నెలకు అయిదారు వందల రూపాయల పెన్షన్ ఆర్నెల్లు అందకపోతే.. నిర్భాగ్యుడు ఏ కోర్టుకు పోగలుగుతాడు? అది బతికే హక్కు అని మీరు నేరుగా మా తలుపులు తట్టవచ్చునని సుప్రీంకోర్టు తీర్పులు బోలెడు ఇచ్చింది. కాని పదిరూపాయల ఆర్టీఐతో అటువంటి వందలాది మందికి పింఛను మళ్లీ దొరికింది. కేవలం పదిరూపాయలతో కొంతైనా న్యాయం దొరికిన వారు కోకొల్లలుగా ఉన్నారు. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా దొరకని ఉపశమనం ఆర్టీఐ కింద దొరికింది. ఇప్పుడు ఈ మాత్రం 10 రూపాయల పిల్‌కు కూడా ఎసరు పెడుతున్నారు.

మొత్తానికి ఆర్టీఐని చంపేశారు. ‘యూ టూ బ్రూటస్’ అన్నట్టు అనేక రాజకీయ పక్షాలు కలిసి ఈ హత్య చేశాయి. రాజ్యసభలో పెద్దలు కాస్త ఆలోచించి ఈ పనికి రాని సవరణపైన మరో ఆలోచనకు దారి కల్పిస్తారనుకుంటే, వారంతా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తారు. తెలంగాణ ఆశాదీపం టిఆర్‌ఎస్, ఆంధ్ర ప్రజలు ఇటీవల నమ్ముకున్న జగన్ పార్టీ, ఒడిషాను అవిచ్ఛిన్నంగా పాలిస్తున్న బిజూ జనతా దళ్ నేత నవీన్‌ పట్నాయక్‌.. అందరూ బిజెపికి భయపడిపోయారు. ఏ సవరణో కూడా తెలియకుండా తలలూపారు. జనం గుండె వంటి సమాచార హక్కుకు గుండెపోటు పొడిచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్కు ఫోన్ చేసి ఆర్టీఐ మార్పులకు మద్దతు ఇవ్వమని కోరినారట. టిఆర్‍ఎస్ నాయకుడు కె.కేశవరావు ఈ బిల్లు ఆర్టీఐని నీరు కార్చుతుందనీ, సిఐసిని బలహీనపరుస్తుంది కాబట్టి సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరారు. అంతకుముందు తెరాస లోకసభలో ఈ బిల్లును వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపాలని సంతకం కూడా చేసింది. కాని ఇప్పుడు యూటర్న్ తీసుకుని మద్దతు ఇచ్చింది. ఇక వైఎస్సార్సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి, అన్ని బిల్లులనూ సెలెక్ట్ కమిటీకి పంపడం ఏమిటి, మేం సవరణను సమర్థిస్తాం అని ప్రకటించి మరీ సహకరించారు. రాష్ట్రాల అధికారాలను తగ్గించే ఈ బిల్లును ఎందుకు సమర్థించారో వివరించగలరా? అని ఈ మూడు ప్రాంతీయ పార్టీల నాయకులను అడుగుతూ రాసిన బహిరంగ లేఖకు ఇంతవరకు జవాబు లేదు.

బక్కచిక్కిన బడుగు మనిషికి సాధనమై ఉపకరిస్తున్న ఒక హక్కును మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ హక్కును రకరకాలుగా సంహరిస్తున్నారెందుకు? సవరిస్తున్నామంటూ ఎందుకు తలగొరుగుతున్నారు? దీని వల్ల పైకి చెప్పని ఏ ఉపయోగాలను కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నది. అవినీతికి వ్యతిరేకం అని ఎన్నో సార్లు ప్రకటించిన బీజేపీ అవినీతిని నిరోధించే సమాచార హక్కు చట్టాన్ని నీరు కారుస్తున్నది. ఈ చట్టానికి అవినీతిని వెలికి తీసే శక్తి ఉన్నదని ఎన్నోసార్లు రుజువైంది. ఆర్టీఐని నీరుగార్చడమంటే అవినీతికి వెసులుబాటు చేయడమే. ఆర్టీఐని ఇంకా బలోపేతం చేయాలని కమిషనర్ కాకముందు, కమిషన్‌లో ఉన్నపుడు, ఆ తరువాత గట్టిగా మీడియా, సోషల్ మీడియా ద్వారా చర్చిస్తూనే ఉన్నాను. అధికారపార్టీ అనుయాయులకు అది నచ్చడం లేదు. ఆర్టీఐ వల్ల ప్రయోజనాలు పార్టీలకు అతీతంగా ఉన్నాయని పార్టీలతోపాటు వారి విధేయులు, అనుయాయులు, వీరాభిమానులు కూడా గుర్తించకపోతే మన చదువుసంధ్యలెందుకు?

దేశంలో లక్షలాది ప్రభుత్వ కార్యాలయాలు, వందలాది యూనివర్సిటీలు, వేలాది కాలేజీలు, పాఠశాలలు… ప్రతిచోట అవినీతి ఉంది. లంచగొండితనం ఉంది. లక్షల కార్యాలయాల్లో రోజూ వందల రూపాయల అవినీతి జరుగుతున్నదనుకున్నా రోజూ దేశం మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నట్టు. మన నేతలు, కోర్టులు, సిబిఐ, మీడియా వేల కోట్ల అవినీతి గురించి మాత్రమే పట్టించుకుంటుంది. చిన్న మొత్తాల్లో దేశం మొత్తం మీద వ్యాపించిన అవినీతిని నిలదీసేది, నిలువరించేది ఆర్టీఐ ఒక్కటే. ఈ దుర్మార్గుల బాధితులందరికీ చేదోడు వాదోడు ఆర్టీఐ. రాజకీయ సంబంధాలుంటే చాలు తమను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగే ఐఎఎస్ అధికారుల, వైస్ చాన్సలర్ల అరాచకాలకు ఎందరు చిన్న ఉద్యోగులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాధపడుతున్నారో ఎవరికీ తెలియదు. ఈ అధికారులు, వీసీల చెంచాలు కూడా ఎంత ఏడిపిస్తారో అనుభవించిన వారికి తెలుస్తుంది. అటవీ అధికారులు గిరిజనుల బతుకులతో ఎలా ఆడుకుంటున్నారో తెలియదు.

తల మీద చార్జిషీట్లు వేలాడుతున్నవారు కూడా పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలై దేశాలు ఏలుతుంటే- కేవలం అనుమానం మీద, ఏ రుజువులూ లేకపోయినా వరవరరావు వంటి వారు పౌర హక్కుల కోసం కవితలు, రచనలు చేస్తున్నందుకు జైళ్లలో మగ్గుతున్నారు. సరైన తిండి లేదు. వైద్యం లేదు. జైలు మాన్యువల్ ప్రకారం కనీస సౌకర్యాలు ఉండాలని అడగాలంటే మాన్యువల్ కాపీ ఉండాలి. ఆర్టీఐ కింద అడిగినా జైళ్ల అధికారులు ఇవ్వరు. కనీసం అడగడానికి ఆర్టీఐ ఒక సాధనం. అది బ్రహ్మాస్త్రం అనే అతిశయోక్తులు అవసరం లేదు. వ్యవస్థను బిగించే స్క్రూడ్రైవర్ అది. అందులో ఇనుమును నీరుకార్చేదే బీజేపీ, దాని మిత్ర పక్షాలు కలిసి తెచ్చిన ఈ సవరణ.

ఈనాటి దేశపరిస్థితుల్లో రాజ్యాంగం పనిచేయదు. మహామహులైన ఎమ్మెల్యేలు కొనుగోలు వస్తువులై పోయారు. కొనే పెద్దలు కొంటారు. లేకపోతే వారి రాజీనామాలను కొంటారు. అధికారులను కొంటారు. లాయర్లను, కోర్టులను, తీర్పులను అనుకూలంగా సాధించడానికి అన్ని మార్గాలనూ అనుసరిస్తారు. ఆర్టీఐని నిక్కచ్చిగా అమలు చేస్తే ఈ ఆటలేవీ సాగవు కనుక ఆర్టీఐని నిస్సారం చేస్తున్నారు.

నెలకు అయిదారు వందల రూపాయల పెన్షన్ ఆర్నెల్లు అందకపోతే ఆ నిర్భాగ్యుడు ఏ కోర్టుకు పోగలుగుతాడు? అది బతికే హక్కు అని మీరు నేరుగా మా తలుపులు తట్టవచ్చునని సుప్రీంకోర్టు తీర్పులు బోలెడు ఇచ్చింది. కాని పదిరూపాయల ఆర్టీఐతో అటువంటి వందలాది మందికి పింఛను మళ్లీ దొరికింది. కేవలం పదిరూపాయలతో కొంతైనా న్యాయం దొరికిన వారు కోకొల్లలుగా ఉన్నారు. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా దొరకని ఉపశమనం ఆర్టీఐ కింద దొరికింది. ఇప్పుడు ఈ మాత్రం 10 రూపాయల పిల్‌కు కూడా ఎసరు పెట్టారు. ఆర్టీఐని నీరు గార్చడానికి రకరకాల ఎత్తులు జిత్తులు వేసారు. కొత్త రూల్స్ తెస్తామంటూ సమాచార కమిషన్ అధికారాలను కత్తిరించాలనుకున్నారు. తీవ్రంగా ప్రతిఘటించాను. నేను 2018లో రాసిన ఉత్తరాలు మీడియాలో వెలువడ్డాయి. వెనక్కు తగ్గారు. మామూలు సమాచారం ఇవ్వడాన్ని వ్యవస్థాత్మకంగా ఆపే ప్రయత్నాలకు వ్యతిరేకంగా కమిషనర్ హోదాలో పోరాడి, ఇప్పడికీ పోరాడుతూనే ఉన్నాను. కొన్ని విజయాలు ఉన్నా, ఈ సవరణ ఆపలేకపోవడం పెద్ద పరాజయం.

ఇక ఈ సవరణ తరువాత ఏమవుతుందో చూద్దాం. కమిషనర్లకు అయిదేళ్ల పదవీ కాలం చట్టబద్ధంగా ఉండదు. ప్రతిసారీ నియమించేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ తక్కువ జీతం, చిన్న పదవీ కాలం, కింది స్థాయి నిర్ణయిస్తారు. ఒక సారి రెండేళ్లనవచ్చు, మరోసారి నాలుగేళ్లనవచ్చు. హోదా జాయింట్‌ సెక్రటరీ లేదా మరో స్థాయి (ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే). ఈ విధంగా నియమితులైన మాననీయులను స్వతంత్రంగా మననిస్తారా? వారు చట్టం ప్రకారం సమాచారం ఇవ్వవలసి ఉన్నా ఇవ్వాలని ఆదేశాలను జారీచేయనిస్తారా? ఇచ్చిన తరువాత ఆ కమిషనర్ ఏమవుతాడు?

సమాచార హక్కు చట్టంలో మిగతా నియమాలేవీ మారలేదు. హక్కు పరిధులు పరిమితులు అవే. కానీ, కమిషనర్ వెన్నెముకను దెబ్బతీశారు.. టై-బెల్ట్ల మధ్య చాలామంది వెన్నెముకలు ఉన్నాయో లేదో అన్నట్టు ఉంటారు. ఇప్పుడు వెన్నెముక లేదని ఎక్స్ రేలో తేలిన తరువాతనే నియమిస్తారా? ఇంతమంది ఎంపీలు ఉన్నారు. ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొందరు తప్ప అందరూ మౌనం పాటిస్తే అది ప్రజాప్రతినిధుల సభ అని అనగలమా? వారిని విమర్శించిన వారిని తిట్టడమే గాని నిజానిజాలు ఎవరూ గమనించరా? ఆర్టీఐ గురించే ఆలోచించరా? ఒవైసీ ఈ సవరణను వ్యతిరేకిస్తే ఆయనను మత భక్తితో తిట్టడం, శశిథరూర్ వ్యతిరేకిస్తే ఆయన మీద కేసులు తవ్వడం… అసలు బిల్లు గురించి అడిగేది లేదు. సమాచార హక్కు గురించి ఆలోచన లేదు. సిగ్గు పడాలి. చదువుకున్నా చదువుకోకపోయినా అవినీతిని వ్యతిరేకించే నిజమైన పౌరులకు నా వినతి. సమాచార హక్కును కాపాడుకోండి. ప్రాణాలు తీసే నినాదాల కన్న సమాచార హక్కుకు ఎక్కువ శక్తి ఉందని నమ్మండి. సమాచార హక్కును వ్యతిరేకిస్తున్నారంటే అవినీతి అంటే ఇష్టపడేవారేమో అని అనుమానించండి. ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోండి, రాజ్యాంగ యంత్రాంగాన్ని బిగించడానికి ఉపయోగపడే స్క్రూడ్రైవర్ వంటి సమాచార హక్కును రక్షించుకోండి.

రాజ్యాంగ సభలో చివరిరోజున బి. ఆర్. అంబేడ్కర్ అన్న విలువైన మాటలు గుర్తుచేస్తాను:

‘‘జాన్ స్టువర్ట్ మిల్ అనే గొప్ప రాజ్యాంగ తత్వవేత్త, పాలకుడు ఎంత గొప్పవాడైనా సరే అతని పాదాల మీద మీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలనుంచకండి. మరీ అంతగా నమ్మకండి. దాంతో అన్ని వ్యవస్థలను వమ్ముచేస్తాడేమో. జీవితమంతా దేశం కోసం త్యాగం చేసిన గొప్పవారికి కృతజ్ఞులుగా ఉండడంలో తప్పులేదు. కాని దానికి కూడా కొన్ని హద్దులుంటాయి. ఐరిష్ దేశభక్తుడు డేనియల్ ఒకానెల్ ఒక మాటన్నాడు. ఒక పురుషుడికి తన ఆత్మగౌరవాన్ని చంపుకునేంత, ఒక స్త్రీకి తన శీలాన్ని బలిచేసేంత, ఒక జాతికి తన స్వేచ్ఛను బలిచేసేంత కృతజ్ఞత ఉండకూడదు. మన దేశానికి ఈ హెచ్చరిక మరే దేశం కన్నా కూడా ఎక్కువ అవసరం. ఎందుకంటే మనదేశంలో వ్యక్తిపూజలు మరీ ఎక్కువ. రాజకీయాల్లో కూడా భక్తిప్రపత్తులు ప్రపంచంలో ఎక్కడా లేనంతగా మన దేశంలో పనిచేస్తాయి. మతంలో భక్తి ద్వారా ముక్తి సాధించే మార్గం ఉంటుంది. కాని రాజకీయాల్లో భక్తి, వ్యక్తి పూజ పతనానికి, నియంతృత్వానికి రాజమార్గం’’ సమాచార స్వేచ్ఛను, భావప్రకటనా స్వేచ్ఛను పుష్పాల వలె భక్తితో అవినీతి శత్రు చట్టాన్ని చంపిన హంతకుల పాదాలకు సమర్పించడం మంచిది కాదనే అంబేడ్కర్ మాట గురించి ఆలోచిస్తారా ఎవరైనా?

 మాడభూషి శ్రీధర్

మాజీ కేంద్ర సమాచార కమిషనర్

(Courtacy Andhrajyothi)