Image result for వారు విభజిస్తున్నారు, మనం ఏకమవుదాం"Image result for యోగేంద్ర యాదవ్"యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ప్రజా నిరసనలను మతాల ప్రాతిపదికన దేశ ప్రజలలో చీలికలు తీసుకువచ్చేందుకు ఉపయోగించుకొనేందుకు దేశ పాలకులు ప్రయత్నిస్తున్నారు. దేశాన్ని సమైక్యంగా వుంచే బృహత్తర బాధ్యత ప్రజల పైనే వున్నది. ప్రజా నిరసనలు జాతీయ సమైక్యతకు దోహదం చేసే ఒక సరికొత్త అఖిల భారత ఉద్యమం- భారత్ -జోడో ఆందోళన్‌-గా పరిణమించి తీరాలి.

కొత్త సంవత్సర వేళ మీరు ఏమి నిర్ణయాలు తీసుకున్నారు? సొంత జీవితాన్ని మరింత వెలుగుమయం చేసుకోవడానికి సంబంధించినవే అయివుంటాయి. అవి, సాధారణంగా అలానే వుండడం పరిపాటి. అయితే మన జాతీయ జీవనంలో వర్తమానం ఒక విషమ స్థితిలో వున్నది. మన పురా నవ భారతదేశం గుర్తుపట్టలేని విధంగా విరూపమవుతోంది; మనం విశ్వసించిన విలువలు, మన జీవితాలకు ఆలంబనగా వున్న సంప్రదాయాలు వికృత దాడులకు గురవుతున్నాయి. మరి ఈ పరిస్థితులలో మన వ్యక్తిగత జీవితాలను రాజకీయ పరిణామాల నుంచి వేరు చేయలేము, చేయకూడదు కూడా.

‘‘ ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సిఏఏ)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారు ఎటువంటి వస్త్రాలు ధరించారో చూడండి, అటువంటి బట్టలను ఎవరు ధరించేది ఎవరో మీకు తెలియదా?’’ అంటూ మన ప్రభుత్వాధినేత- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- నర్మగర్భితంగా ఎత్తిచూపిన కాలమిది. ఒక సామాజిక సముదాయానికి వ్యతిరేకంగా పోలీసులు యుద్ధాన్ని ప్రారంభించిన రోజులివి. అంతేనా? చిన్న పిల్లలను సైతం చిత్ర హింసలకు గురి చేస్తున్న ఘోరాలు పెచ్చరిల్లిపోతున్న పాడు పాలన దాపురించింది కదా! అసత్యాల వ్యాప్తికి ‘ఆధ్యాత్మిక గురువులు’ నిర్నిరోధంగా దోహదం చేస్తున్న సమాజంలో ‘సత్యమేవ జయతే’ అన్న ధర్మసూత్రం వర్ధిల్లుతుందా? జ్ఞానాన్ని మధించి, విజ్ఞాన వివేకాలను విస్తరింపజేసే యువ ధీమంతులు, దేశ పాలకులపై తిరగబడాల్సిన అగత్యమెందుకు ఏర్పడింది? ఇటువంటి పరిస్థితులలో నూతన సంవత్సర శుభ వేళ మన నిర్ణయాలు వ్యక్తిగతమైనవిగా మాత్రమే ఎలా వుంటాయి? ఉండవు, ఉండకూడదు కూడా. సుప్రసిద్ధ స్త్రీవాద నినాదాన్ని విలోమీకరించి చెప్పాలంటే ఇప్పుడు రాజకీయమే వ్యక్తిగతం. జాతి జీవితం వక్ర గతుల్లోకి వెళ్ళిపోతుండడం మన వ్యక్తిగత సమస్య కాదూ?

అవును, ఏడు దశాబ్దాల భారత గణతంత్ర రాజ్యం పెడదోవ పట్టింది. దాని ప్రస్తుత ప్రస్థానం మన చిరంతన, సమున్నత నాగరికతా విలువల స్ఫూర్తిని కాలరాచివేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం-–జాతీయ పౌర పట్టిక –-జాతీయ జనాభా పట్టికపై వెల్లువెత్తుతోన్న నిరసనలు కేవలం ఒక వివక్షా పూరిత చట్టం లేదా రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం చేపట్టిన ఒక చర్యకు వ్యతిరేకంగా పిక్కటిల్లుతోన్న ప్రజాఘోష మాత్రమే కాదు. అసోంలో అన్ని మతాల ప్రజలూ తమ విలక్షణ అస్తిత్వాన్ని సంరక్షించుకునేందుకు, తమకు భరోసా కల్పించిన ఒక ఒడంబడిక ఉల్లంఘనకు గురికాకుండా ఉండేందుకు, విశాల భారతదేశంతో ఒక గౌరవపూర్వక సంబంధాన్ని భద్రపరచుకునేందుకై వీధుల్లోకి పోటెత్తడం కొనసాగుతోంది. ఆసేతు హిమాచలం ముస్లిం సహోదరులు ఒక అపూర్వ సామూహికోద్యమంలో భాగస్వాములవుతున్నారు. సమ పౌర సత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా కుదించివేయడంపై వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమ సమ పౌరసత్వాన్ని చట్టబద్ధంగా తొలగించేందుకు చురుగ్గా జరుగుతోన్న ప్రయత్నాలను నిరోధించేందుకు వారు కృతనిశ్చయులయ్యారు. ఇక యువ భారతీయులు మతాలు, ప్రాంతాలకు అతీతంగా సమైక్యమవుతున్నారు. జాతి గత చరిత్రను సంకుచిత దృక్పథంతో చూస్తూ ప్రతీకార ధోరణులకు పాల్పడుతున్న వారికి ఈ దేశ వర్తమానమూ, భవిష్యత్తు బందీ కాకూడదనే సంకల్పంతో వారు ఉద్యమిస్తున్నారు. భారతదేశపు ఆత్మను సంరక్షించేందుకు ఒక మహోద్యమం సాగుతోన్న సందర్భమిది.

కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అగ్నిపర్వతంలా బద్ధలవుతున్న ప్రజా నిరసనలను అణచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సకల ప్రయత్నాలూ చేస్తోంది. శుద్ధ అబద్ధాలను గౌరవప్రదకరమైనవిగా చేస్తోంది. విద్వేషాలను ప్రేమపూరిత వ్యవహారాలుగా కన్పించేలా చేస్తోంది. పౌరుల ఆలోచనలను ప్రభావితం చేసేందుకు ప్రచార యంత్రాంగాన్ని ముమ్మరంగా వినియోగిస్తోంది. ప్రజల నిరసనలను తక్కువ చేసి చూపేందుకు, ప్రభుత్వ కథనాలకు విశేష వ్యాప్తి కల్పించేందుకు మీడియాను ఉపయోగించుకొంటోంది. అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరాగాంధీ ఇవే పద్ధతులను అనుసరించారు సుమా!

వార్తలు, వార్తా వ్యాఖ్యలు ప్రభుత్వానికి అనుకూలంగా వుండేలా చేసేందుకు మోదీ సర్కార్ క్రూరమైన దమన చర్యలకు పాల్పడుతోంది. పౌరసత్వ సవరణ చట్టం–-జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా తీవ్రమవుతోన్న శాంతియుత, ప్రజాస్వామ్యయుత ఆందోళనలను బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రభావశీలంగా నిషేధించాయి. నిరసన ప్రదర్శనలకు అనుమతించినప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ యంత్రాంగం వాటికి అవాంతరాలను కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. నిరసనకారులతో వ్యవహరించడంలో మితిమీరిన బలప్రయోగం సాధారణమైపోయింది. పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనలపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును, హర్యానాలో జాట్‌ల, మహారాష్ట్రలో మరాఠాల నిరసనోద్యమాల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుతో పోల్చి చూడండి. బీజేపీ అగ్రనాయకుడు యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉన్న ఉత్తరప్రపదేశ్‌లో భయం రాజ్యమేలుతోంది. పలు పట్టణాలలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ముస్లిం సమాజంపై వారు యుద్ధం చేస్తున్నారని చెప్పక తప్పదు.

ప్రజాస్వామ్యం, వైవిధ్యం, అభివృద్ధి మొదలైనవి భారత్ భావన నిర్వచన ప్రాతిపదికలు. దేశ చరిత్రలోని ప్రస్తుత దశ ఆ సమున్నత సూత్రాలను సవాల్ చేస్తున్నది. భారతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. బహుశా అది వ్యవస్థాగత సంక్షోభం కావచ్చు. తత్కారణంగానే మన ఆర్థికం అంతకంతకూ దిగజారిపోతున్నది. ఆర్థిక వ్యవస్థ మందగమనం తీవ్రమాంద్యంగా పరిణమిస్తోంది. నిరుద్యోగం పెరిగిపోతోంది. తీవ్ర దుస్థితి నుంచి వ్యవసాయ రంగానికి ఉపశమనం లభించ డమే లేదు. అన్నదాత ఆవేదన పాలకులకు పట్టడం లేదు. మోదీ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని రూపుమాపడం కాదు కదా అసలు సమస్యను అర్థం చేసుకున్నదా అన్నది కూడా సందేహాస్పదంగా వున్నది. కనుకనే కాబోలు ఈ సంక్షోభ తీవ్రత నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు వారిలో జాతీయవాద భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు అవిచ్ఛిన్నంగా ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి నిచ్చిన అధికరణ 370 రద్దు, అయోధ్య తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం మొదలైనవి ఆ ప్రయత్నాలలో భాగమే.

ఈ చర్యల పర్యవసానాలు దేశ శ్రేయస్సుకు ప్రతికూలంగా దీర్ఘకాలిక ప్రభావాలను చూపనున్నాయి. అయితే మోదీ ప్రభుత్వానికి ప్రజాదరణను పెంపొందించడమనేది వాటి స్వల్పకాలిక లక్ష్యం. ఇందుకు ప్రజాస్వామిక హక్కులు, సంస్థాగత సాధనాలు అవరోధంగా వున్నాయి. వీటిని తొలగించుకునేందుకే ప్రజాస్వామ్య సంస్థలు, హక్కులు, పాలనా పద్ధతులను కాలరాచివేసే చర్యలను ముమ్మరంగా చేపట్టడం జరుగుతోంది. ఆ చర్యలకు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటం ఫలితాలు ఎలా వుంటాయన్నది ప్రస్తుత దశలో చెప్పలేము. కాలంలోకి జారిపోయిన సంవత్సరం (2019)లో మన సమున్నత గణతంత్ర రాజ్యం సంకుచిత ధోరణుల్లోకి ముడుచుకు పోతున్న సూచనలు కన్పించాయి. ఆ తిరోగమనం నుంచి మన రిపబ్లిక్‌ను ప్రస్తుత ప్రజా ఉద్యమం కాపాడే అవకాశమున్నది. అయితే కొనసాగుతున్న ప్రజా నిరసనలను మతాల ప్రాతిపదికన దేశ ప్రజలలో చీలికలు తీసుకువచ్చేందుకు ఉపయోగించుకోవచ్చని మోదీ ప్రభుత్వం ఇంకా ఆశిస్తోంది. ఈ విషయంలో పాలకులు తమ ఆశలను ఇంకా వదులు కోలేదు. రాబోయే కొద్ది వారాలలో నిరసనోద్యమాలు ఎలా పర్యవసించనున్నాయనే దాన్ని బట్టి అంతా ఆధారపడివున్నది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. దేశప్రజలలో చీలికలు సృష్టించేందుకు పాలకులు కృతనిశ్చయంతో వున్నారు. దేశాన్ని సమైక్యంగా వుంచే బృహత్తర బాధ్యతను ప్రజలే చేపట్టాలి. ఈ వాస్తవం దృష్ట్యా కొత్త సంవత్సర నిర్ణయం ఇలా వుండాలని నేను ప్రతిపాదిస్తున్నాను : ‘వో తోడేంగే, హమ్ జోడేంగే’ (వారు విభజిస్తున్నారు, మనం ఏకమవుదాం).

పౌరసత్వ సవరణ చట్టం- జాతీయ పౌర పట్టిక-–జాతీయ జనాభా పట్టిక వ్యతిరేక నిరసనలు జాతీయ సమైక్యతకు దోహదం చేసే ఒక సరికొత్త అఖిల భారత ఉద్యమం- భారత్ -జోడో ఆందోళన్‌గా పరిణమించి తీరాలి. బీజేపీ ప్రభుత్వ విచ్ఛిన్నకర కుతంత్రాలకు వ్యతిరేకంగా ఈ నిరసనోద్యమాలు మరింతగా ముమ్మరమవ్వాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఈ నిరసనోద్యమాలతో పాటు మత సామరస్యాన్ని పెంపొందించే సానుకూల, నిర్మాణాత్మక చర్యలను కూడా మనం చేపట్టవలసివున్నది. మూక హింసాకాండకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారాన్ని ప్రతిఘటించడానికి నిరసనకారులు కచ్చితంగా గాంధేయ అహింసా పద్ధతులను అనుసరించి తీరాలి. ప్రజానిరసనలు రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగమవ్వడాన్ని అరికట్టేందుకు ఉద్యమకారులు తమ ఉద్యమ రాజకీయేతర స్వభావాన్ని పరిరక్షించుకోవాలి. భారత్ సమైక్యత, సమగ్రతలకు జరిగిన నష్టాన్ని నివారించేందుకు ఉద్యమ ప్రతీకలుగా త్రివర్ణ పతాకం‍, భారత రాజ్యాంగం మాత్రమే ఉండాలి. జాతీయ సమైక్యతా సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళేందుకు జనవరిలో పలు సందర్భాలు ఉన్నాయి. అవి: జనవరి 3న మహిళా, బహుజన సంస్థలు నిర్వహించే సావిత్రీ బాయి పూలే జయంతి; జనవరి 12న జాతీయ యువజనోత్సవంగా పాటిస్తున్న వివేకానంద జయంతి; జనవరి 17న రోహిత్ వేముల వర్ధంతి; జనవరి 23న నేతాజీ సుభాస్ బోస్ జయంతి; జనవరి 26న గణతంత్ర దినోత్సవం, జనవరి 30న గాంధీజీ వర్ధంతి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతోన్న ఉద్యమం ఇప్పటికే పలు సృజనాత్మక జాతీయ ఐక్యతా వ్యక్తీకరణలను చూసింది. యథాప్రకారం జరిగే నిరసన ప్రదర్శనలు ఒక స్థాయి, దశను దాటి కార్యసాధక ఫలితాలను సాధించలేవు. ఈ వాస్తవం దృష్ట్యా మన నిరసనలు వినూత్న రీతుల్లో జరగాల్సిన అవసరమున్నది.

(Courtesy Andhrajyothi)