Image result for ఇసుక బుకీలు!"ఆన్‌లైన్‌ నమోదులో బ్లాక్‌ దందా
  నిమిషాల్లోనే బుకింగ్‌ పూర్తి
  టెక్నాలజీపై పట్టున్న వారితో లారీ యజమానుల అవగాహన
  ఒక మండలంలోనే రెండు వేల మంది
  విద్యార్థులు… చిరు వ్యాపారులకు ఇదో ఉపాధి
సుతారపు సోమశేఖర్‌

నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి.. బీటెక్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ బండ్లగూడలో ఉంటున్నాడు. సమీపంలోని సెల్‌ఫోన్‌ టవర్‌ దగ్గరకు వెళ్లి ల్యాప్‌ట్యాప్‌, డేటా కార్డుతో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌కు ప్రయత్నించడం ఇతని దినచర్య. బుకింగ్‌ అయితే లారీ యజమాని రూ. 2 వేలు ఇస్తాడు. వర్షాకాలంలో నా మిత్రుడికి రూ. లక్షల్లో ఆదాయం వచ్చింది. ఆర్‌ఆర్‌బీ పరీక్షకు చదువుతున్నా. ఖర్చులకు వస్తాయని రోజూ కొద్దిసేపు ప్రయత్నిస్తున్నాఅని ఆ విద్యార్థి చెప్పాడు.

ఇసుక అక్రమ దందాను అరికట్టడానికి ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రారంభించగా.. దానినీ చీకటి వ్యాపారంగా మార్చేశారు అక్రమార్కులు. టెక్నాలజీని అడ్డంపెట్టుకుని కొంతమంది తత్కాల్‌ రైల్వే టికెట్లను బ్లాక్‌ చేస్తున్నట్లే ఇసుక వ్యాపారులు కొందరు టెక్నాలజీపై పట్టున్న వారిని పెట్టుకుని ఇసుకను బ్లాక్‌ చేసేస్తున్నారు. క్రికెట్‌లో మాదిరే ఇక్కడా కొంతమంది బుకీలు తయారయ్యారు. ఫలితంగా సామాన్యులకు ఇసుక అందని పరిస్థితి నెలకొంది. వ్యాపారులు ఒక్కో బుకింగ్‌కు రూ.2 వేలు కమీషన్‌గా ఇస్తున్నారు. వర్షాకాలంలో కొరత సమయంలో ఒక్కో లారీకి రూ.10 వేలకు పైగా దక్కినట్లు సమాచారం.   నిమిషాల వ్యవధిలో రూ.వేలు వస్తుండటంతో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌కు ప్రయత్నించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పాటు చిన్నచిన్న దుకాణాల వారు సైతం ఆకర్షితులవుతున్నారు. ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. రాజధాని, శివారు మండలాల్లో ఇసుక బుకింగ్‌ కుటీర పరిశ్రమగా మారింది. నగరానికి సమీపంలోని ఒక్క మండలంలోనే ఇలా ప్రయత్నించే వారు రెండు వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. ఇలాంటి వారంతా వేగంగా బుక్‌ చేసి… అక్రమ వ్యాపారానికి సహకరిస్తుండడంతో నిమిషాల్లోనే బుకింగ్‌ పూర్తయిపోయి… అసలైన వినియోగదారులకు ఇసుక అందకుండా పోతోంది. తర్వాత జిల్లా స్థాయిలో కొంత సమయం అందుబాటులో ఉన్నా… దాన్ని కూడా అక్రమ వ్యాపారులే చేజిక్కించుకుంటున్నారు.

చౌటుప్పల్‌లోని జాతీయ రహదారి సమీపాన ఓ సెల్‌ఫోన్‌ టవర్‌ ఉంది. దానికి దగ్గరలో ఒక్కోచోట సగటున 4-8 మంది యువకులు.. అలా అయిదారు బృందాలు. దగ్గరలో మరో టవర్‌ దగ్గర కూడా ఇదే పరిస్థితి. ప్రతి ఒక్కరి వద్ద ఒక్కో ల్యాప్‌ట్యాప్‌. అందరి లక్ష్యం ఇసుక బుకింగ్‌ చేయడం. వీరిలో నెట్‌ సెంటర్‌ నిర్వాహకులు, ఇతర దుకాణాల వారున్నారు. ఇక్కడికి దగ్గర్లోని ఓ మండలంలో అయిదారు వందల లారీలున్నాయి. ఆ యజమానులు వీరితో అవగాహన కుదుర్చుకున్నట్లు సమాచారం. ‘ఇసుక బుకింగ్‌కు ప్రయత్నించే వారు ఈ ఒక్క మండలంలోనే 2 వేల మంది వరకు ఉన్నారు. వర్షాకాలంలో ఒక బుకింగ్‌కు రూ.10 వేల వరకు కమీషన్‌ వస్తుంది. అయితే ఇక్కడ నెట్‌ సరిగా ఉండదు. హైదరాబాద్‌కు వెళ్లి రూం తీసుకుని ఉంటాం. బుకింగ్‌లతో వచ్చిన ఆదాయంతో ఓ వ్యక్తి పెద్ద భవనం కట్టాడు. టీఎస్‌ఎండీసీ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్న వారు 25 వేలకు పైగా లారీల యజమానులు ఉంటే రోజుకు వెయ్యి మందికే ఇసుక దొరుకుతోంది. గరిష్ఠంగా 2 వేల మందికి దక్కితే గొప్ప. అందుకే యజమానులు మాపై ఆధారపడతారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్లు, స్క్రిప్టులతో ప్రయత్నిస్తాం. సాధారణంగా ఇసుక రీచ్‌, పరిమాణం వంటివి ఎంపిక చేసుకుంటూ వెళ్లాలి. లారీ నెంబర్‌, ఇసుక డెలివరీ చిరునామా, ఫోన్‌ నెంబర్లు టైప్‌ చేయాలి. దీనికి సమయం పడుతుంది. మేం ముందే ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటాం. మధ్యాహ్నం 12 గంటలకు బుకింగ్‌ మొదలు కాగానే లాగిన్‌ అయితే వెంటనే ఈ వివరాలు ఆటోమేటిగ్గా నమోదవుతాయి. ఇలా ఇతరుల కంటే మేం వేగంగా ముందుకెళతాం. అధికారులు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. ఆ ఎత్తులకు మేం పై ఎత్తులు వేస్తున్నాం’ అని ఓ వ్యక్తి ‘ఈనాడు’కు వివరించారు.

దిగిరాని ఇసుక ధరలు
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 స్టాక్‌యార్డుల నుంచి టీఎస్‌ఎండీసీ నిత్యం సగటున 25 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను సరఫరా చేస్తోంది. హైదరాబాద్‌లో వేసవిలో టన్ను ఇసుక రూ.1,200 ఉండేది. వర్షాకాలంలో అమాంతం పెరిగింది. వానలు తగ్గి 3-4 నెలలవుతోంది. ఈ సమయంలో కొద్ది రోజులు మాత్రమే తగ్గిన ధర మళ్లీ పైపైకి పోతోంది. ప్రస్తుతం టన్ను రూ.2,000-2,400 పలుకుతోంది. అసలైన వినియోగదారులు కాకుండా లారీ యజమానులు, వారి తరఫున కొందరు బుకింగ్‌ చేస్తూ అక్రమ వ్యాపారాన్ని పెంచుతున్నారు.

సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు
గతంలో ఒక్కో లారీకి నెలలో నాలుగుసార్లకే బుకింగ్‌ను పరిమితం చేయడం.. వినియోగదారుతో పాటు లారీ యజమానికీ ఓటీపీ నిబంధన.. బుకింగ్‌లో ఒక్కో ప్రక్రియ మధ్య కొంత నిరీక్షణ సమయం వంటి అనేక కొత్త నిబంధనలను టీఎస్‌ఎండీసీ ప్రవేశపెట్టింది. అయినా అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడలేదు. ఆన్‌లైన్‌ ఇసుక బుకింగ్‌లో ప్రైవేటు వ్యక్తుల అక్రమాలపై అధికారులు కొన్నాళ్ల కిందట సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్‌వేర్‌ పరంగా అక్రమాలకు ఇప్పుడు అవకాశం లేదని.. ఇసుక లారీ యజమానులందరికీ బుకింగ్‌ అవకాశాలు వస్తున్నాయని టీఎస్‌ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి.

(Courtesy Eenadu)