• ప్రగతిభవన్‌ ముట్టడికి ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల యత్నం
  • అరెస్టు.. ఉద్యోగం ఇవ్వాలంటూ పోలీసు స్టేషన్‌లో ఆందోళన

అఫ్జల్‌గంజ్‌/హైదరాబాద్‌, నవంబరు 4: ఆర్టీసీ సమ్మె కాలంలో సేవలందించిన తమకు అదే సంస్థలో ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు డిమాండ్‌ చేశారు. 52 రోజుల పాటు తమ సేవలను వాడుకొని తర్వాత గెంటేశారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ వివిధ డిపోలకు చెందిన వందలాది మంది తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు బుధవారం ప్రగతిభవన్‌కు వచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌ మైదానంతో పాటు పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. అక్కడా వారు నిరసన వ్యక్తం చేశారు. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఆర్టీసీని నమ్ముకొని వచ్చామన్నారు. ఇప్పుడు రెండు ఉద్యోగాలు కోల్పోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. రోజూ 10-15 గంటల పాటు కష్టపడిన తమకు న్యాయం చేయాలని కోరారు. తమకు కనీసం తాత్కాలిక పద్ధతిలోనైనా చిన్న ఉద్యోగం కల్పించాలని విన్నవించారు. 52 రోజుల పాటు తాము అందించిన సేవలకు ఆర్టీసీ తరఫున గుర్తింపు పత్రం ఇవ్వాలని కోరారు. ఆర్టీసీలో భవిష్యత్‌ నియామకాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నల్లగొండ, ఆదిలాబాద్‌ సహా వివిధ జిల్లాల్లోనూ తాత్కాలిక ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, బోధ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావులకు వినతిపత్రం అందజేశారు.

Courtesy Andhrajyothi…