– మహిళాకార్మికులపై పోలీసుల పిడిగుద్దులు
– ఉప్పల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వారు అడ్డగింత
– సేవ్‌ఆర్టీసీ పేరిట ర్యాలీ, మానవహారాలు, దీక్షలు
– డ్రైవర్‌ వీరభద్రయ్య అంత్యక్రియల్లో అరెస్టులు
-విలేకరుల యంత్రాంగం

ఆర్టీసీ సమ్మె 50వ రోజు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా సాగింది. సేవ్‌ఆర్టీసీ పేరిట ర్యాలీ, దీక్ష, ధర్నా, మానవహారాలు కొనసాగగా.. ఖమ్మంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రయాణికుల సహకారం కోరేందుకు కార్మికులు డిపోకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కొందరు కార్మికులు బస్సుల టైర్లలో గాలి తీసి, అద్దాలు ధ్వంసం చేశారు. మహిళా కండక్టర్‌ కె.పద్మావతిపై మహిళా కానిస్టేబుల్‌ ముఖానికి వస్త్రం ధరించుకుని వచ్చి పిడిగుద్దులు కురిపించింది. దెబ్బలకు తాళలేక బాధితురాలు బోరున విలపించింది. ఉప్పల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వారును కార్మికులు అడ్డుకోవడంతో అమాత్యులు అక్కడ్నుంచి జారుకున్నారు.

శుక్రవారం మృతి చెందిన పరిగి డిపో డ్రైవర్‌ వీరభద్రయ్య అంత్యక్రియలు పోలీసుల బందోబస్తు మధ్య జరిగాయి. ఖమ్మం రీజియన్‌ వ్యాప్తంగా ఆరు డిపోల ఎదుట ధర్నాలు కొనసాగాయి. ఖమ్మం డిపో వద్దకు చేరుకున్న కార్మికులు యాభై అక్షరం రూపంలో కూర్చుని వినూత్నంగా నిరసన తెలిపారు. మహిళా కండక్టర్‌పై పోలీసుల దాడి చేయడం పట్ల కార్మికులు, విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్‌ జులుం నశించాలంటూ ఆందోళన చేపట్టారు. భద్రాచలంలో కార్మికుల దీక్షలకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మద్దతు తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో రూ.25వేల ఆర్థిక సాయం అందజేశారు. అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా కార్మికులు ర్యాలీ నిర్వహించారు.

నిజామబాద్‌ జిల్లా కేంద్రంలో బిక్షాటన చేశారు. తెలంగాణ పబ్లిక్‌ అండ్‌ ప్రయివేటు రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆటో డ్రైవర్లు సమ్మెకు మద్దతు తెలిపి ‘ఆటోరోకో’ నిర్వహించారు. ఆర్మూర్‌లో ర్యాలీ చేపట్టి అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బస్టాండ్‌ ఎదుట ఆందోళన చేశారు.

హుజూరాబాద్‌లో కార్మికులు డిపో నుండి బస్టాండ్‌ మీదుగా అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.జగిత్యాల జిల్లా కేంద్రంలో డిపో ఎదుట నిరసన తెలిపారు. మెట్‌పల్లి పట్టణంలోని డిపో ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. వేములవాడలో బస్టాండ్‌ నుంచి రాజన్న ఆలయం వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. మంథని బస్‌ డిపో నుంచి బస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

సేవ్‌ ఆర్టీసీ అం టూ నినాదాలతో హైదరాబాద్‌లోని కుషాయిగూడ డిపో నుంచి ఈసీఐ ఎల్‌ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. కాచిగూడ డిపో నుంచి చాదర్‌ఘాట్‌ వరకు నిరసనప్రదర్శన నిర్వహించారు. కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆల్‌ ఇండియా రోడ్డు రవాణా వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆటోలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Courtesy Navatelangana…