• తిరిగి దాడి చేసిన మహిళలు.. ఉద్రిక్తత
  • ఎమ్మెల్యే ధర్మారెడ్డిని అడ్డుకున్న కార్మికులు
  • ఆత్మకూరులో ముగిసిన కండక్టర్‌ రవీందర్‌ అంత్యక్రియలు
  • గుండెపోటుతో మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్టీసీ కండక్టరు ఏరుకొండ రవీందర్‌ (52) అంతిమయాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రవీందర్‌ మృతదేహాన్ని ఆదివారం తెల్లవారుజామున ఆయన స్వగ్రామమైన వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా, ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్ష నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా.. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించేది లేదంటూ ఆందోళనకారులు స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు..రవీందర్‌ మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కార్మికులు, ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు అడ్డుకున్నారు. గో బ్యాక్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల వలయంలో చివరకు రవీందర్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. మృతదేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. తిరిగి వెళ్తుండగా కార్మికులు నినాదాలు చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో సీఐ గొర్రె మధు ఆర్టీసీ మహిళా కార్మికులపై చేయి చేసుకున్నారు. వారు తిరిగి దాడులకు దిగడంతో అక్కడ రణరంగంగా మారింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే చర్చలు జరపాలని డిమాండ్‌ చేస్తూ ఆత్మకూరు జాతీయ రహదారిపై బైఠాయించి ‘సీఎం డౌన్‌ డౌన్‌.. కేటీఆర్‌ డౌన్‌డౌన్‌’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, వరంగల్‌ నుంచి ఏటుర్‌నాగారం వైపు వెళ్లే వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. దీంతో, కార్మికులు, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను అరెస్టులు చేసిన పోలీసులు పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఐ గొర్రె మధును అక్కడ నుంచి పంపించారు. అనంతరం, మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో రవీందర్‌ అంత్యక్రియలు భారీ పోలీసు బందోబస్తు మధ్య ముగిశాయి.

రవీందర్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే ధర్మారెడ్డి..రవీందర్‌ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే ధర్మారెడ్డి చెప్పారు. ఆర్టీసీ విషయంలో సీఎం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు.

కేసీఆర్‌ నియంత: మంద కృష్ణ మాదిగ…తెలంగాణ కోసం పోరాడిన ఆర్టీసీ ఉద్యమకారులు చస్తున్నా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. రవీందర్‌ మృతదేహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. 29 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కార్మికులను చర్చలకు పిలవకుండా సీఎం నియంతగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్మికుల ఉసురు తీసున్న ప్రభుత్వం పతనంకాక తప్పదన్నారు.

Courtesy Andhrajothy…