ఆర్‌. సుధాభాస్కర్‌
సెల్‌: 9490098025

తమలపాకుతో నేనొకటిస్తే తలుపు చెక్కతో నువ్వొకటిస్తావా? అని అమాయకంగా అడిగే రోజులు పోయాయి. ఇవి వాషింగ్టన్‌ ఏకాభిప్రాయ (కన్సెన్సస్‌) రోజులు. ‘పెట్టుబడి’ని బ్రహ్మాండంగా రక్షించగలిగిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘తలుపు చెక్కలు విసురుకునే’ ఆనవాయితీ తగ్గిపోతోంది. గతంలో పీఎఫ్‌ఆర్‌డీఏ బిల్లు నుంచి తాజాగా బ్యాంకుల విలీనం బిల్లు దాకా ప్రధాన పాత్రధారులైన కాంగ్రెస్‌, బీజేపీలను, ఆ రెంటినీ పట్టుకుని వేలాడే శిష్యపరమాణువులను వంతపాటగాళ్ళైన టీడీపీ, టీఆర్‌ఎస్‌ లాంటి వాటిని కలిపి ఆడించే సూత్రధారుల గురించి తర్వాత చర్చించుకుందాం.
ఆర్టీసీ సమ్మె మొదలైన పదిరోజుల తర్వాత కేసీఆర్‌ ఇక్కడి బీజేపీ నాయకుల్ని ముందు తమలపాకుల్తో కొట్టాడు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజరులాగా బీజేపీ వారు తలుపు చెక్కల్తో కొట్టారు. పాపం! గత్యంతరం లేని పరిస్థితిలో కేసీఆర్‌ జర్ర స్పీడు పెంచి ‘ఇదుగో, మీ మోడీ సాబ్‌ ఢిల్లీలో చేసిన చట్టాన్నే నేను టీఎస్‌ ఆర్టీసీలో అమలు చేశానని సంబంధిత పేజీలు ప్రదర్శన కూడా చేశారు. అంటే బీజేపీ వాళ్ళు ఇక్కడ సీన్‌లో ఎంటర్‌ గాక పోతే కేసీఆర్‌ కూడా చప్పుడు చేయకపోను.
తోడు దొంగల యవ్వారమంటే ఇదేగా! పార్లమెంటులో బీజేపీ వారు తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకించి ఉంటే నేడు ఆ మాట అనేందుకు కేసీఆర్‌కు అర్హతుండేది. ఆనాడు రెండు చేతులా దాన్ని ఆహ్వానించి ఇప్పుడు మీ చట్టం వల్లే ఇదంతా జరిగిందంటే జనం దేంతో నవ్వుతారో తెలుసుకో సార్‌!
ముక్కలే వేరు – తానంతా ఒకటే !
నేతన్న తయారు చేసిన బట్ట ఒకటే! దాని మీద ఒక చోట మూడు రంగులేసుకున్నారు. ఒక చోట కాషాయంలో ముంచుకున్నారు. ఇంకోచోట గులాబీరంగు అద్దుకున్నారు. అన్నీ ఒక తానులోని ముక్కలే! వీళ్ళందర్నీ ఆడించే సూత్రధారి ఒకడే. ‘అలవైకుంఠపురంబులో, నగరిలో, ఆ మూలసౌధంబుదాపల’ అని పోతన అన్నట్టు 13వేల కి.మీ. దూరంలో, శ్వేతసౌథంలో – అది ఏనుగైనా, గాడిదైనా (రిపబ్లికన్‌ పార్టీ గుర్తు ఏనుగు, డెమొక్రటిక్‌ పార్టీ గుర్తు గాడిద) మనలాంటి దేశాల పిలక వాడి చేతిలో ఉంటుంది.
రెండో ప్రపంచ యుద్ధం ముగింపుతో వందల యేండ్లనాటి వలస విధానం కూలిపోయింది. సోషలిస్టు ప్రపంచం ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో పాత విధానం కుదరదు కాబట్టి నయావలస విధానానికి తెరలేచింది. 1946లో వాషింగ్టన్‌ నగరంలో పురుడు పోసుకున్నాయి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లనే కవలలు. ప్రపంచ వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని నియంత్రించేందుకు కొద్దిగా ఆలస్యంగా పుట్టిన పిల్ల అంతర్జాతీయ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (ఐటీఓ). అమెరికా దాన్లో చేరకపోవడంతో 1948లో జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ Ê టారిఫ్‌ (గాట్‌) ఏర్పాటైంది. ఇదే 1995లో ప్రపంచవాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ)గా అవతరించింది. నయావలసవాదాన్ని, అంటే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల ప్రయోజనాలను, అంటే ఆ దేశ పెట్టుబడిదార్ల, బహుళజాతి సంస్థల అవసరాలను తీర్చడంలో ప్రపంచ బ్యాంకు (దీని అసలు పేరు) (ఐబీఆర్‌డీ) ఇంటర్నేషనల్‌ బ్యాంకు ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ Ê డెవలప్‌మెంట్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ) కీలకమైన పనిముట్లు. నేటి ఆర్టీసీ అంతర్గాధ (ఎపిసోడ్‌)లో ఇదొక నేపథ్యం.
వీటి వలలో చిక్కిన దేశం అంత తేలిగ్గా బయటికి పోలేదు. 90వ దశకం కంటే ముందు జాతీయ ప్రభుత్వాలకే ప్రపంచ బ్యాంకు అప్పులిచ్చేది. ఆ తర్వాత (ప్రొవిన్షియల్‌) రాష్ట్ర ప్రభుత్వాలకు కూడ ఇస్తోంది. ఆ రకంగా రూ.12వేల కోట్లు అప్పు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న ‘మొనగాడిగా’ చంద్రబాబు నాయుడు ప్రసిద్ధి చెందారు. అంటే నేటి తెలంగాణతో సహా మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచ బ్యాంకు సాలెగూటిలో చిక్కుకుంది. నేడు కేసీఆర్‌. ఆర్టీసీ ప్రయివేటీకరణకి ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకుచావండి’! అనడం వెనుక ఆనాటి ‘ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ రీస్ట్రక్చరింగ్‌ ప్రాజెక్టు’ ఉంది. 1997లో రహస్యంగా రూపొందించిన ‘ఎజెండా ఫర్‌ ఎకనామిక్‌ రిఫార్మ్స్‌ ఇన్‌ ఏపీ’ ఉంది. ఇంటర్‌నెట్‌లో ఈ డాక్యుమెంట్లన్నీ విస్తారంగా లభ్యమవుతాయి.
ప్రభుత్వ ఉద్యోగులను, ఆర్టీసీ, సింగరేణి, నిజామ్‌ షుగర్స్‌ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల్లో ఉద్యోగులను తగ్గించాలని, వీలైతే నష్టాల్లో నడిచే వాటిని వదిలించుకోవాలని (ప్రయివేట్‌ వారికి కట్టబెట్టడం, వాళ్ళూ తీసుకోనంటే మూసేయడం) ఆ డాక్యుమెంట్లలో ఉంది. జీతాల ఖర్చు, పెన్షన్ల ఖర్చు ఎలా తగ్గించుకోవాలో రాశారు. రిటైర్‌ అయ్యే వాళ్ళ స్థానాలను నింపుకుంటూ పోతే ఇక డబ్బులు మిగిలేదేముంది? కాబట్టి సహజసిద్ధంగా వచ్చే ఖాళీలను ఆ పోస్టులు రద్దు చేయడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవాలని రాశారు. సింగరేణి ‘రాజకీయంగా సున్నితమైన’ అంశమని పేర్కొన్న ప్రపంచబ్యాంకు డాక్యుమెంటు అయినా దాన్ని, ఆర్టీసీని ఏ విధంగా ‘సంస్కరించా’లో, వాటిలో ప్రయివేటు వారి భాగస్వామ్యం ఎలా పెంచాలో, వీఆర్‌ఎస్‌ ఎలా ఇవ్వాలో రాశారు.
ఆర్టీసీలో 2000 సంవత్సరం తర్వాతనే కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు, కాంట్రాక్టు కార్మికులు, అద్దె బస్సులు మొదలైనవన్నీ పెరిగాయి. సింగరేణిలో కూడా అండర్‌ గ్రౌండ్‌లో కంటిన్యూవస్‌ మైనర్‌ వంటి భారీ యంత్రాలు, రూఫ్‌బోల్టింగ్‌ వంటివన్నీ ఔట్‌సోర్సింగ్‌కిచ్చేశారు. ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌లో మట్టిని తీసే (ఓవర్‌ బర్డెన్‌ తీయడం) చివరికి బొగ్గు తీసే సర్ఫేర్‌ మైనర్‌ కూడ ప్రయివేటు వారికి ఇవ్వబడ్డాయి. బొగ్గును ఉత్పత్తి చేసిన పాయింట్‌ నుంచి బయటికి పంపే పాయింట్‌ వరకు ఇంటర్నల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అంతా ప్రయివేటు వారికి ఔట్‌సోర్స్‌ చేయబడింది. చంద్రబాబునాయుడి కాలంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న స్పిన్నింగ్‌ మిల్లులు, చక్కెర మిల్లులు నష్టాలొస్తున్నాయనే పేర మూసివేయబడ్డాయి. నిజాం షుగర్స్‌లో కొన్ని యూనిట్లను ప్రయివేటు వారికిచ్చారు. ఫైనల్‌గా కేసీఆర్‌ హయాంలో నిజాం షుగర్స్‌ను మూసివేశారు. నేడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశాల నేపథ్యం.
ప్రజారవాణా ప్రయివేటీకరణకు బీజేపీ కంకణం
రోడ్‌ రవాణాలో కార్పొరేట్‌ శక్తుల ప్రవేశానికి ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థకు పాడె కట్టడానికి బీజేపీ కంకణం కట్టుకుంది. 2014లో అధికారంలోకి రాగానే ఆ ఐదేండ్లలో ఏమేమి చేయాలో, ఎలా చేయాలో నిర్ణయించుకునుంది. 2014 మే 26 మోడీ ప్రమాణ స్వీకారం చేస్తే ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించేశారు. అంటే మోడీ పాలన ప్రారంభమైన మూడో నెల నిండేలోపు జాతీయోద్యమ ఆకాంక్ష ఆరిపోయింది. మిగతావి గుజరాత్‌ సీఎంగా చేసినవే పీఎం మోడీ దేశంలో అమలు చేశారు. ఇవన్నీ అప్పుడు. రెండోసారి మళ్ళీ అధికారంలోకి రాగానే తన ప్రణాళికలను రైల్వేలకు వందరోజుల ప్రణాళికలాగా ముందే ప్రకటించేస్తున్నారు. దానికి ప్రతిఘటన కూడా ఆ స్థాయిలోనే వస్తున్నది. దాన్లో భాగమే నేడు మన రాష్ట్రంలో సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.
2015లో ‘రోడ్డు భద్రతా బిల్లు’తో ప్రారంభమైన ఈ ప్రయివేటీకరణ నాటకం 2019 జులై 31 మోటారు వాహన చట్ట సవరణగా ముగిసింది. రోడ్‌ భద్రతా బిల్లును వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ మోటారు వాహన చట్ట సవరణపై చప్పుడు చేయలేదు. అప్పటికే దొర టీఎస్‌ ఆర్టీసీకి ‘స్పాట్‌’ పెట్టినట్టే ఉన్నాడు. గతంలో దేశ రవాణా శాఖ మంత్రుల మీటింగ్‌లో వ్యతిరేకించిన రాష్ట్ర మంత్రి నేడు నోరు మెదపకుండా నియంత్రించాడు. ఈ విషయాలన్నింటిని నేడు ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలి.
నేడు ఎయిరిండియాను వేలం పాటకి పెట్టిన బీజేపీ, రైల్వే ఉత్పత్తి యూనిట్లను కార్పొరేటీకరించి, ఆ తర్వాత ప్రయివేటీకరించడానికి ప్రయత్నిస్తోంది. రైల్వేలను ప్రయివేటీ కరిస్తానని తాను రెండవసారి అధికారం చేపట్టగానే వంద రోజుల ప్రణాళికలో ప్రకటించాడు మోడీ సాబ్‌. ఇప్పటికే ఢిల్లీ – లక్నో, అహ్మదాబాద్‌ – ముంబైల మధ్య ప్రయివేటు రైళ్ళు తిరుగుతున్నాయి.
ఆర్టీసీకి సంబంధించి బీజేపీ పాపాల పుట్టని తవ్వితే కన్పడేది యం.వి.యాక్ట్‌ సవరణ చట్టం. ఉభయసభల ఆమోదం పూర్తయి, రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా అయిపోయింది. అంటే ఇది అమల్లోకొచ్చేసింది.
దీని ప్రధాన ఉద్దేశం ప్రజారవాణా ధ్వంసం చేయడం. దీన్లో సెక్షన్‌ 67, 88ఎ లు కీలకం. 67లో కొత్తగా సవరించిన అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీలను ప్రయివేటీకరిం చేందుకు ఇటు తిప్పి, అటు తిప్పి అనేక క్లాజుల ద్వారా సదుపాయం కల్పించారు. దీనినుపయోగించుకుని విద్యుత్‌తో నడిచే బస్సులను (పర్యావరణ రక్షణ (ఐ), ఇంధన పరిరక్షణ (జె), ప్రజా జీవితాలను గుణాత్మకంగా అభివృద్ధి చేయడం (కె)) ప్రవేశపెట్టారు. ఈ ఎలక్ట్రికల్‌ బస్సులది పెద్ద దందా. అసలు కథలో ఇదొక ఉప కథ. ఇప్పటికి మన రాష్ట్రంలో 40 ఎలక్ట్రికల్‌ బస్సులు నడుస్తున్నాయి. అన్నీ సిటీలో వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకే. బస్సులు ప్రయివేటు వారివి. నడుపుకునే వారు ప్రయివేటు వారు. వారికొచ్చిన డబ్బు ఆర్టీసీకి జమ చేస్తారు. ఆర్టీసీ మాత్రం కి.మీ.కు రూ.37 వారికి కట్టాలి. తప్పనిసరిగా వారు జమ చేసేది అంతకు తక్కువే ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు కదా! ఈ బస్సుల తయారీదారులు, యజమానులు, సాంకేతిక సాయం అందించే వారు ఒక కన్సార్షియంగా ఏర్పడాలి. దానికి (ఎఫ్‌.ఎ.ఎం.ఇ) ఫాస్టర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఎలక్ట్రికల్‌ హైబ్రిడ్‌ వెహికిల్స్‌ స్కీమ్‌ కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుంది. దేశంలోని ప్రజాధనాన్ని ప్రయివేటు వారికి దోచి పెట్టడమంటే ఇదే కదా!
ఈ సెక్షన్‌ 67 కిందనే రాష్ట్ర ప్రభుత్వం మొదట 5100 రూట్లను, ఆ తర్వాత అన్ని రూట్లను ప్రయివేటీకరించేశాం పోండీ అన్నది. ఇక బీజేపీ వారి అసలు కమాల్‌ 88ఎ లో ఉంది. గతంలో వున్న మోటార్‌ వెహికిల్‌ చట్టాన్ని సవరించినప్పుడు అంతకుముందున్న 88కు 88 (ఎ) ని కొత్తగా చేర్చారు. ఇది ప్రారంభం కావడమే ‘ఈ చట్టంలో రాసిన దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం తన గెజిట్‌ ద్వారా అంతకుముందు ఇవ్వబడ్డ లైసెన్స్‌లను, పర్మిట్లను మార్చవచ్చని రాశారు. వెరసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజా రవాణాను ప్రయివేటు వారి చేతుల్లో పెడ్తున్నారు.
దేశంలో జరుగుతున్న ఉద్యమాలతో సంబంధం లేకుండా ఆయా రంగాల్లోని కార్మికుల, ఉద్యోగుల ప్రయోజనాలకు భిన్నంగా అన్ని రంగాలను ప్రయివేటు వారి చేతుల్లో పెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను దేశ ప్రజలు కనిపెడ్తూనే ఉన్నారు. సరైన జవాబు చెప్పే సమయం ఎంతో దూరంలో లేదు.