• రూట్ల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం.. 
  • రేపు కేబినేట్‌ భేటీలో కీలక నిర్ణయం?
  • 4000 వాహనాలకు పర్మిట్లు ఇచ్చే యోచన
  • ప్రత్యామ్నాయ రవాణా విధానంపై దృష్టి
  • ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ కసరత్తు
  • అద్దె బస్సుల నోటిఫికేషన్‌కూ ఆమోదం
హైదరాబాద్‌: రాష్ట్రంలో స్టేజి కేరేజీ రూట్ల ప్రవేటీకరణకు రంగం సిద్ధమైంది. అంటే, ప్రైవేటు బస్సులు ఆర్టీసీ బస్సుల్లా మధ్య మధ్యలో ఆగుతూ ప్యాసింజర్లను ఎక్కించుకుంటూ వెళతాయి. ఇప్పటిదాకా దొంగతనంగా జరుగుతున్న ఈ వ్యవహారం ఇక చట్టబద్ధం అవుతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలో బస్సురూట్ల ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఇదే అంశంపై శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీపైనే చర్చించనున్నారు. రూట్లను ప్రైవేటుపరం చేయడంపై కేబినేట్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించడమొక్కటే మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చే పేరుతో రూట్ల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రభుత్వం ముందుకు తెస్తోంది. దీనిపై మంత్రివర్గ ఆమోదం తీసుకుని, రూట్ల ప్రైవేటీకరణకు నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు 26 డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు అక్టోబర్‌ 5 నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ సొంతంగా బస్సులను నడపలేకపోతోంది. ప్రయాణికులకు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా సదుపాయాలు అందడం లేదు. రోజూ సగటున 7000 బస్సులను తిప్పుతున్నామని ఆర్టీసీ ప్రకటిస్తోంది. కానీ, గ్రామీణ ప్రాంతాలకు బస్సులు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరో పక్క ప్రభుత్వం సమ్మెను పరిష్కరించలేకపోతోంది. కార్మికులు సమ్మెను విరమించేది లేదని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.
కార్మికుల డిమాండ్లపై కసరత్తు!
కేసీఆర్‌ ఇప్పటికే ఆర్టీసీపై అవగాహన కలిగిన నిపుణులతో, ఐఏఎ్‌సలతో మాట్లాడినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందుతోంది? కార్మికుల డిమాండ్లలో పరిష్కరించదగినవి ఎన్ని, పరిష్కరించలేనివి ఎన్ని అనే అంశాలపై కసరత్తు చేసినట్లు సమాచారం. వీటన్నింటినీ క్రోడీకరించుకుని తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. జేఏసీ డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ఆర్థిక సాయాన్ని తీసుకోవడంపై చర్చించనున్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం ఈక్విటీ ఉంది. ఈ దృష్ట్యా ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరే విషయంలో ఇంకా ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై చర్చిస్తారు. లోకాయుక్త చట్ట సవరణ అంశంపై కేబినెట్‌ చర్చించి ఆమోదం తెలపనుంది. మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌, సమాచార హక్కు కమిషన్‌లో నియామకాలపై చర్చించనుంది. రోడ్లు భవనాలు తదితర శాఖల్లో కొత్త పోస్టుల సృష్టికి ఆమోదం తెలపనుంది.
1,035 అద్దె బస్సులకు టెండర్లు
ఇప్పటికే ఆర్టీసీలో బస్సుల సంఖ్యపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆర్టీసీలో 50% బస్సులు మాత్రమే సంస్థకు చెందినవి ఉంటాయని, మిగతా 30% అద్దె బస్సులుంటాయని తెలిపింది. మరో 20% రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లకు పర్మిట్లు ఇచ్చి, ప్రైవేటు వాహనాలను స్టేజీ క్యారేజీలుగా నడిపే వీలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అద్దె బస్సుల సంఖ్యను పెంచడానికి ఇప్పటికే ఆర్టీసీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మొత్తం 1,035 అద్దె బస్సుల కోసం టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ బస్సులు వచ్చి చేరితే ఆర్టీసీలో అద్దె బస్సుల వాటా 30 శాతానికి చేరుతుంది. ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక జేఏసీ తీవ్రంగా మండిపడింది. ఆర్టీసీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆమోదం లేకుండా అద్దె బస్సులకు నోటిఫికేషన్‌ను జారీ చేశారంటూ జేఏసీ న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో 1,035 అద్దె బస్సుల నోటిఫికేషన్‌ అంశానికి కేబినేట్‌లో ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇక మిగిలింది ప్రైవేటు వాహనాలకు పర్మిట్ల అంశమే.
రూట్లను ప్రైవేటుపరం చేసి, ప్రజలకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. 3000 నుంచి 4000 ప్రైవేటు వాహనాలకు స్టేజీ క్యారేజీలుగా పర్మిట్లు ఇవ్వాలని భావిస్తోంది. రూట్లకు అనుమతులివ్వడంలో సాంకేతికపరమైన సమస్యలు ఎదురవుతాయా అన్నది కేబినెట్‌లో చర్చించనున్నారు. మోటారు వాహన(సవరణ)-2019 చట్టం కింద రూట్లను ప్రైవేటుపరం చేయాలని రాష్ట్రం యోచిస్తోంది. కేబినేట్‌లో దీని గురించి వివరించి, ఆమోదం పొందుతారని సమాచారం. కేబినేట్‌ ఆమోదం లభించగానే రూట్ల ప్రైవేటీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. సెట్విన్‌లాంటి మినీ బస్సులను పెంచడంపైనా నిర్ణయం తీసుకుంటారు.
Courtesy Andhra Jyothy..