• కార్మికుల సమ్మెకు ముగింపు.. ఆర్టీసీ ముగింపే!
 • ప్రపంచంలో ఎవరూ కాపాడలేరు.. నేనూ ఏమీ చేయలేను
 • దివాలా తీసింది.. కథ ముగిసిపోయినట్లే
 • బతుకులెట్లో ఆర్టీసీ కార్మికులకే తెలియాలి
 • ప్రభుత్వంలో విలీనం అసాధ్యం, అసంభవం
 • ఒక్క సంతకంతో 7000 బస్సులకు పర్మిట్లు
 • ఐదారు రోజుల్లోనే కొత్త బస్సుల నిర్ణయం
 • కేంద్ర చట్టం మేరకే రూట్ల ప్రైవేటీకరణ
 • పర్మిట్లతో సమస్యకు శాశ్వత పరిష్కారం
 •  జీతాలు 67 % పెంచినా గొంతెమ్మ కోర్కెలా?
 • వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఇక ఉండదు
 • ఇందుకు సంఘాలు, పార్టీలే కారణం: సీఎం

హైదరాబాద్‌: ‘‘ఇంక ఆర్టీసీ ముగుస్తోంది. ఇది నిజం. ఇదే జరగబోతోంది. మా సంస్థను మేమే చంపుకొంటామని అంటే వాళ్లను ఎవరు కాపాడతారు? విలీనం అసాధ్యం. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అనేది 100 శాతం అసంభవం. ఈ భూగోళం ఉన్నంత వరకూ జరిగేది కాదు. ఆర్టీసీ మునిగిపోక తప్పదు. సంస్థను ఎవ్వరూ కాపాడలేరు. ఆర్టీసీ దివాలా తీసింది. నా దృష్టిలో ఆర్టీసీ పని అయిపోయినట్లే. చివరికి జరిగేదేమంటే.. ఆర్టీసీ మునిగిపోక తప్పదు. సంస్థను ఎవ్వరూ కాపాడలేరు. ఆర్టీసీ దివాలా తీసింది. నా దృష్టిలో ఆర్టీసీ పని అయిపోయినట్లే. చివరికి జరిగేదేమంటే.. ఆర్టీసీ సమ్మెకు ముగింపు.. ఆర్టీసీ ముగింపే! సమ్మెకు వెళ్లేముందే కార్మికులు తమ గురించి, తమ కుటుంబాల గురించి ఆలోచించాల్సింది! వారి బతుకులెట్లా అనే సంగతి వారికే తెలియాలి! ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించాలన్నది ప్రభుత్వ బాధ్యత. దీనిపై ఐదారు రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటం. రవాణా శాఖ మంత్రి, నేను ఓ సంతకం పెట్టి 7 వేల బస్సులకు పర్మిట్లు ఇస్తం. ఆ బస్సులన్నీ రోడ్ల మీద రయ్యిన తిరుగుతయి. ఇప్పుడున్న దానికంటే తక్కువ చార్జీలతో నడుస్తయి. ఆర్టీసీని నడుపుతమంటే మాత్రం అది జరగదు. మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, బెంగాల్‌ తరహాలో చివరి నిర్ణయం తీసుకోబోతున్నం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అతి త్వరలో పర్మిట్లు ఇచ్చేస్తామని, తమకు ఆ అధికారం ఉందని, తమకు ఎవరూ అడ్డురారని తేల్చి చెప్పారు. పర్మిట్లు ఇచ్చేస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోతుందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలనేది ఒక అసంబద్ధమైన, అసంభవమైన, అర్థరహితమైన, తెలివితక్కువ నినాదమని ధ్వజమెత్తారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఆర్టీసీ సమ్మెకు ముగింపు.. ఆర్టీసీ ముగింపే!
‘‘ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నది పిచ్చి పంథా. అర్థం పర్థంలేని దురహంకార పద్ధతి. కార్మిక సంఘాలను పిలిపించలేదా? మాట్లాడలేదా? పిలవలేదని ఎవడంటాడు వెధవ? కమిటీ వేయలేదా? నేను చొరవ తీసుకోకపోతే కమిటీ ఎట్ల వచ్చింది? ఆర్టీసీ సమ్మెకు ముగింపు.. ఆర్టీసీ ముగింపే! ఈ సమ్మె ఫలితం ఏమిటంటే.. వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండే ఆస్కారం లేదు. ఇందుకు యూనియన్లు, వాటికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలే కారణం. ఈ యూనియన్లతో ఆర్టీసీకి భవిష్యత్తు లేదు. సీఎంగా ఈ మాట చెబుతున్నాను.

కార్మికులను యూనియన్లే ముంచాయి
‘‘ఆర్టీసీలను యూనియన్లే ముంచుకుంటున్నాయి. ఏం సమ్మె వీళ్లది? సమ్మెకు అర్థం ఉందా? దిక్కుమాలిన సమ్మెలా? బుద్ధి, జ్ఞానం ఉండే సమ్మెలా? తిన్నదరగక చేసే సమ్మెలా? 40 ఏళ్ల చరిత్ర తీసుకుని చూడండి. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడూ సమ్మెలు చేశాయి. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ హయాంలోనూ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు కారణాలు తెలుసా? మూడేళ్లకో నాలుగేళ్లకో వీళ్లకు దిక్కుమాలిన యూనియన్‌ ఎన్నికలుంటాయి. వాటిలో గెలవడానికి చేసే పనికిమాలిన సమ్మెలివి. గొంతెమ్మ కోర్కెలు పెట్టి, సమ్మె చేసి కార్మికులను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకునే చిల్లర మల్లర యూనియన్‌ రాజకీయాల సమ్మె. ఉన్మాద స్థితికి లోనై, కార్మికుల్లో పిచ్చి ఆలోచనలు ప్రవేశపెట్టి, వాళ్ల బతుకులు నాశనం చేస్తున్నారు వీళ్లు.

ఆర్టీసీ నష్టాల్లో.. అద్దె బస్సులు లాభాల్లో.. 
ఆర్టీసీకి ఇవాళ రూ.5 వేల కోట్ల అప్పు ఉంది. ఒక నెల వాయిదా కట్టకపోతే నిరర్థక ఆస్తి అవుతుంది. అప్పులిచ్చిన బ్యాంకు వాళ్లు ఊరుకోరు. పీఎఫ్‌ సొమ్ము సర్కారు తీసుకుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పీఎఫ్‌ సొమ్ము ఎవ్వరూ తీసుకోరు. రిటైరైన కార్మికులకు పీఎఫ్‌ ఇచ్చే దమ్ము ఆర్టీసీకి లేదు. రిటైర్మెంట్‌ ప్యాకేజీ ఇచ్చే పరిస్థితి లేదు. దీనికంతటికీ కారణం నష్టాలే! ఆ నష్టాలు ఏడాదికి రూ.1200 కోట్లు. హైదరాబాద్‌లో జబ్బార్‌, కేశినేని, గంగినేని, దివాకర్‌లాంటి ప్రైవేటు ట్రావెల్స్‌ లాభాల్లో నడుస్తాయెట్ల? ఆర్టీసీ నష్టాల్లో నడుస్తదెట్లా? ఆర్టీసీలోనే 2100 అద్దె బస్సులు ఉంటాయి. ఆర్టీసీకి సొంతంగా 8 వేలకుపైగా బస్సులున్నాయి. అద్దె బస్సుల మీద ప్రతి కిలోమీటర్‌కు 75 పైసలు లాభం వస్తోంది. ఆర్టీసీ బస్సుకు ప్రతి కిలోమీటరుకు రూ.13 నష్టం వస్తోంది. అద్దె బస్సుల మీద రోజుకు రూ.4.72 లక్షల లాభం వస్తోంది. ఆర్టీసీ బస్సుల మీద రూ.3 కోట్ల నష్టం వస్తోంది. ఇదీ ఆర్టీసీ పరిస్థితి! పైగా అద్దె బస్సులను తొలగించాలని కార్మికులు అంటున్నారు. అంటే.. ఇంకా నిండా మునగాల్నా?

గంట ఎక్కువ ఎందుకు పని చేయరు!? 
సమాజంలో ఎవరికీ రాని అవకాశం ఆర్టీసీ కార్మికులకు వచ్చింది. సగటున వాళ్లకు రూ.50 వేల జీతం వస్తది. బయట రూ.5 వేలు దొరకనోళ్లు కూడా ఉన్నారు. అన్నమో రామచంద్రా అని రోడ్ల మీద లక్షల మంది తిరుగుతున్నరు. మీకు పని చేసే అవకాశం దొరికింది. ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మీకు లేదా? అవసరమైతే ఓ గంట ఎక్కువ పని చేయరా? నేనో రైతును. పంట పెట్టుకున్న రాత్రి వానొస్తది. పొలానికి పోయి గన్మలు తీయనా? సందర్భమొస్తే గంట ఎక్కువ పని చేయనా? నేను ఆరు గంటలే పని చేస్తానంటే పంట పండుతదా? ఎవరైనా సందర్భాన్ని బట్టి పని చేయాల్సిందే. ఈ గంటలు పెట్టి.. పొంటెలు పెట్టి రకరకాల పనికిమాలిన డిమాండ్లు పెట్టి మా కాళ్లు మేమే నరుక్కుంటం అంటే ఎవరేం చేస్తరు? రెండు నెలల కింద సమ్మె నోటీసు ఇచ్చామని ఇంకో లంగ ప్రచారం పెట్టారు. సముదాయించే ప్రయత్నం చేశాం.

చెప్పినా వినకుండా సమ్మెకు పోయారు 
ఆర్టీసీకి మామూలు రోజుల్లో రోజుకు రూ.11 కోట్లు ఆదాయం వస్తే.. పండుగ సమయంలో రోజుకు రూ.16-17 కోట్ల దాకా వస్తది. ఇలాంటి అద్భుతమైన సమయంలో కార్మికులు సమ్మెకు పోయిన్రు. దాదాపు రూ.125-150 కోట్లు రాకుండా చేసుకున్నరు. మునుపు రోజుకు రూ.10 కోట్లు వస్తుండె. ఇప్పుడు రోజుకు రూ.కోటి నష్టం వస్తోంది. పనికిమాలిన డిమాండ్లతో సమ్మెకు పోయారు. వాటిలో నంబర్‌ వన్‌ డిమాండ్‌ ఆర్టీసీని సర్కారులో విలీనం చేయడం. విలీనానికి సమయం పడుతుందని, సమ్మెకు పోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎ్‌సల కమిటీ చెప్పింది. ఆర్టీసీ సంఘాలు నథింగ్‌ డూయింగ్‌ అన్నాయి. మా ఫస్ట్‌ డిమాండ్‌కు యస్‌ అంటారో నో అంటారో రాతపూర్వకంగా చెప్పండి లేదంటే మేం సమ్మెకు పోతం అన్నరు. కమిటీని కాదని సమ్మెకు పోయిన్రు.

యూనియన్లు చేసేది మహా నేరం.. మహా పాపం
ఆర్టీసీ దగ్గర డబ్బుల్లేవు. అక్టోబరు మొదటి వారంలోనే కోరితే రూ.100 కోట్లు విడుదల చేసినం. వాటిని బ్యాంకుకు కిస్తీకని, డిజిల్‌కని, అద్దె బస్సులకని కట్టిన్రు. అది పోగా రూ.7 కోట్లు మిగిలినయి. అతి తెలివితో ఆర్టీసీలోనే సచ్చిపోయిన ఎన్‌ఎంయూ అనే యూనియన్‌ హైకోర్టులో కేసు వేసింది. డబ్బుల్లేవంటూ హైకోర్టుకు ఆర్టీసీ ఉన్న విషయం చెప్పింది. హైకోర్టు ఏం చేస్తది? కొడ్తదా? సంకెల సస్కాన ఉంటేనే కదా ఇచ్చేది? డబ్బుల్లేవు.. డబ్బులు రావు! ఇది వాస్తవం. ఇది మామూలు క్రైం కాదు. ఆర్టీసీ యూనియన్లు చేస్తోంది మహా నేరం.. మహా పాపం. అమాయక కార్మికుల జీవితాలతో ఆడుకుంటూ వారి గొంతు కోస్తున్నరు. ఆర్టీసీని వాళ్లే స్వయంగా ముంచుకుంటున్నరు. ముగించుకుంటున్నరు.

అమాయకులైతే దరఖాస్తు పెట్టుకుని జాయినవ్వాలి
కార్మికులు అమాయకులైతే ఎక్కడివాళ్లు అక్కడకుపోయి దరఖాస్తు పెట్టుకుని జాయిన్‌ కావాలి. సెల్ఫ్‌ డిస్మిస్‌ అని నేననుడు కాదు. అది వాస్తవం. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు. నాకు చెప్పాపెట్టకుండా నీ అంతట నువ్వు వెళ్లిపోయావు. నిన్ను నువ్వు డిస్మిస్‌ చేసుకున్నట్టే కదా..? కార్మికులను ఎవ్వరూ వెళ్లగొట్టలేదు.. వెళ్లగొట్టం కూడా. మేమెందుకు వెళ్లగొడ్తం! కాగితం, పెన్ను ఖర్చు దండగ. చర్చలకు నేను చొరవ తీసుకోలేదనేది సరికాదు. నేనే చొరవ తీసుకున్నా.

ముఖ్యమంత్రినే తిడతారా..?
చర్చలు జరపాలని కోర్టు చెప్పింది. సమావేశం పెట్టుకుని చర్చలు జరపాలని నేను చెప్పాను. దాని కోసమైనా ఆగొచ్చు కదా. సంస్కారం ఉండొద్దా? సీఎంని తిడతారా? నేతల సంస్కారమా ఇది. ప్రభుత్వాధినేతను తిట్టి సమస్యలను పరిష్కరించుకుంటారా? జరిగే పనేనా? వాడెవడో తోకగాడు చెప్పినట్లు అసెంబ్లీ రద్దు చేయాలట. కూలిపోయే పార్టీలు ఏవో ఇప్పుడు కనబడడం లేదా?

ఎక్కడున్నాయిరా బేవకూఫ్‌ అని అడగాలి
ఆర్టీసీకి రూ.60 వేల కోట్ల ఆస్తులు చూపిస్తావా? వాడెవడో పిచ్చోడు మాట్లాడితే నువ్వు కూడా మాట్లాడతావా? మీరు జర్నలిస్టులు.. ఎక్కడున్నాయిరా బేవకూఫ్‌ అని అడగాలి అక్కడనే. పనికిమాలిన రాజకీయ పార్టీలు, తలకాయ మాసిపోయినోడు, నెత్తి మాసిపోయినోడు వీళ్లా మాట్లాడేది? ఎక్కడ పదిమంది కనిపిస్తే అక్కడికిపోయి జెండా పట్టుకుని కూర్చుంటున్నారు. ఇది రాజకీయమా? బాధ్యత కలిగిన ప్రతిపక్షాలు చేయాల్సిన పనేనా ఇది? అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా?

మిగిలిన 56 కార్పొరేషన్లూ కలపాలని అడిగితే!?
తర్వాత ఎవరు పడితే వాళ్లు వచ్చి మమ్మల్ని ప్రభుత్వంలో కలపండి అని అడుగుతున్నారు. ఎవరిని పడితే వాళ్లను ప్రభుత్వంలో కలుపుతారాండి నాకర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వంలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి. నిన్ను కలిపితే రేపు పొద్దున్న వాళ్లంతా సమ్మె దారి పడితే ఏం చెప్పాలి? ప్రభుత్వమంటే దానికో బాధ్యత ఉంటుంది. పద్ధతి ఉంటుంది. మిగతా కార్పొరేషన్లు మమ్మల్ని కూడా ప్రభుత్వంలో కలపాలని కోరితే అప్పుడేం చేయాలి? ఆర్టీసీని కలిపారు కనక వీటిని కూడా కలపండని ఇవే కోర్టులు ఆదేశాలు ఇస్తాయి.

పెంచినా గొంతెమ్మ కోరికలా!?
ఆర్టీసీకి సంబంధించి నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్రంలో లేడు. ఆ సంస్థ పట్ల నాకు అభిమానం కూడా ఉంది. గతంలో నేను మూడేళ్లు రవాణా మంత్రిగా పని చేశా. నేను బాధ్యతలు తీసుకున్న రోజు సంస్థ రూ.13.87 కోట్ల నష్టాల్లో ఉంది. ఏడాదిన్నరలోనే నష్టాన్ని పూడ్చి 1997-98లో మరో రూ.14 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చా. ఆ తర్వాత సీఎం అయ్యాను. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పెట్టని విధంగా వైశ్రాయి హోటల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యాను. ఒక రోజంతా మాట్లాడాను. ఆర్టీసీ బాగుకు సలహాలు ఇచ్చాను. వాళ్ల జీతాలు 44 శాతం పెంచాను. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వాళ్లు వచ్చి మాకు ఐఆర్‌ పెంచాలని అడిగారు. 14 శాతం ఐఆర్‌ ఇచ్చాను. రెండుసార్లు కలిపి 67 శాతం కార్మికుల జీతాలు పెంచాం. భారతదేశ చరిత్రలో ఎక్కడైనా నాలుగేళ్లలో కార్మికుల జీతాలను 67 శాతం పెంచిన చరిత్ర ఉందా? ఇంత పెంచిన తర్వాత ఇంకా మేం గొంతెమ్మ కోరికలు కోరతామంటే అర్థం ఉంటుందా? ఏం తమాషానా? బతకపుట్టని పిల్ల మంచమంతా ఎగిరిందన్నట్లు బతకదలచుకున్నారా? సంస్థనే పోతుంటే ఇక యూనియన్‌ ఎక్కడిది?

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేశారా!?
‘‘బీజేపీ నాయకులు ఇక్కడ ఉపన్యాసాలు బాగా మాట్లాడుతున్నారు కదా.. వాళ్లు ఏ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదు? కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు విలీనం చేయలేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆర్టీసీ నామమాత్రంగా మిగిలింది. అన్ని రాష్ట్రాలూ తీసిపాడేశాయి. పశ్చిమ బెంగాల్లో పది లక్షల మంది జనాభా ఉంటే ఆర్టీసీ బస్సులు 200 మాత్రమే ఉన్నాయి. బిహార్లో నామమాత్రంగా అతి తక్కువగా ఉన్నాయి. అవి కూడా అద్దె బస్సులు. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని మూసేసింది కాంగ్రెస్‌ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌.

కేంద్రమే చట్టం చేసింది
కేంద్రంలో రెండోసారి మోదీ ప్రభుత్వం వచ్చాక మోటార్‌ వెహికిల్‌ సవరణ చట్టం చేశారు. ఆర్టీసీలకు సంబంధించిన అధికారాలను రాష్ట్రాలకు ఇచ్చారు. ఇక్కడి బీజేపీ నేతలేమో పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆర్టీసీకి పోటీదార్లను సృష్టించడం ద్వారా ఎక్కువ రూట్లు పెరుగుతాయని రాష్ట్రాలకు అధికారాన్ని కేంద్రం అప్పగించింది. ప్రైవేటుపరం చేయాలని కేంద్రమే చెప్పింది.

చట్టవిరుద్ధమైన సమ్మె
ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం. వాళ్లపై ఇప్పటికే ఎస్మా ఉంది. అది ఉండగానే సమ్మెకు పోయారు. పాత ఆర్టీసీ బతికి బట్టకట్టకుండా యూనియన్లు, వాటికి మద్దతు ఇస్తున్న పార్టీలే చేశాయి. ఆర్టీసీ, డ్రైవర్లు, కండక్టర్లతో నాకు పంచాయితీ ఉంటదా? విద్యుత్తు ఉద్యోగులు విజయం సాధించారు. సింగరేణి మునిగిపోతుంటే కాపాడాం. యూనియన్లు, రాజకీయాలు లేకుండా ఆర్టీసీ సరిగ్గా పనిచేస్తే రెండేళ్లలో లక్ష బోనస్‌ తీసుకునే పరిస్థితి వస్తది. కార్మికుల ఆలోచనలు చెడగొట్టి, వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు.

బస్టాండ్లు అమ్ముకోవాలి
‘‘కార్మికులది పిచ్చి సమ్మె. రోజూ వచ్చే రూ.11 కోట్ల ఆదాయాన్ని పోగొట్టుకుంటున్నారు. 29న కోర్టు విచారణ ఉంది. హైకోర్టుకు తీర్పు చెప్పే అధికారం లేదు. డిమాండ్లు అంగీకరించమనే అధికారం కూడా లేదు. సామాన్యుల కోణంలో ఆలోచించండి అని చెప్పింది. ఇండస్ట్రియల్‌ ట్రైబ్యునల్‌కు రిఫర్‌ చేయాల్సి వస్తుంది. అప్పుడు జీతాల కోసం ఆస్తులమ్ముకోవాలి. లేదంటే వేలం వేస్తారు. 4 బస్టాండ్లు అమ్మి జీతాలివ్వాలి. బస్సులుంటే బస్సులు అమ్మాలి. 100ు ఇదే జరుగుతది. కార్మికుల పొట్టకొట్టొద్దనేవాడు, మెడమీద తలకాయ ఉండే వాడెవడూ చేసే సమ్మె కాదిది.

5 వేల కోట్లకు పైనే ఇచ్చాం
టీఆర్‌ఎస్‌ సర్కారు రాకముందు ఐదేళ్లలో ఆర్టీసీకి సర్కారు ఇచ్చిన డబ్బు రూ.712 కోట్లు. టీఆర్‌ఎస్‌ సర్కారు వచ్చినంక రూ.4,250 కోట్లు విడుదల చేశాం. అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో నష్టాన్ని జీహెచ్‌ఎంసీ భరించాలని చట్టం కూడా తెచ్చినం. వాళ్లు ఒక ఏడాది గ్రాంటు రూ.330 కోట్లు ఇచ్చిన్రు. అంటే.. మొత్తంగా రూ.4580 కోట్లు ఇచ్చినం. ఈ ఏడాది 550 కోట్లు బడ్జెట్‌లో పెట్టి.. రూ.425 కోట్లు విడుదల చేసినం. ఇంకెక్కడి నుంచి ఇస్తారు డబ్బు!?

కార్మికులు, అధికారులు మంచోళ్లే
ఆర్టీసీ కార్మికులు, యాజమాన్యం, అధికారులు మంచివాళ్లే. వారికి అనేక అవార్డులు కూడా వచ్చినయ్‌. చాలా సమర్ధత ఉంది. బ్రహ్మాండంగా నడుపుతరు. పంచాయతంతా యూనియన్లదే. యూనియన్ల విష కౌగిళ్ల నుంచి బయటపడితే కార్మికులు బయటపడతరు. కార్మికుల గురించి మేం ఆలోచిస్తున్నాం. కానీ, యూనియన్లే కార్మికుల రక్తం పీల్చుకుంటున్నాయి. అవే కాలపెట్టుకుంటున్నాయి. అన్నం పెట్టే సంస్థను నరుక్కుంటున్నాయి. ఆర్టీసీని ముఖ్యమంత్రి, మంత్రి అడ్డుకోవట్లేదు. రోజూ రూ.11 కోట్ల ఆదాయాన్ని వదులుకోవడమంటే బలుపా అది. వాళ్లు మాట్లాడే మాటలేంటి..? బాధ్యత ఉందా? మాట్లాడేవాని విలువేంది? ప్రజలకు ఇబ్బంది అవుతోంది. తప్పదు. ప్రజలు కూడా భరించుకోవాలి.

కొత్త బస్సులకు పోటీ
రాష్ట్రంలో 4100 అద్దె బస్సులు ఉన్నాయి. కొత్తగా 2350 దరఖాస్తులు వచ్చాయి. కొత్త బస్సులు నడిపేందుకు పోటీ చాలా ఉంది. చాలామంది ముందుకొస్తున్నరు. వారం లోపల కొత్త బస్సులు వస్తయి. ఆర్టీసీలో బతక దల్చుకునేవాడు ఉంటడు.. లేనోడు పోతడు. ఈ యూనియన్లు ఇదే తరహాలో పనికిమాలిన, పిచ్చి తరహాలో నడుపుతమంటే నడవదు.

ఆ అధికారం హైకోర్టుకు లేదు
హైకోర్టు ఏం చేస్తది? కొడ్తదా? సంకల సస్కాన ఉంటేనే కదా ఇచ్చేది? డబ్బుల్లేవు.. డబ్బులు రావు! ఇది వాస్తవం. ఇది మామూలు క్రైం కాదు. ఆర్టీసీ యూనియన్లు చేస్తోంది మహా నేరం.. మహా పాపం. 29న కోర్టు విచారణ ఉంది. హైకోర్టుకు దీనిపై తీర్పు చెప్పే అధికారం లేదు. తమకు ఏ అధికారమూ లేదనీ, డిమాండ్లు అంగీకరించాలని చెప్పే అధికారమూ లేదనీ, సామాన్యుల కోణంలో ఆలోచించాలని మాత్రమే హైకోర్టు చెప్పింది.

అహంకారం పనికిరాదు
రేపు మీరు (విపక్షాలు) కూడా అధికారంలోకి రావచ్చు కదా! ఇది ప్రజాస్వామ్యం.. చివరికి అధికారాన్ని నిర్ణయించేది ప్రజలు. అధికారం ఉన్నా లేకపోయినా మిడిసిపాటు, అహంకారం, అహంభావం లేకుండా ఉండాలి. ఇతరుల ఎడల తిరస్కార ధోరణి కానీ అసహన వైఖరి దీర్ఘకాలంలో మంచిది కాదు.

పెడబొబ్బల బీజేపీకి వచ్చిన ఓట్లెన్ని?
బీజేపీ వాళ్లు ప్రతిరోజూ పెట్టిన అరుపులు, పెడబొబ్బలకు.. హుజూర్‌నగర్‌లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లకు మధ్య పోలిక ఉందా!? డిపాజిటే పోయింది కదా..!

ఏపీలో మన్ను కూడా జరగలేదు
ఆర్టీసీ విలీనంపై సీఎం కేసీఆర్‌ : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రయోగం చేశారని, అక్కడ మన్ను కూడా జరగలేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘‘కమిటీ వేశారు. మూడు నెలలకో ఆరు నెలలకో ఏదో కత చెబుతారట. అక్కడ ఏం జరుగుతుందో దేవునికి ఎరుక’’ అని ఎద్దేవా చేశారు.

Courtesy Andhra Jyothy