• సమ్మె మొదలైనప్పటి నుంచి 9 మందికి పైగా మృతి
  • తాత్కాలిక డ్రైవర్ల వైఖరితో పలు ప్రమాదాలు
  • ఆదివారం వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు బలి
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక డ్రైవర్లు ప్రజల పాలిట యమదూతల్లా వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్ష్యంతో సామాన్యుల
ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రజలు రోడ్డు పక్కన నడవాలన్నా భయపడుతున్నారు. సమ్మె ప్రారంభమైన నాటి నుంచి ఆర్టీసీ బస్సులు ఢీకొని 9 మందికిపైగా చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. గాయపడిన వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది.
తృటిలో ప్రాణాలతో బయటపడ్డవారూ ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఆదివారం ఆర్టీసీ బస్సులు ఢీకొని వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలానికి చెందిన జ్యోతి పస్రాలో నివాసం ఉంటోంది. హోటల్‌లో పనిచేస్తూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. ఆమె భర్త విజయవాడలో పనిచేస్తున్నాడు. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం ఆస్పత్రికి వెళ్లింది. సాయంత్రం 6.15 గంటల సమయంలో ఇంటికి తిరిగివస్తుండగా హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు టైరు జ్యోతి తలపైకి ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
డ్రైవర్‌ అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన ముల్కలపల్లి వెంకన్న(37) హైదరాబాద్‌లో నివాసం ఉంటూ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం నిజామాబాద్‌ వెళ్తూ కారు ఆపి రోడ్డు దాటుతున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వెంకన్నకు తీవ్ర గాయాలై చనిపోయాడు. బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. నిజామాబాద్‌ జిల్లా మానిక్‌భండార్‌ శివారులో ధన్‌రాజ్‌(34) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కోరుట్ల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు కర్ణాటకకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
అమరుల స్థూపానికీ ఢీ..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌లో ఆదివారం తాత్కాలిక డ్రైవర్‌ బస్సును మలుపు తిప్పే క్రమంలో అమరవీరుల స్థూపాన్ని ఢీకొట్టాడు. స్థూపం మెట్టు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు ఆందోళన చెందారు. తాత్కాలిక డ్రైవర్ల వల్ల జరిగే ప్రమాదాల్లో ప్రయాణికులకు ఎటువంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్టీసీ, ప్రజా సంఘాలు హెచ్చరించాయి.
courtesy andhra jyothy