డా. గుఱ్ఱం సీతారాములు

మన పురాణ ఇతిహాసాలు, వాటి ప్రక్షిప్తాలు కొందరిని అవతారికులుగా మరికొందరిని రాక్షసులుగా చిత్రించాయి. రాక్షసులుగా నమోదు కాబడిన వాళ్ళు ఆధిపత్య చట్రంలో ఇమడని వెలివేతకు గురి అయినవాళ్ళు అనే చైతన్యంతో రచనలు చేసాడు కనుకనే ఇప్పుడు త్రిపురనేని రామస్వామి రచన ‘శంబుక వధ’కు ప్రాసంగికత ఉన్నది.

పదేళ్ళ క్రితం నాటి మాట. హైదరాబాద్‌లోని ఆంగ్లమూ, విదేశీ భాషల విశ్వవిద్యాలయంలో ఒక మరిచి పోలేని సంఘటన జరిగింది. కొత్తగా అక్కడ చేరిన మాకు రాబోయే రోజుల్లో మా రాజకీయ, బౌద్ధిక ఆచరణ ఎలా ఉండాలో పునాదిగా పనిచేసిన ఉదంతమది. అప్పటివరకూ డీమ్డ్ యూనివర్సిటీగా ఉన్న ఆ సంస్థ కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మారింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల, దేశాల పరిశోధకులు నిత్య చర్చలతో జ్వలిస్తూ ఉండేవారు. కేంపస్ విస్తరణలో భాగంగా కొత్త భవనాల నిర్మాణాల సందర్భంగా కొందరు పూజారులు యేవో పూజాతంతు చేస్తున్నారు. మా సీనియర్లు కొంతమంది దానిని తీవ్రంగా వ్యతిరేకించి అక్కడ జరుగుతున్న క్రతువును అర్ధాంతరంగా ఆపేశారు.

ఆ సంఘటన జరిగాక రెండు మూడు ఏళ్ళకి పెద్ద ఎత్తున గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా మొదలయ్యాయి. పెద్ద పెద్ద డిజే డాన్సుల మధ్య నిమజ్జన ర్యాలీలు అరుపులతో కాస్త ప్రోగ్రెసివ్‌గా ఉండే ప్రొఫెసర్ క్వార్టర్‌ల ముందు మరింత హంగామా చేయడం దాకా వెళ్ళింది. మరుసటి ఏడు నవరాత్రికి ఒక ప్రత్యామ్నాయ ఆలోచన మొదలు పెట్టాము. తెలంగాణ, బెంగాల్, కేరళ, కన్నడ విద్యార్థి మిత్రులం ఒక వినూత్నమైన ఆలోచన చేసాము. గణపతి నవరాత్రులు జరగనున్న తొమ్మిది రోజులు ‘అసుర ప్రైడ్’ పేరుతో మహా సంబరాలు చేయాలి అని నిర్ణయించుకున్నాము. ముందుగా మేము అందరమూ సామాజిక మాధ్యమాలలో మా పేర్లను మార్చుకొని రావణ, శూర్పణఖ, తాటకి, మహిషాశుర, నరకాసుర లాంటి పేర్లతో పిలుచుకోవడం మొదలు పెట్టాము. ఆ క్రమంలో నా పేరు సీతారావణ అయ్యింది. మరికొందరు తమ పేర్ల చివర కులం ఇంటి పేర్లు తొలగించి ‘రాక్షసులుగా’ ‘విద్రోహులుగా’ చిత్రించ బడ్డ పేర్లను ఎన్నుకున్నాము. ముఖ్యంగా పురాణ పాత్రలు, అన్యాయంగా చంపివేయ బడ్డ పురాణ ప్రతీకలు ఎంచుకున్నారు. ఆ పేర్లతో సంబోధన చేసుకుంటూ. ఆ క్రమంలో నిలువెత్తు శూర్పణఖ ముక్కు ఆకృతిని తయారుచేసి ప్రదర్శన చేసి కేంపస్ ముందు నిలబెట్టి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాము.

ఆ తొమ్మిది రోజులు మాకొక నిజమైన పండగ వింత అనుభవం. పురాణ ప్రతీకలను అస్తిత్వ రాజకీయాల ప్రతీకలుగా, స్వాభిమాన చిహ్నాలుగా ముందుకు తెచ్చాము. అంతిమంగా నాటి ప్రశ్నలు నిజంగా మాలో సరికొత్త ఆలోచనల, అన్వేషణల దిశగా సాగాయి. ఆ నాడు మేము ఆ పని చేయడానికి మాలో చాలా మంది సబాల్ట్రన్ ఆలోచన దిశగా పరిశోధన చేస్తున్నవాళ్ళం కావడం ఒక కారణం. ఆ పరిశోధనలు, అధ్యయనాలు; నూతన సాంస్కృతిక ఉద్యమాల ప్రేరణ స్ఫూర్తి, సంఘర్షణ ఇంతవరకూ సరిగా నమోదు చేసుకోలేక పోయాము. నాడు ఎఫ్లూలో ఆరడుగుల నిలువెత్తు శూర్పణఖ ముక్కు అది లేవనెత్తిన ప్రశ్నలు చిన్నవి కావు. ఆధిపత్య ధోరణితో పురుషాహంకారంతో కోయబడిన శూర్పణఖ ముక్కు మాకో దారిచూపింది.

కానీ ఈ పని సరిగ్గా వందేళ్ళ క్రితమే జరిగిన విషయం ‘శంబుక వధ’ అనే నాటకం చదివాక కానీ అర్థం కాలేదు. ఒక రైతు బిడ్డ కృష్ణా జిల్లా నుండి ఐర్లాండ్ దాకా వెళ్లి న్యాయ శాస్త్రాన్ని చదువుకొని ఆధునిక విద్యనూ, భావసంపత్తినీ, ద్రావిడ స్వాభిమాన స్ఫూర్తిని తొలిసారి సాహిత్య చర్చలోకి తీసుకువచ్చాడు. కవి రాజు త్రిపురనేని రామస్వామి ఆ తొలి ఆధునిక భావుకుడు. నేటికి వందేళ్ళ కింద రాయబడిన ‘శంబుక వధ’ ప్రచురణకు ముందే అనేక ప్రదర్శనలతో రామాయణ కావ్య రచనను పూర్వపక్షం చేసిన సాహసి.

ఒక శతాబ్దం క్రితం తెనాలిలోని ‘రైతు ముద్రాక్షరశాల’ ప్రచురించిన ‘శంబుక వధ’ నాటి నాటక సాహిత్యంలో ఒక సంచలనం. ఇరవై ఆరు పేజీల ముందుమాటతో ప్రచురించబడిన నాలుగు అంకాల చిరుపొత్తం అది. తొలి సామాజిక కవులు వేమన, పోతులూరి వీరబ్రహ్మం తర్వాత తెలుగు సాహిత్యంలో తొలి తిరుగుబాటు రచన త్రిపురనేని ‘శంబుక వధ’. ఈ నాటక కథ రామాయణ ఉత్తరకాండ లోనిది. క్లుప్తంగా మాట్లాడుకుంటే వర్ణాశ్రమ ధర్మాలను ధిక్కరించి శూద్రుడు యజ్ఞ యాగాదులు చేయడం. అకాల మరణాలు లేక, ధర్మం నాలుగు పాదాల మీద నడవబడుతున్నది అని చెప్పబడిన శ్రీరాముడి పాలనలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అకాల మృత్యువు బారిన పడ్డ తన కొడుకు దేహాన్ని మోసుకుని వచ్చి శ్రీరామునికి చూపించి నీ పాలనలో ఏదో అధర్మం జరిగింది కాబట్టే నా కొడుకు నాకు దూరం అయ్యాడు. జరిగిన అధర్మాన్ని నిర్మూలిస్తే చనిపోయిన నా కుమారుడు తిరిగివస్తాడు అన్నాడు. అంతిమంగా నాటి యుగ ధర్మాన్ని ధిక్కరించి శంబుకుడు అనే శూద్రుడు, ఆర్యేతరుడు తపస్సు చేశాడు. ఇదే శంబుకుని మీద మోపబడ్డ అభియోగం. ఆ అనర్థానికి కారణం ద్రావిడ జాతి వాడు అయిన శంబుకుడు వేదాధ్యయనం చేయడం. దాని మూలంగా ఆ బాలుడు చనిపోయాడు అనే నిర్ధారణ చేస్తారు. రామాయణంలో అమానవీయంగా చంపబడిన శంబుకుని హత్య నేపథ్యంలో రాయబడిన ఈ నాటకంలో ప్రధాన పాత్రలు శ్రీరాముడు, వశిష్టుడు, అంగదుడు, శంబుకుడు ఆయన శిష్యులు.

‘యశ్య రాష్ట్రే నృపాలష్య తురీయశ్చ తపోదన! తత్ర తధ్యం భవత్యేన విప్ర బాలస్య మారణమ్’– ఏ రాజు రాజ్యమునందు శూద్రుడు తపస్సు జేయుచున్నాడో యచ్చటనే యకాలముగా విప్రబాలురకు మరణము సంభవించు తీరునని స్మృతి వాక్యము చెప్పుచున్నది. ‘ఎక్కడో అడవిలో తపస్సు చేసుకుంటున్న శంబుకుని తపస్సు వలన బాలుని మరణం ఎలా సాధ్యం, నాకు ఇది సమంజసం అనిపించడం లేదు’ అన్న శ్రీరాముని మాటకు గురువు వశిష్టుడు సమాధానమిస్తూ, ‘ఇది కార్యకారణ సంబంధాల కోసం ఆలోచించే సందర్భం కాదు వంశ గురువుగా నేను చెబుతున్నాను శాస్త్ర ప్రకారమే ఇది న్యాయం అని నేను నమ్ముతున్నాను. ఒక నాడు విశ్వామిత్రుని వాక్యానుసారం తాటకిని వధించ లేదా? స్మృతి ధిక్కారము చేత బ్రాహ్మణ హంతకుడు శంబుకుడు శిక్షకు అర్హుడు’ అని వక్కాణించాడు. అంతిమంగా మీ ఆజ్ఞను ధిక్కరించలేను అన్న శ్రీరాముడితో సూర్యవంశులు ఏనాడూ గురు తిరస్కారం చేసి ఎరగరు అని వశిష్టుడు అంటాడు. శంబుకుని హత్య ప్రధానంగా శ్రీరాముని గురువు అయిన వశిష్టుని ఆదేశానుసారం జరిగినట్టుగా ఉంది.

ఎప్పుడో వందేళ్ళ కింద రాయబడిన శంబుకవధ నాటక ప్రాసంగికత ఇప్పుడు ఏముంది అని అడగవచ్చు. ఎప్పుడో తెగేసిన ఏకలవ్యుని బొటనవేలు, అక్రమంగా నరకబడ్డ బలి, బర్బరీకుడితలలు, వారికి జరిగిన అన్యాయాలకు ఇప్పుడు ఎవరిని బాధ్యులను చేయగలము అనే ప్రశ్న ఉత్పన్నం అవొచ్చు. వేల ఏళ్ళ కింద గ్రీకు పురాణాలు ఆ దేశ చరిత్ర రచనకు మూలాధారమయ్యాయి. మన పురాణ ఇతిహాసాలు వాటి ప్రక్షిప్తాలు కొందరిని అవతారికులుగా మరికొందరిని రాక్షసులుగా చిత్రించాయి. రాక్షసులుగా నమోదు కాబడినవాళ్ళు ఆధిపత్య చట్రంలో ఇమడని వెలివేతకు గురి అయినవాళ్ళు అనే చైతన్యంతో రచనలు చేసాడు కనుకనే ఇప్పుడు రామస్వామి రచనకు ప్రాసంగికత ఉంది అనిపిస్తోంది.

(త్రిపురనేని రామస్వామి ‘శంబుక వధ’
నాటక ప్రస్థానానికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా)

Courtesy Andhrajyothi