– రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెకు తగ్గని మద్దతు

ఆర్టీసీ సమ్మెలో భాగంగా 20వ రోజైన గురువారం మహిళా కార్మికులు దీక్షలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వారికి అన్ని ప్రజాసంఘాలు, పార్టీలు, విద్యార్థి సంఘాల నుంచి మద్దతు లభించింది. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నార్కట్‌పల్లిలో చేపట్టిన దీక్షలకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఖమ్మంలో మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు బత్తుల హైమావతి దీక్ష ప్రారంభించి మాట్లాడారు. ఎఫ్‌సీఐ హమాలీ కార్మికులు ఖమ్మంలో పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి భారీ ప్రదర్శనగా బస్‌ డిపో వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి చేరుకున్నారు. మహబూబాబాద్‌లోని దీక్షలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్‌, పోతినేని సుదర్శన్‌, సీపీఐ రాష్ట్ర నాయకులు భాగం హనుమంతరావు, న్యూడెమోస్రీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్‌లు సందర్శించి సంఘీభావం తెలిపారు. తొర్రూరులో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య సంఘీభావం తెలిపారు. హన్మకొండలో డిపో వద్ద చేపట్టిన దీక్షా శిబిరాన్ని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రత్నమాల తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీని ప్రయివేటీకరించడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మౌన దీక్ష చేపట్టగా సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతపాలన సాగిస్తున్నారన్నారు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళా కండక్టర్‌ సోఫియాను ఆయన పరామర్శించారు. సిద్దిపేటలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు.
కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు హాజరై మద్దతు తెలిపారు. కార్మికులకు చెందిన రూ.845 కోట్ల ప్రావిడెంట్‌ ఫండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందనీ, వెంటనే పీఎఫ్‌ను కార్మికులకు చెల్లించాలనీ డిమాండ్‌ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న దీక్షాస్థలిని అప్పగించాలని మంచిర్యాల కార్మికులు రామగుండం సీపీ సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. ఆదిలాబాద్‌లో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌ శిబిరానికి వచ్చి దీక్షలకు మద్దతు తెలిపారు. నిర్మల్‌, భైంసాలో టీజేఎస్‌ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కార్మికులకు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మహిళా సంఘాలు, మహిళా కండక్టర్లు దీక్షలో కూర్చున్నారు. పెద్దపల్లి జిల్లా యైటింక్లైన్‌ కాలనీ సంతలో కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని భిక్షాటన చేశారు.

పాసులు అనుమతించాలని బైటాయించిన విద్యార్థులు
యాదాద్రి జిల్లా మోటకొండూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మోత్కూర్‌లో ఆర్టీసీ బస్సులో విద్యార్థుల పాసులను అనుమతించాలని కొండగడప విద్యార్థులు గ్రామంలో బస్సును అడ్డుకొని బైటాయించారు. పాసులు అనుమతి స్తామని తాత్కాలిక కండక్టర్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రతీ గ్రామానికి బస్సు కేటాయించాలనీ, బకాయిలు చెల్లించాలనీ, ఆర్టీసీ సంస్థను పరిరక్షించాలనీ ఖమ్మంలో ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఖమ్మం బస్‌ డిపో వద్ద విద్యార్థినుల జాతకాలు చెబుతూ ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు.

Courtesy Nava Telangana