– సమావేశమైన ఆర్టీసీ యూనియన్లు, జేఏసీ
– కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ
– జిల్లాల్లో కొనసాగుతున్న దీక్షలు
– రూట్ల ప్రయివేటీకరణపై విచారణ బుధవారానికి వాయిదా
– వేతనాలు, కార్మికుల ఆత్మహత్యలపై వ్యాజ్యాలు

హయత్‌నగర్‌:
ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. కార్మికులతో నేతల సమాలోచనలు..యూనియన్‌ నేతల చర్చోపచర్చల తర్వాత జేఏసీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల కాపీ చదివి చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. యాదగిరిగుట్ట డిపోలో కార్మికుల అభిప్రాయ సేకరణ చేపట్టగా 127 మందికిగానూ 109 మంది సమ్మెకు మద్దతు తెలిపారు. సమ్మె కొనసాగింపుపై చర్చించేందుకుగానూ అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో టీఎమ్‌యూ ముఖ్య కార్యకర్తలు, వీఎస్‌రావు నేతృత్వంలోని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ, రాజిరెడ్డి నేతృత్వంలోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ ముఖ్య కార్యకర్తల సమావేశాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఆయా సమావేశాల్లో కార్మికుల నుంచి వచ్చిన అభిప్రాయం మేరకు సమ్మె యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు జిల్లాల్లో దీక్షలు…ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్‌ యాకూబ్‌ పాషా(52) గుండెపోటుతో చనిపోయాడు. నిజామాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి కార్మికునికీ పది కిలోల బియ్యాన్ని అందజేశారు. 5100 రూట్ల ప్రయివేటీకరణపై మంగళవారం విచారణ జరిగింది. బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. రూట్ల ప్రయివేటీకరణతో పాటు వేతనాలు, కార్మికుల ఆత్మహత్యల ప్రజాప్రయోజన వ్యాజ్యాలు బుధవారం విచారణకు రానున్నాయి.
హైకోర్టు నుంచి తుది తీర్పు కాపీ విడుదల అయ్యాకే జేఏసీ నిర్ణయం మేరకు భవిష్యత్‌ కార్యాచరణ వెల్లడిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరా బాద్‌ మన్సురాబాద్‌ డివిజన్‌ పరిధిలోని హిమగిరి ఫంక్షన్‌హాల్‌లో మొదటగా ఆర్టీసీ కార్మికులతో సమావేశం, తదనంతరం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు, జేఏసీ నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం మీడియాకు అశ్వత్థామరెడ్డి వివరాలు వెల్లడించారు. జేఏసీలో ఉన్న అన్ని యూనియన్‌లతో సంప్రదింపులు జరిపామనీ, కోర్టు నుంచి తుదితీర్పు తర్వాత జేఏసీ తీసుకునే నిర్ణయానికి కార్మికులు కట్టుబడి ఉంటామనీ, అప్పటి వరకూ సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు. కోర్టు తీర్పు తరువాత న్యాయ నిపుణులతో చర్చించి తుదినిర్ణయం తీసుకుంటామనీ, సమ్మెలో చనిపోయిన కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. సమావేశంలో జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నేతలు లింగమూర్తి, నర్సిరెడ్డి, సుధ, బాబు, మారయ్య, భీమారెడ్డి, రాజు, లింగం, శంకర్‌, వెంకట్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Courtesy NavaTelangana..