికమరణాల రేటు

ముంబయి : కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని మోడీ పిలుపు మేరకు ఈ నెల 22న ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే సయాబా కుంచికోర్వే వంటి పారిశుధ్య కార్మికులు మాత్రం ముంబయిలోని పలు వీధుల్లో చెత్తను ట్రక్‌లో లోడ్‌చేస్తూ గడిపారు. దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. వారంతా వైరస్‌ను నివారించే మాస్కులు, గ్లౌజులు లేకుండానే పనిచేస్తున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి చేతులు దులుపుకుంది. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా పరిసరాలను శుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులను మాత్రం పట్టించుకోవడంలేదు. వారికి కనీస సదుపాయాలు కల్పించకుండా కార్మికుల భద్రతను గాలికొదిలేసింది. రక్షణ పరికరాలు లేకుండా పనిచేయలేమని, సమ్మె చేస్తామని బెదిరించడంతో.. కాంట్రాక్టర్‌ తిరిగి వినియోగించలేని కొన్ని మాస్కులు, నాసిరకం గ్లౌజులు ఇచ్చారని ఒక కార్మికుడు తెలిపారు. ఒకరోజు అనంతరం వాటిని వినియోగించడం మానేశామని, అవి లేకుండానే పనిచేస్తున్నామని అన్నారు. కాగా లాక్‌ డౌన్‌ మొదలైన అనంతరం అత్యవసర సేవలతో పాటు కొన్నింటికి మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో పారిశుద్ధకార్మికులు కూడా ఉన్నారు. వేతనాలు కూడా సరిగా చెల్లించడం లేదని, లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగాయని, వాటిని కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని మరో కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు.

తక్కువ వేతనాలు
పారిశుద్ధ కార్మికులకు సరైన పరికరాలు అందించడం లేదని పీపుల్స్‌ హెల్త్‌ మూమెంట్స్‌ గ్లోబల్‌ కో ఆర్టినేటర్‌ టి.సుందరరామన్‌ తెలిపారు. వారు రెండు రోజులు పనిచేయకుండా మానేస్తే, ప్రజారోగ్య విపత్తుకు దారితీస్తుందని, చెత్త పెరిగిపోతుందని, ఇవి అంటువ్యాధులకు దారితీయవచ్చని ఆయన వెల్లడించారు. ముంబయిలోని 227 మునిసిపల్‌ వార్డుల్లో చెత్తను తొలగించేందుకు సుమారు 6,500 మంది కార్మికులు పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్థేశించిన కనీస వేతనం రూ. 625 కన్నా తక్కువగా, రోజుకి రూ. 250- 350 చెల్లిస్తున్నారని అన్నారు. ఘనవ్యర్థపదార్థాల నిర్వహణ విభాగంలో 28వేలమంది శాశ్వత సిబ్బంది ఉన్నారని, కాంట్రాక్ట్‌ సిబ్బంది వేతనంకంటే నాలుగు రెట్ల వేతనం, వ్యక్తిగత రక్షణ పరికరాలు, వైద్య బీమా, పదవీవిరమణ నిధులు, సెలవుభత్యం వంటి అదనపు ప్రయోజనాలు పొందుతున్నారని, కాంట్రాక్ట్‌ సంస్థల ద్వారా నియామకాలు పొందిన వీరికి ఎటువంటి భద్రత ఉండదని, కార్మిక చట్టాల నుండి తప్పించుకునేందుకు ఆర్నెల్ల కొకసారి వారిని మారుస్తూ ఉంటారని ఆయన అన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా యాంత్రీకరణతో పాటు రక్షణ పరికరాలు అందించడం, గాయాలు, వ్యాధులకు తగిన పరిహారం అందించడం వంటి ప్రయోజ నాలు కల్పించడంతో నష్టాలు తగ్గించవచ్చని సుందరరామన్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకునే అతిముఖ్యమైన చర్యల్లో ఒకటైన చేతులు కడుక్కోవడం కూడా తమకు సాధ్యంకాదని కార్మికులు తెలిపారు. సబ్బులు అందుబాటులో ఉండవని, దీంతో దుకాణాల నుండి షాంపు ప్యాకెట్లను కొనుక్కొని మునిసిపాలిటీ కార్యాలయం వద్ద చేతులు కడుక్కుంటామని వారు తెలిపారు. కరోనా వైరస్‌ భయంతో రూ. 100తో మాస్కులను కొనుగోలు చేసుకున్నామని జకీర్‌ హుస్సేన్‌ అనే మరో కార్మికుడు తెలిపారు. తమ భద్రతకు సంబంధించి అధికారులు ఎలాంటి సూచనలు చేయలేదని, సోషల్‌మీడియాలో వీడియోలు చూసి తామే జాగ్రత్తలు పాటిస్తున్నామని దక్షిణ ముంబయిలోని కొలాబాలోని మునిసిపల్‌ వార్డులో పనిచేస్తున్న హుస్సేన్‌ అనే కార్మికుడు తెలిపారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడంతో పోలీసులు అడ్డుకున్నారని, ఐడి కార్డు చూపినా తిరిగి వెళ్లాల్సిందేనని అన్నారని, దీంతో తాను రోజువారీ ఆదాయం రూ. 250 కోల్పోయానని అన్నారు.

అధిక మరణాల రేటు 
ఈ కాంట్రాక్టు కార్మికులు ముంబయిలోని మురుగుకాల్వలు , మ్యాన్‌హోల్స్‌, సెప్టిక్‌ట్యాంకులను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తుంటారని, వారిలో అధిక శాతం దళితులు, అట్టడుగు వర్గాలకు చెందినవారు. వీరిలో మరణాల రేటు అధికంగా ఉంటుందని, అనారోగ్యం, ఆల్కహాల్‌కు బానిస కావడం, ఇతర కారణాలతో.. చాలామంది పదవీవిరమణ కంటే ముందుగానే మరణిస్తారు. అంచనా ప్రకారం.. ఈ కార్మికుల మరణాల రేటు 15 నుండి 59 ఏళ్ల మధ్య పట్టణాల్లో ఉండే ఇతరుల కంటే ఐదురెట్లు అధికంగా ఉంటుంది.
పరిసరాలతో పాటు దేశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులను ప్రభుత్వాలు గుర్తించాలని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కార్మికుల సంఘం ఉపాధ్యక్షుడు హివ్రాల్‌ తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా గాని ఇతర కారణాలతో గాని కొన్ని రోజులు పారిశుధ్య కార్మికులు పనిచేయడం మానేస్తే ప్రజలు అంటువ్యాధులతో మరణిస్తారని ఆయన చెప్పారు.

Courtesy Nava Telangana