– అగ్రిమెంటు షరతుతో ఇక్కట్లు
– సాగు హక్కు కార్డుల మంజూరులో జాప్యం
– అమరావతి బ్యూరో
భూ యజమానితో, కౌలుదార్లు అగ్రిమెంట్‌ చేసుకోవాలనే నిబంధన సాగు హక్కు కార్డు (క్రాప్‌ కల్టివేషన్‌ రైట్స్‌ కార్డు-సిసిఆర్‌సి) మంజూరుకు అడ్డంకిగా మారింది. దీంతో కార్డుల మంజూరు ప్రకియ నత్తనడకన సాగుతోంది. మంజూరు ఆలస్యమయ్యేకొద్దీ కౌలు రైతులకు అందాల్సిన పలు పథకాలు, రుణాలు, సబ్సిడీలు అందక నష్టపోవాల్సి వస్తోంది. గతంలో ఎల్‌ఈసి కార్డులు మంజూరుకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ఎవరు భూ యజమాని, ఎవరు కౌలుదారుడు అనే విషయాన్ని గుర్తించి ఎల్‌ఈసి కార్డులు మంజూరు చేసేవారు. కొత్త చట్టం ప్రకారం భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తి, భూ యజమాని సంతకంతో కౌలు అగ్రిమెంటు చేసుకోవాలి. దాన్ని విఆర్‌ఓ సర్టిఫై చేశాక సిసిఆర్‌సి మంజూరు చేస్తారు. అయితే, ఈ ప్రకియలో భూ యజమానులు కౌలు అగ్రిమెంట్‌ సంతకం చేయడానికి ముందుకు రాక పోవడం కౌలుదార్ల పాలిట పెద్ద అడ్డంకిగా మారింది. పంట సాగుదార్ల హక్కుల చట్టం-2019లో పేర్కొన్న నిబంధనలు కౌలు రైతులకు అడ్డంకిగా మారాయి. కౌలుదారులకు సాగు హక్కు కార్డుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కౌలు రైతులు ప్రభుత్వ పరంగానో లేక బ్యాంక్‌ ల ద్వారా సహాయం, సబ్సిడీలు పొందాలంటే సిసిఆర్‌సి తప్పనిసరి. పాత చట్టం ప్రకారం అయితే కౌలుదార్లకు గ్రామ సభ ఆధారంగా అధికారులు రుణ అర్హత కార్డు (ఎల్‌ఇసి), సాగు ధృవీకరణ పత్రం (సిఒసి) ఇచ్చేవారు. వాటి ఆధారంగా రుణం లభించేది. గత ఏడాది (2018-19) ఎల్‌ఈసి కార్డులు, సిఓసి కార్డులతో కలిపి 10లక్షల 95వేల 649 మంది మంజూరు చేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. కాని శుక్రవారం నాటికి 17,642 గ్రామాల్లో సిసిఆర్‌సి కార్డులు కేవలం 1,56,097 మాత్రమే మంజూరు చేశారని ఉన్నతాధికార్ల సమీక్షలో తేలింది. 2016లో ప్రొఫెసరు రాధాకృష్ణకమిటీ రాష్ట్రంలో 24లక్షల 25 వేల మంది కౌలు రైతులు ఉన్నట్లు పేర్కొంది. నేడు ఈ సంఖ్య 32లక్షలకు పైగా చేరి ఉంటుందని అంచనా. ఆ ప్రకారం చూస్తే కౌలుదార్లలో సుమారు ఐదు శాతం మందికి మాత్రమే సాగు హక్కు కార్డులు మంజూరయ్యాయి. గత ఏడాది మంజూరు చేసిన కార్డుల సంఖ్యతో పోల్చినా ఈ ఏడాది వైసిపి ప్రభుత్వం 15 శాతం మందికి మాత్రమే సిసిఆర్‌సి కార్డులు పంపిణీ చేయడాన్ని కౌలు రైతు సంఘాలు, వ్యవసాయకార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. అత్యధిక దరఖాస్తులు గ్రామ వాలంటీర్‌ వద్దే పెండింగ్‌ లేక తిరస్కరణ లేదా వాయిదా పద్దతిలో ఆగిపోతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. జిల్లాల వారీగా గమనిస్తే అంకెల్లో భారీ వ్యత్యాసం కనబడుతోంది.

Courtesy Prejasakti