– గురుకులాలు, హాస్టల్‌ విద్యార్థులకు అనుమానమే
– వృత్తిపన్ను, జిఎస్‌టి చెల్లించే వారికీ కష్టమే
– నాలుగుచక్రాల వాహనం ఉన్నా కుదరదు

-అమరావతి
పిల్లలను చదివిరచే తల్లులకు ఆర్ధిక సాయం అరదిరచే అమ్మ ఒడి పథకంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పథకం అమలులో అనేక ఆంక్షలు పెట్టడానికి సిద్ధమౌతోంది. ఉన్నతస్థాయి నుండి అందిన ఆదేశాల మేరకు అధికారులు ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలను రూపొందించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లకార్డు ఉన్న వారికే అమ్మఒడిని వర్తింపచేయాలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లితండ్రుల రేషన్‌ కార్డు వివరాలు ప్రభుత్వానికి అందాయని, ఇంటర్మీడియట్‌ చదువుతున్న వారి వివరాలు మాత్రం ఆ విధంగా అందలేదని ఇటీవల ప్రభుత్వం రూపొందించిన ఒక నివేదికలో పేర్కొంది. ‘పథకం అమలుకు తెల్లరేషన్‌కార్డు ఉండటం తప్పనిసరి కాబట్టి ఆ విద్యార్థుల తల్లితండ్రులకు సంబంధించిన రేషన్‌ కార్డు వివరాలను కూడా సాధ్యమైనంత త్వరగా పంపాలి’ అని సంబంధిత అధికారులను ఆదేశించింది. తెల్లరేషన్‌ కార్డును ఒకవైపు తప్పనిసరి చేస్తూనే . మరోవైపు ఆ కార్డు ఉన్నప్పటికీ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు మార్గాలను వెతుకుతోంది. రెసిడెన్సియల్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. ‘ ఈ తరహా విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. అమ్మఒడి పథకం లబ్ధిదారుల్లో ఈ విద్యార్థుల తల్లితండ్రులను కూడా కలిపి వివిధ శాఖలు లెక్కించాయి. వారి వివరాలను మళ్లీ విడివిడిగా పంపితే, పథకాన్ని వారికి వర్తింపచేసే విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది’ అని ప్రభుత్వం వివిధ శాఖలకు ఇటీవల సమాచారం పంపింది. వివిధ రకాల వృత్తులు చేసుకుంటూ పన్నులు కట్టే వారి పిల్లలను కూడా ఈ పథకం నుండి తప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. వృత్తిపన్ను కట్టే తల్లితండ్రుల వివరాలను కూడా సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా ఆదాయపు పన్ను చెల్లిరచేవారిని, జిఎస్‌టి పరిధిలోకి వచ్చే వారిని కూడా ఈ పథకం నుండి మినహాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాలకు డిమాండ్‌ పెరగడంతో ఉన్న కొద్ది పాటి వ్యవసాయ భూమిని, నివాస స్థలంగా మార్చుకుని అక్కడో చిన్నపాటి ఇల్లు కట్టుకుని ఉండటం ఇటీవల కాలంలో సాధారణమైంది. అయితే, తాజా ప్రతిపాదనల్లో వ్యవసాయ భూములను నివాసభూములుగ మార్చుకుని, వాటిలో నివాసం ఉండేవారిని కూడా లబ్ధిదారుల జాబితా నుండి తొలగించాలని ప్రతిపాదించారు. అదే విధంగా ఐదెకరాల మాగాణి పొలం ఉన్నా పథకం నుండి మినహాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బ్యాంకులోనుతో నాలుగుచక్రాల వాహనాలను తీసుకుని అద్దెకు తిప్పుకుంటున్న వారిని కూడా ఈ పథకం నుండి పక్కనబెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

Courtesy Prajasakti