పారిశుధ్య కార్మికులకు షేక్‌హ్యాండ్‌ ఇస్తారా? : సుప్రీం

న్యూఢిల్లీ : దేశంలో నిజంగా అంటరానితనం సమసిపోయిందా? అంటూ సుప్రీంకోర్టు సంచలనాత్మక ప్రశ్న వేసింది. ఈ ప్రశ్న మీ అందరికి అంటూ ఓపెన్‌ కోర్టులో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంటరానితనం కేవలం చట్టంలో మాత్రమే నిర్మూలితమైందని అభిప్రాయపడింది. మీరంతా పారిశుధ్య కార్మికులకు కనీసం కరచాలనమైనా ఇస్తారా? అని ప్రశ్నించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌పై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పారిశుధ్య కార్మికుల మృతులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి భద్రతా పరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యాన్ని లేవనెత్తుతూ మోడీ సర్కారుపై మండిపడింది. ఇప్పటి వరకు కేంద్రం తీసుకున్న చర్యలేమిటనీ, వైఫల్యమెక్కడున్నదని సర్కారు తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ను ప్రశ్నించింది.

ఎలాంటి మాస్కుల్లేకుండా పౌరులను గ్యాస్‌ చాంబర్‌(మ్యాన్‌ హౌల్‌)లోకి ఏ దేశంలోనూ పంపడం లేదని, పారిశుధ్య కార్మికులకు మాస్కులు, ఆక్సిజన్‌ సిలిండర్‌ సౌకర్యల్లాంటి రక్షణ చర్యలు ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని అడిగింది. ఇది అమానవీయం, అనాగరికమని వ్యాఖ్యానించింది. సాటి మనుషులతో ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడింది.
దీనిపై స్పందిస్తూ.. కేవలం గ్యాస్‌ చాంబర్‌లే కాదు.. రోడ్లపై గుంతలతోనూ అనేకులు చనిపోతున్నారని అటార్నీ జనరల్‌ సాధారణీకరించే ప్రయత్నం చేశారు. మన దేశంలో టోర్ట్‌ లా అమలు జరగడం లేదని తెలిపారు.

కాగా, సఫాయి కార్మికులపై వివక్షను ధర్మాసనం వివరిస్తూ.. మనుషలందరూ సమానమే. అందరూ సమానమే అయినప్పుడు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని సూచించింది. కానీ, మీరు సమాన అవకాశాలు ఇవ్వకపోవడమే కాదు.. కనీసం వారిని వారు శుభ్రపరుచుకునే కనీస సదుపాయాన్ని కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటరానితనం తొలగిపోయిందా లేదా అని మీకు మీరుగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి తెలుస్తుందని వివరించింది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పును రిజర్వులో పెట్టింది.

(Courtacy Nava Telangana)