• సర్కారులో ఆర్టీసీ విలీనం హామీ పార్టీ ఎక్కడా ఇవ్వలేదు
  • కార్మికుల మిగతా డిమాండ్లపై చర్చకు ఓకే.. కేశవరావు ఆఫర్‌
హైదరాబాద్‌: తన హెచ్చరికలను కాదని సమ్మెను కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులపై దాదాపుగా యుద్ధం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు స్వయంగా కార్మికులను చర్చలకు ఆహ్వానించారు. ముందు సమ్మె విరమించి, చర్చలకు రావాలంటూ పిలుపునివ్వడం ద్వారా ప్రతిష్ఠంభన నుంచి బయటపడేందుకు ఇరు వర్గాలకు మార్గం సుగమం చేశారు. పరిస్థితులు చేయి దాటకముందే మేలుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వం వహిస్తారా? అని అడగ్గా, ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. తాను ఒక ప్రతిపాదన చేశానని, వారు స్పందించే తీరును బట్టి తమ ప్రతిస్పందన ఉంటుందని చెప్పారు. కేసీఆర్‌ తమ నాయకుడని, ఆయన చెప్పినట్లే పార్టీలో జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలోనూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేసీఆర్‌ గొప్పగా పరిష్కరించారని ప్రస్తావించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేయడమంటే విధానాన్ని మార్చుకోవాలని కోరడమే అవుతుందని చెప్పారు.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలా? వద్దా? అనేది యూనియన్లకు సంబంధం లేని విషయమని కేకే స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని, ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారాన్ని చూపలేవని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనడం తప్ప కార్మికులు లేవనెత్తిన డిమాండ్లన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే తేల్చి చెప్పారని, అందుకు ఆయనను అభినందిస్తున్నానని అన్నారు. అద్దె బస్సులు, ప్రైవేటు స్టేజి క్యారేజీల విషయంలో సీఎం చేసిన ప్రకటనను సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగానే చూడాలని సూచించారు. ముందస్తు ఎన్నికల కమిటీ చైర్మన్‌గా తానే ఉన్నానని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ప్రతిపాదన ఏదీ మేనిఫెస్టోలో లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్‌ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. ఆర్టీసీపై విపక్షం శవ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
 
కేకే పిలిస్తే చర్చలకు వెళతా: అశ్వత్థామ
టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత కేశవరావు అంటే తమకు గౌరవం ఉందని, ఆయన చర్చలకు ఆహ్వానిస్తే తప్పకుండా వెళతానని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో కలిసి ఆర్టీసీ కార్మికులు పని చేశారని గుర్తు చేశారు. అదే సమయంలో ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని ప్రకటించారు. కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి ఆర్టీసీని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. గవర్నర్‌కు అన్ని విషయాలు వివరించామని, ప్రభుత్వంతో మాట్లాడతానంటూ ఆమె హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగి వచ్చి ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. మంత్రుల వ్యాఖ్యలు కార్మికులను భయాందోళనకు గురిచేసే విధంగా ఉన్నాయని చెప్పారు. వెంటనే ఆ వ్యాఖ్యలను మంత్రులు ఉపసంహరించుకోవాలన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు రెండు నాలుకలతో మాట్లాడుతున్నారని, అధికారంలో లేనపుడు కార్మికులకు మద్దతుగా మాట్లాడిన ఆయన మంత్రి అయ్యాక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు.
Courtesy Andhra Jyothy