• అత్తెసరు వేతనాలతో ఆర్టీసీ కార్మికులు సతమతం

హైదరాబాద్‌: కొత్తగా ఉద్యోగంలో చేరిన కండక్టర్‌కు డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకోగా వచ్చే మొత్తం వేతనం రూ.20వేలు. 30 ఏళ్ల సర్వీసు తర్వాత వచ్చే వేతనం రూ.35 వేలు. శ్రామిక్‌, మెకానిక్‌, డ్రైవర్లు.. వీరందరిదీ ఇదే పరిస్థితి. ఒక్కో ఆర్టీసీ కార్మికుడికి రూ.50 వేల వేతనం వస్తుందంటూ ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ వాస్తవ పరిస్థితి అలా లేదు. అన్ని కటింగ్‌లు పోనూ కార్మికుడి చేతికొచ్చేది రూ.20-25 వేలకు మించడంలేదు.

ఆర్టీసీ కార్మికులకు అందేవి చాలీ చాలని వేతనాలే. ఎప్పుడూ సంతృప్తికరంగా వేతనాలు పెరగలేదు. ముఖ్యంగా శ్రామిక్‌, మెకానిక్‌, కండక్టర్‌, డ్రైవర్‌ వర్గాలే క్షేత్ర స్థాయిలో ఎక్కువగా కష్టపడతాయి. వీరి వేతనాలు తక్కువగానే ఉంటున్నాయి.

ఉన్నతాధికారులకు రూ.లక్షల్లో వేతనాలు అందుతుంటే.. కార్మిక వర్గానికి మాత్రం తక్కువ వేతనాలు అందుతున్నాయి. 2015లో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 44ు ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. దీంతో కొంత మేర వేతనాలు మెరుగుపడ్డాయి. అయినా, ప్రభుత్వ ఉద్యోగుల కంటే 18ు తక్కువ వేతనాలున్నాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకూ వేతనాలు అందించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కటింగ్‌లే ఎక్కువ..
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో పీఎఫ్‌ కట్‌ అవుతుంటుంది. కానీ, ఆర్టీసీ కార్మికుల వేతనాల్లో కటింగ్‌లు ఎక్కువ. నెలవారి వేతనంలో 12 శాతం పీఎఫ్‌ కట్‌ అవుతుంది. కార్మికులు ఏర్పాటు చేసుకున్న క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ(సీసీఎ్‌స)కి మరో 7 శాతం సొమ్ము వెళుతుంది. పదవీ విరమణ తర్వాత నామమాత్రపు పెన్షన్‌ కోసం ఏర్పాటు చేసుకున్న ‘స్టాఫ్‌ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌(ఎ్‌సఆర్‌బీఎస్‌)’ కోసం మరో రూ.250 చొప్పున కట్‌ చేస్తారు. కార్మికులు చనిపోతే… రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించడం కోసం ఏర్పాటు చేసుకున్న ‘స్టాఫ్‌ బెన్వొలెంట్‌ కమ్‌ థ్రిఫ్ట్‌’ ఫండ్‌ కింద ప్రతి నెలా రూ.100 చొప్పున కట్‌ చేస్తారు. ఇలా కటింగ్‌లు ఎక్కువగా ఉండడంతో రూ.35 వేల వేతనం ఉన్న కార్మికుడికి సైతం రూ.20-25 వేల వరకే నగదు చేతికందుతోంది. ఈ వేతనంతోనే ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు చెల్లించాలి. కుటుంబ పోషణకు మిగుల్చుకోవాలి. అందుకే కార్మికులు భగ్గుమంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని అక్కడి సర్కారు ప్రకటించింది. ఇప్పటికే విలీన ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో అక్కడి కార్మికులకు వేతనాలు పెరుగుతాయి. ఒక్కో కార్మికుడికి ఎంత లేదన్నా… రూ.10-12 వేల వరకు పెరిగే అవకాశాలున్నాయని ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఏపీ రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌ తెలిపారు. దీంతో ఇక్కడ కూడా ఆర్టీసీని విలీనం చేయాలంటూ కార్మిక వర్గం డిమాండ్‌ చేస్తోంది. క్షేత్ర స్థాయిలో పని చేసే కండక్టర్‌, డ్రైవర్‌, శ్రామిక్‌, మెకానిక్‌లకు వేతనాలు పెంచితే తప్పేమీ లేదన్న అభిప్రాయాలున్నాయి. ఆర్టీసీకి ఆదాయం తెచ్చేది కండక్టర్‌, డ్రైవర్లే. రోజూ కాలుష్యం మధ్య పని చేసేది శ్రామిక్‌లు, మెకానిక్‌లు, హెల్పర్లు, వల్కనైజర్లే. ఇలాంటి సిబ్బందికి వేతనాలు పెంచకుండా అధికారులకేమో రూ.లక్షల్లో చెల్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

మా పొట్ట కొట్టి సీఎం సాధించేదేమిటి ?
వేతనాలను పెంచాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్లతో సమ్మెకు దిగితే మా ఉద్యోగాలను ఊడగొట్టామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇదే కేసీఆర్‌ కోసం తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నిలిచాం. మా పొట్ట కొట్టి ఆయన సాధించేదేమైనా ఉంటుందా? ఒక్కో కార్మికుడికి రూ.50 వేల వేతనం ఉందంటున్నాడు. 2007లో కండక్టర్‌గా జాయిన్‌ అయిన నాకు ఇప్పుడు రూ.26,340 వస్తోంది. చేతికందేది 8000 మాత్రమే.
– చైతన్య, కండక్టర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ డిపో

చేతికందే వేతనం 14,500
ఆర్టీసీలో నాకు 25 ఏళ్ల సర్వీసు ఉంది. ఇప్పుడు రూ.30 వేల వరకు వేతనం వస్తోంది. కానీ, చేతికందేది రూ.14,500. ఇంత తక్కువ వేతనంతోనే సరూర్‌నగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని, పిల్లలను చదివించుకుంటూ అష్టకష్టాలు పడుతున్నాం. అయినా మా గోడు పట్టించుకోకుండా సమ్మెపై ప్రభుత్వం కర్కశంగా ప్రవరిస్తోంది. మేమూ తెలంగాణ బిడ్డలమే. మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఎమ్మెల్యేలు, మంత్రులు, పాలకవర్గాలే తెలంగాణ బిడ్డలా?
– నయీం, డ్రైవర్‌, మిథానీ డిపో

Courtesy Andhra Jyothy