* రూ.10 వేల పథకానికి అర్హత కోల్పోయిన 4.60 లక్షల మంది డ్రైవర్లు
* సడలించాలని డిమాండ్‌
రాష్ట్ర ప్రభుత్వం ఆటో, క్యాబ్‌, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయం పథకానికి నిర్ధేశించిన నిబంధనల వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఆటోడ్రైవర్లు అర్హత కోల్పోయారు. ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ను మాత్రమే అర్హులుగా పేర్కొనడంతో కేవలం 30 శాతం మందికి మాత్రమే లబ్ది చేకూరే అవకాశం ఉంది. ఫైనాన్స్‌ ద్వారా ఆటోలు కొనుగోలు చేసిన వారు, అద్దెకు వాహనాలు నడిపే వారు పెద్ద సంఖ్యలో అర్హత కోల్పోయారు. నిబంధనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ మందికి లబ్ది చేకూర్చాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ పథకానికి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 6.97 లక్షల వరకూ వాహనాలున్నట్లు రోడ్డు రవాణా శాఖ అంచనా. వీటిల్లో 48 వేల వాహనాలు ఒకటి అంతకంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌ కలిగి ఉన్నాయి. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం 1,75,194 మంది ఆన్‌లైన్‌లో, మరో ఏడు వేల మంది ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 4.60 లక్షలకుపైగా డ్రైవర్లు దరఖాస్తుల ప్రక్రియలోనే అర్హత కోల్పోయారు. దరఖాస్తు చేసుకున్న వారిలోనూ 78,977 మంది దరఖాస్తుల పరిశీలన పూర్తవగా, 58,539 మందికే అప్రూవ్‌ చేసి, మిగిలిన వాటిని తిరస్కరించారు. దరఖాస్తు చేయని వారితోపాటు, దరఖాస్తు చేసుకున్న వారికీ వడపోత కార్యక్రమం చేపట్టారు.
దీంతో పథకంపై ఆటోవాలాలు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న ఆటోల్లో 70 శాతంపైగా ఫైనాన్స్‌ ద్వారా కొనుగోలు చేసినవే. డ్రైవర్లు అయితే ఆర్థిక ఇబ్బందులతో కిస్తీలు చెల్లించలేక, మధ్యలోనే ఓనర్‌షిప్‌ ఒదులుకుంటున్నారు. దీంతో తిరిగి ఫైనాన్షర్స్‌ ద్వారా ఒక ఆటో నాలుగు ఐదు చేతులు మారుతోంది. ఆర్‌టిఎ నిబంధనల ప్రకారం మొదట ఎవరి పేరుతో ఆటో రిజిస్ట్రేషన్‌ అయిందో, వారు ప్రత్యక్షంగా హాజరై రిజిస్ట్రేషన్‌ బదలాయిస్తేనే ప్రస్తుతం నడుపుతున్న వారికి ఓనర్‌షిప్‌ దక్కుతుంది. కానీ నాలుగైదు చేతులు మారడంతో మొదట కొనుగోలు చేసిన వారు అందుబాటులో లేక ప్రస్తుతం నడుపుతున్న వారికి ఓనర్‌షిప్‌ దక్కట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సాయానికి అలాంటి వారంతా అర్హత కోల్పోయారు. ఫైనాన్స్‌ ద్వారా కొనుగోలు చేసిన ఆటోలకు అగ్రిమెంట్‌ ఆధారంగా సాయం అందించాలని కోరుతున్నారు. అలాగే ప్యాసింజర్‌ ఆటోలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ట్రాలీ ఆటోలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నా వారికి అవకాశం లేదు. అందరూ అర్హత సాధించేలా నిబంధనలు మార్చి, గడువు పొడిగించాలని కోరుతున్నారు.

Courtesy Prajashakthi…