•  గుండెకు స్టెంట్‌.. శస్త్రచికిత్సకు 1.7లక్షలు
  •  డబ్బివ్వని సర్కారు.. కట్టాలంటున్న ఆస్పత్రి వర్గాలు
ముషీరాబాద్‌/హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె… సంఘాలు, సర్కారు మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన ఓ విశ్రాంత కార్మికుడిని ఆస్పత్రిలో బందీని చేశాయి. శస్త్రచికిత్స జరిగి పూర్తిగా కోలుకుని మూడు రోజులైనా ఆయన్ను డిశ్చార్జ్‌ చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం ససేమిరా అంటోంది. ఎందుకంటే.. సర్జరీకి అయిన రూ.1.7లక్షల వ్యయాన్ని సర్కారు భరిస్తుందని బాధితుడు భరోసాగా ఉంటే పైసా రాలేదు. దీంతో ఆ డబ్బంతా కడితే తప్ప ఇంటికి పంపేది లేదని ఆయనకు యాజమాన్యం స్పష్టం చేసింది! బహదూర్‌పురాకు చెందిన రియాజ్‌ (56) అనే రిటైర్డ్‌ ఉద్యోగి వ్యధ ఇది. ఆయన ముషీరాబాద్‌-2 డిపోలో పనిచేసి గత ఫిబ్రవరిలో రిటైర్‌ అయ్యాడు. ఈ నెల 6న రియాజ్‌కు గుండెపోటు రాగా తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు.. గుండెకు స్టెంట్‌ వేయాలని, ముషీరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి అదేరోజు పంపించారు. 6న కేర్‌లో రియాజ్‌కు వైద్యులు స్టెంట్‌ వేశారు. బిల్లు రూ.1.7లక్షలైంది. సర్జరీకి అయ్యే ఖర్చును ఆర్టీసీ యాజమాన్యమే భరిస్తుందని తార్నాక ఆస్పత్రి వైద్యులు ఆయనకు చెప్పారు. అయితే, సమ్మె వల్ల ఆర్టీసీ యాజమాన్యం డబ్బులు చెల్లించలేదని నువ్వే పూర్తి బిల్లు చెల్లిస్తే డిశ్చార్జ్‌ చేస్తామని కేర్‌ ఆస్పత్రి యాజమాన్యం అతడి చేతిలో బిల్లు పెట్టింది. డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో రియాజ్‌ గత మూడు రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నాడు.
ఆత్మహత్యకు సిద్ధం
కేర్‌ ఆస్పత్రిలో చేరి స్టెంట్‌ వేసుకున్నాను. ఆర్టీసీ యాజమాన్యమే బిల్లు చెల్లిస్తదని తొలుత చెప్పారు. ఇప్పుడు డబ్బులు కట్టాలని ఒత్తిడిచేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకైనా సిద్ధమే. కానీ అంత డబ్బయితే నా దగ్గర లేదు. రూ.1.7లక్షలు అప్పుతెస్తే నా కుటుంబం వీధిన పడుతుంది. బిల్లును ఆర్టీసీ యాజమాన్యమే చెల్లించి ఆదుకోవాలి. – విశ్రాంత కార్మికుడు రియాజ్‌
Courtresy Andhra Jyothy