• గ్రామాల్లో గిరాకీ కరువు
  • భారీగా తగ్గిన ‘వినియోగ’ ఖర్చులు
  • 40 ఏళ్లలో ఇదే మొదటిసారి.. అల్లాడుతున్న గ్రామీణ భారతం
  • ఎన్‌ఎ్‌సఓ సర్వే వెల్లడి.. నివేదికను తొక్కిపెట్టిన సర్కార్‌

దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి. ‘వినియోగ’ ఖర్చులు గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పడిపోయాయి. ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రజలు బలవంతంగా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. తప్పనిసరైతే తప్ప ‘వినియోగ’ ఖర్చులకు పోవడం లేదు. దేశానికి వెన్నెముకగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. 2017 జూలై – 2018 జూన్‌ మధ్య కాలంలో జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ ఎస్‌ఓ) దేశవ్యాప్తంగా జరిపిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సంవత్సరం జూన్‌లో ఈ సర్వే వివరాలు ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ పెద్దలు అడ్డు చెప్పడంతో ఈ నివేదిక ఇంకా వెలుగుచూడలేదు.

తగ్గిన గృహ ఖర్చులు..
ఈ సర్వే ప్రకారం 2011-12లో సగటున రూ.1,501గా ఉన్న గృహ వినియోగ ఖర్చు లు, 2017-18లో 3.7 శాతం తగ్గి రూ.1,446కు చేరాయి. ఈ ఖర్చులు తగ్గడం గడచిన 40 ఏళ్లలో ఇదే మొదటిసారి కావటం గమనార్హం. 2009-10 సంవత్సరం ద్రవ్యోల్బణం ప్రాతిపదికన నిర్ణయించిన ‘వాస్తవ’ అంచనాల ప్రకారం ‘భారత్‌లో గృహ వినియోగ ఖర్చులు-కీలక సూచీలు’ పేరుతో ఎన్‌ఎ్‌సఓ ఈ సర్వేను రూపొందించింది.

గ్రామీణం విలవిల
వినియోగ ఖర్చులు విషయంలో పట్టణ ప్రాంతాల పరిస్థితి ఇప్పటికీ కొంత మెరుగ్గానే ఉంది. గ్రామీణ ప్రాంతంలో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2017-18లో గ్రామీణ భారతంలో వినియోగ ఖర్చులు 8.8 శాతం పడిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం గత ఆరేళ్లలో ఖర్చులు ఏటా సగటున రెండు శాతం చొప్పున పెరిగాయి.

ఆహార ఖర్చులపైనా ప్రభావం
వినియోగ ఖర్చుల తగ్గుదల ప్రభావం ప్రజల ఆహార వినియోగాన్ని దెబ్బతీస్తోంది. 2011-12లో గ్రామీణ ప్రజలు ఆహారంపై నెలకు సగటున రూ.643 ఖర్చు చేస్తే.. 2017-18లో అది రూ.580కి పడిపోయింది. ఇదే సమయంలో పట్టణ పాంతంలో నెలవారీ సగటు ఆహార ఖర్చులు రూ.943 నుంచి రూ.946కు పెరిగాయి. ఖర్చులకు భయపడి గ్రామీణ ప్రాంతాల్లో పాలు, పాల ఉత్పత్తులు తప్ప.. అన్ని ఆహార పదార్ధాల ఖర్చుల్ని ప్రజలు తగ్గించుకుంటున్నారని ఎన్‌ఎ్‌సఓ సర్వే పేర్కొంది.

చుక్కలంటిన నిరుద్యోగం
వినియోగ డిమాండ్‌ భారీగా పడిపోవటంతో ఆ ప్రభావం ఉపాధి అవకాశాలపైనా కనిపిస్తోంది. 2017-18లో మొత్తం పనిచేయగల జనాభాల్లో 6.1 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. గత 45 సంవత్సరాల్లో దేశంలో నిరుద్యోగ రేటు ఎన్నడూ ఈ స్థాయిలో లేదు. 2011-12లో ఇది కేవలం 2.2 శాతం మాత్రమే.

ఆ నివేదిక బయటపెట్టం..
ఐదు నెలలుగా ఈ నివేదికను తొక్కిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ఈ విషయం ప త్రికలకు పొక్కడంపై ఆత్మరక్షణలో పడింది. ఈ నివేదిక కోసం ఎన్‌ఎ్‌సఓ సేకరించి న సమాచారం (డేటా) విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఈ సమాచా ర నాణ్యత సరిగా లేదని, అందుకే ఈ నివేదిక విడుదల చేయడం లేదని తెలిపింది. ప్రభుత్వానికి అందిన ఈ నివేదికను ‘ముసాయిదా’ నివేదికగా చూడాలే తప్ప.. తుది నివేదికగా కాదని గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది.

పెరిగిన పేదరికం
ఆదాయం తగ్గి వినియోగ ఖర్చులు తగ్గడంతో ఆ ప్రభావం పేదరికంపైనా పడిందని ఆర్థిక నిపుణుల అంచనా. ఈ ప్రభావంతో దేశంలో పేదల సంఖ్య ఎంత లేదన్నా 10 శాతం వరకు పెరిగి ఉంటుందని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ అండ్‌ ప్లానింగ్‌ కేంద్ర అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హిమాన్షు చెప్పారు.

Courtesy andhrajyothy..