పది’లో పది సాధనపై దృష్టి..
ఇప్పటికే సెట్‌, ఫ్రీఫైనల్‌ పరీక్షలు
80 శాతం మార్కులు సాధించిన అవిభక్త కవలలు
స్కైబ్‌లు  వద్దన్నారు..  అయినా.. ఏర్పాటు చేసిన అధికారులు
వీరికి అదనంగా అరగంట..
మొదటి సారి బోర్డు పరీక్షలకు..  

వెంగళరావునగర్‌, మార్చి : అవిభక్త కవలలు వీణా-వాణిలు పదో తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారు సెట్‌, ప్రీ ఫైనల్‌ పరీక్షలు కూడా రాశారు. బోర్డు నిర్ణయం మేరకు ఇద్దరికి వేరువేరుగా హాల్‌ టికెట్లను అందజేశారు. వీణా-వాణిలో పరీక్షలు రాసే సామర్థ్యం ఉందా, లేదా, వైద్యుల సలహా మేరకు పరీక్షించి ఎస్సెస్సీ బోర్డు వారికి వేరువేరుగా హాల్‌ టికెట్లు జారీ చేసింది. అవిభక్త కవలలు స్ర్కైబ్‌ (సహాయకులు) వద్దని చెప్పారు. అయితే, వీణ తల కొంచెం పైకి ఉంటుంది. వాణి తల కిందికి ఉంటుంది. దీంతో వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను వారికి సహాయకులుగా అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.

2019లో పదో తరగతి అడ్మిషన్‌..
అవిభక్త కవలలకు  మహిళా సంక్షేమ శాఖ అధికారులు 2019 ఆగ్‌స్టలో వెంగళరావునగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో అడ్మిషన్‌ ఇప్పించారు. అయితే, వారు పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉపాధ్యాయులకు స్టేట్‌ హోంకే పంపించి, చదువు చెప్పించా రు. వారు ఉపాధ్యాయులు చెప్పే వాటిని అర్థం చేసుకోవడమే కాకుండా సెట్‌, ప్రీ ఫైనల్‌ పరీక్షలు రాశారు. వీణా-వాణిలు ఇంగ్లిష్‌ మీడియం లో పరీక్ష రాయనున్నారు. వారి కోసం గణితం, ఫిజిక్స్‌, ఇంగ్లి్‌షకు ముగ్గురు ట్యూటర్లను ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించారు. చదువుకునే సమయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్యూటర్లు, పిల్లలకు సాయం అందించేందుకు ఇద్దరు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.

ఒకరు పుస్తకం.. మరొకరు అద్దం..
పరీక్షలకు సిద్ధమవుతున్న వీణా-వాణిల
 
తీరు చూస్తే అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. పదో తరగతి పూర్తి చేయాలనే వారి పట్టుదలకు ట్యూటర్లు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఒకరు పుస్తకం పట్టుకుంటే, మరొకరు అద్దంలో చూస్తూ చదువుతున్నారు. ఒకరు రాస్తే, మరొకరు పుస్తకం పట్టుకుని చెబుతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీరిరువురు కింద కూర్చుని పరీక్ష రాయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరూ స్వయంగా పరీక్ష రాస్తామని చెబుతున్నా.. ఎక్కువ సేపు రాయలేరని వారికి నచ్చచెప్పి ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేస్తున్నారు.

అరగంట అదనం.. 
ఈ నెల 19 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీరు మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్‌లోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే, వీణా-వాణిలకు మాత్రం అరగంట సమయం ఎక్కువగా కేటాయిస్తున్నారు. వారికి 12.45 వరకు గడువు ఇస్తున్నారు. వారు పరీక్ష రాసిన అనంతరం జవాబు పత్రాలను కూడా అందరితో కలపకుండా వేరుగా ప్యాక్‌ చేసి ఎస్సెస్సీ బోర్డుకు పంపించనున్నారు. పరీక్షా కేంద్రంలో వీణా-వాణిలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీరు కింద కూర్చొని పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యూసు్‌ఫగూడలోని మహిళా శిశు సంక్షే మ శాఖ ప్రాంగణంలోని స్టేట్‌ హోంలో ఉంటున్న వీణా-వాణిలను పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లడానికి ప్రత్యేక వాహనాన్ని కూడా ఏర్పాటుచేయనున్నారు. వీరు ఇప్పటికే రాసిన సెట్‌, ప్రీఫైనల్‌ పరీక్షల్లో 80 శాతం మార్కులు సాధించారు. కాగా, పదో తరగతి పరీక్షల్లో పదికి పది గ్రేడ్‌ మార్కులు సాధిస్తామని వీణా-వాణీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Andhrajyothi