తెలంగాణ ఆర్టీసీ సమ్మె రానురాను విషాదభరితంగా, ఉద్రిక్తంగా తయారు కావడానికి సమస్యలోని ఆర్థిక, రాజకీయ అంశాలు కాక పంతాలు పట్టింపులు ఎక్కువ కారణంగా కనిపిస్తున్నాయి. కార్మికులు తమ డిమాండ్ల సాధనలో కట్టుగా ఉండడం, గట్టిగా బేరసారాలు చేయడం సహజం. ప్రభుత్వం వారితో అనునయంగా వ్యవహరించి, మంచిచెడ్డలు చెప్పి ఉభయతారకంగా కొలిక్కి తేవడం చేయాలి. అట్లా కాక, శత్రువులతోనో, ప్రత్యర్థులతోనో వ్యవహరించినట్టు, యుద్ధానికి దిగడం చేయవలసిన పని కాదు. ఎంతటి సంఘటిత ఉద్యమమైనా, అందరు కార్మికులూ ఒకేవిధమైన నేపథ్యంతో, మనస్థితితో ఉండరు. ప్రభుత్వం అనుసరిస్తున్న కర్కశ వైఖరి చూసి ఇద్దరు కార్మికులు ప్రాణాలు తీసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ పాలనలో ఇటువంటి ఆత్మాహుతులకు ఆస్కారం ఉండకూడదు. ఏ కారణం వల్లనో ఆ సున్నితత్వాన్ని పాలకులు విస్మరించారు.
ఆందోళన చేస్తున్న కార్మికులు మొదటగా గుర్తించవలసింది, ఇది సమష్టిగా చేస్తున్న కార్యక్రమం. ఒక్కోసారి సమ్మెలు, ఎంతటి దృఢసంకల్పంతో మొదలుపెట్టినా, విఫలమయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. వచ్చే ఫలితం ఏదయినా, అది అందరికీ వర్తించేది తప్ప తమ ఒక్కరికే కాదు. తాత్కాలికంగా ఏర్పడే ఇబ్బందులను సమష్టిగానే ఎదుర్కొనాలి, పరస్పరం సహాయం చేసుకుని అధిగమించాలి. లేదా, సమ్మె పొరపాటు అని గట్టిగా నమ్మితే, ప్రభుత్వం కోరిన సమయంలో విధుల్లో చేరి ఉండాలి. అంతే తప్ప, ప్రాణాలు తీసుకోవడం ఏ రకంగానూ పరిష్కారం కాదు. ఉద్యోగాలు, ఉద్యమాలు అన్నిటికంటె ప్రాణం ముఖ్యం. దేన్ని సాధించడానికి అయినా ముందు ఈ దేహం నిలిచి ఉండాలి. పోరాటక్రమంలో, అణచివేతలో గాయపడడమో ఏదో జరిగితే వేరు. అట్లా కాక, భయపెడుతున్న జీవితాన్నుంచి పారిపోవడం తమ సొంత జీవితం విషయంలోను, తమ మీద ఆధారపడ్డ వారి విషయంలో కూడా బాధ్యతారాహిత్యమే. ఆత్మాహుతికి పాల్పడినవారిని తక్కువ చేయడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. తెలంగాణ ఉద్యమకాలంలో కూడా పలువురు రాజకీయనేతలు ప్రజల ఉద్వేగాలతో చెలగాటమాడడం, అందుకు నొచ్చుకుని ప్రాణాలు తీసుకోవడం చూశాము. వారి ప్రాణార్పణం వల్ల, ఉద్యమతీవ్రత వ్యక్తమై ఉండవచ్చు. ఇప్పుడు ఈ ఇద్దరు కార్మికుల బలిదానం సమ్మెలో ఉద్వేగావేశాలను పెంచి ఉండవచ్చును. కానీ, ఎవరూ కోరుకోగూడని ప్రాణత్యాగాలు ఇవి. వారి కుటుంబసభ్యులకైతే అవి పిడుగుపాట్లు.

ఈ ఆందోళన విషయంలో ప్రభుత్వం కటువుగా వ్యవహరించడానికి సహేతుకమైన కారణమేమీ కనిపించడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం విషయంలో సంకోచం ఉంటే, ఇతర డిమాండ్లను సానుకూలంగా పరిశీలించడం ద్వారా దాని పరిష్కారాన్ని వాయిదా వేయవచ్చు. ఏది ఏమయినా, చర్చల ప్రక్రియను అతి శీఘ్రంగా ఉపసంహరించి, ప్రభుత్వం తన కఠిన వైఖరిని ప్రదర్శించాలనుకున్నట్టుంది. ప్రభుత్వ వైఖరి అట్లా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఉద్యమ కారుల పక్షాన చేరడం సహజం. దానితో సమస్యకు రాజకీయకోణం అలవడినట్టు విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు ఆర్టీసీ కార్మికుల పక్షాన సమీకృతం కావడం కేవలం ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. ఇంతకాలం అన్ని రకాల నిర్బంధాలలో మెసలడానికి కూడా వీలుకుదరని స్థితిలో మగ్గిపోయిన వారు, ఈ సమ్మెకు మద్దతునివ్వడం ద్వారా తమ ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మెకు సమర్థన, ప్రభుత్వ వైఖరిపై వ్యతిరేకత సమాజంలో బలపడడానికి కారణాలు పాలకుల వైఖరిలో కనిపించిన ఆభిజాత్యమూ, అప్రజాస్వామిక ధోరణే. అనవసరపు ప్రతిష్ఠా జాలం నుంచి వెలికిరాలేక, అదే మొండివైఖరిని కొనసాగిస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే, రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యులైన తటస్థులు, పెద్దమనుషులు లేకుండా పోయారు. పైగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారి చేత తమకు హెచ్చరికలు పంపుతారా అని కార్మికులు కోపగించుకుంటున్నారు. ప్రభుత్వానికి మనసు మార్చుకోవాలంటే నామోషీ అనిపించినట్టే, కష్టనష్టాలకు ఓర్చి ఇంతకాలం ఉద్యమం చేసిన కార్మికులకు కూడా దిగిరావాలంటే కష్టంగా ఉంటుంది. అది వారి తక్షణ ప్రయోజనాలనే కాక, భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది కదా!

సోమవారం నాడు టిఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, సీనియర్‌ రాజకీయవేత్త కె. కేశవరావు చేసిన ప్రకటనలో చర్చల పునఃప్రారంభానికి సంబంధించిన సంకేతం ధ్వనించింది. కార్మికులు కూడా ఆ అవకాశాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే సహకరిస్తామని కూడా చెప్పారు. కేశవరావు ప్రభుత్వం మనోగతాన్నే సూచించి ఉన్నట్టయితే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత అన్ని పక్షాలపై ఉన్నది. ప్రజారవాణా వ్యవస్థ ఆధునిక సమాజంలో ఒక ప్రాథమిక సదుపాయం. అది ప్రైవేటురంగంలో ఉండడం శ్రేయస్కరం కాదు. లండన్‌, న్యూయార్క్‌ వంటి నగరాలలో కూడా ప్రజారవాణా ప్రభుత్వ, అర్ధ ప్రభుత్వ సంస్థల నిర్వహణలో ఉన్నది. ఆర్టీసీ ఆస్తుల మీద స్వార్థపరుల కన్ను పడిందని, అందుకే, ప్రభుత్వ వైఖరి ఇంత కఠినంగా ఉన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిని పూర్వపక్షం చేయడం పాలకుల బాధ్యత.
Courtesy Andhra Jyothy