విధుల్లో చేరతామని కన్నీరు పెట్టుకున్న మహిళా కండక్టర్లు
పలు జిల్లాల్లో కార్మికులు-పోలీసుల మధ్య వాగ్వివాదం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం

సుదీర్ఘ సమ్మె అనంతరం విధుల్లోకి చేరేందుకు ఆర్టీసీ కార్మికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాల ఐకాస నేతల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం డిపోల వద్దకు చేరిన కార్మికులకు చేదు అనుభవం ఎదురైంది. తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ అంగీకార పత్రాలిచ్చినా అధికారులు అంగీకరించలేదు. తమను కొలువుల్లోకి అనుమతించాలని మహిళా కార్మికులు అధికారులను వేడుకోవటం.. కంట నీరు పెట్టుకోవడం పలువురిని కలచివేసింది. రాష్ట్రంలోని ఆయా డిపోల వద్ద కార్మికులను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేశారు. మంగళవారం ఉదయం షిఫ్టు సమయానికి కార్మికులు డిపోల వద్దకు చేరుకోగా.. లోపలకు ప్రయత్నించేందుకు వీల్లేకుండా కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో తోపులాటలు జరిగాయి. విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. కొన్ని జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి కార్మిక నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ మంగళవారం 6475 బస్సులను నడిపినట్లు పేర్కొంది. ఇందులో ఆర్టీసీ బస్సులు 4580 కాగా, ప్రైవేటు బస్సులు 1895 ఉన్నాయని ఓ ప్రకటనలో వెల్లడించింది.

గ్రేటర్‌ జోన్‌లో 2449 మంది అరెస్టు
హైదరాబాద్‌లోని పలు డిపోల వద్ద మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చినవారిని వచ్చినట్లే వాహనాల్లో కుక్కారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2449 మందిని అరెస్టు చేసినట్టు ఆయా పోలీసు కమిషనరేట్లు ప్రకటించాయి. వేకువజామునే డిపోలకు వెళ్తే తాము లోపలకు వెళ్లవచ్చునేమో అని కార్మికులు భావించారు. వీరికంటే ముందే అక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందికి పోలీసులు రక్షణగా నిలిచి.. బస్సులను భద్రంగా పంపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ల నుంచి అనుమతి ఉన్నట్లు చిట్టీలు చూపిస్తేనే తాత్కాలిక సిబ్బందిని డిపోలకు అనుమతించారు.

కన్నీరు మున్నీరైన కార్మికులు
రాష్ట్రంలో ఆర్టీసీ డిపోల వద్ద తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ కార్మికులు కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేస్తున్న సమయంలో మహిళా కార్మికులు రోదిస్తూ అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. వరంగల్‌ రీజియన్‌ ప్రాంతంలోని 9 డిపోల వద్దకు ఆర్టీసీ కార్మికులు చేరుకోగా వారిని పోలీసులు నిలువరించారు. వరంగల్‌, హన్మకొండ నగరాల్లోని మూడు డిపోల ఎదుట కార్మికులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో కొందరు మహిళా కండక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు కంట తడిపెట్టారు. నిజామాబాద్‌ ఆర్టీసీ డిపో-1 వద్దకు విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు డిపో మేనేజర్‌ ఆనంద్‌కు వినతి పత్రాలు ఇవ్వబోగా ఆయన తిరస్కరించారు. కొందరు కార్మికులు అధికారి కాళ్లు మొక్కారు. రోదిస్తూ వేడుకున్నారు. ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిపోల వద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. నాగర్‌కర్నూల్‌లో పోలీసులకు కార్మికుల మధ్య తోపులాట జరిగింది. మంచిర్యాలలో కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవటంతో ఓ కార్మికుడికి ఛాతీ నొప్పి రావటంతో ఆస్పత్రికి తరలించారు. విధుల్లోకి తీసుకోవాలని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ డిపోల వద్ద మహిళలు కన్నీరుపెట్టుకున్నారు.

పోలీసులను పరుగులు పెట్టించి…
ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు మంగళవారం విధుల్లోకి చేరడానికి సమాయత్తమైన కార్మికులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్‌ కళాశాల మైదానంలో కార్మికులు సమావేశమయ్యారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అక్కడ జరుగుతున్న యోగా తరగతిలో కార్మికులు ఉన్నారని తెలుసుకుని ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. ఇదే సమయంలో యోగా తరగతిలో ఉన్న మహిళా కార్మికులు అక్కడినుంచి పరుగులుతీశారు. చిట్టెమ్మ అనే కార్మికురాలు నడిరోడ్డుపై పరిగెత్తుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించింది. చివరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.మహబూబ్‌నగర్‌
కనికరం చూపాలంటూ కాళ్లావేళ్లా!
తనను విధుల్లోకి తీసుకోవాలని..ముందుగా అధికారులను కలిసేందుకు అనుమతించాలని ఆర్టీసీ కార్మికుడు పోలీసుల కాళ్లా వేళ్లా పడి ప్రాధేయపడిన ఘటన అక్కడి వారిని కలచివేసింది. మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ వద్ద కంటోన్మెంట్‌ డిపో డ్రైవర్‌ నగేష్‌ పటేల్‌ తనను ఆర్టీసీ అధికారుల వద్దకు అనుమతించాలని,  ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తానని.. అక్కడ ఉన్న పోలీసుల కాళ్లకు నమస్కరించాడు. 23 సంవత్సరాలుగా సంస్థలో పనిచేస్తున్నానని..జీతం రాకపోవడంతో భార్య మెడలోని బంగారు గొలుసును తాకట్టుపెట్టి కాలం వెళ్లదీస్తున్నానని పేర్కొన్నాడు. ఇక్కడ ఎవరూ నిరసన తెలపవద్దంటూ అతనితోపాటు మరికొందరు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌
ఆర్టీసీలో సమ్మెతో నష్టపోయాం.. కష్టాల్లో ఉన్నాం.. ఇక మీదట మేము సమ్మెలే కాదు.. ఎలాంటి కోరికలు కోరం.. మమ్మల్ని మన్నించి ఒక్కసారి అవకాశం ఇస్తే.. మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం’’
నిజామాబాద్‌ ఆర్టీసీ డిపో వద్ద మహిళా కండక్టర్ల కన్నీటి వేడుకోలు
అర్ధాకలితో అలమటిస్తున్నాం
విధుల్లోకి చేరాలని వచ్చినా అనుమతించక పోవడంతో వరంగల్‌-1 డిపో వద్ద మహిళా కండక్టర్లు నిరాశకు గురయ్యారు. మూడు నెలలుగా వేతనాలు లేక ఇంటి అద్దె, పిల్లల పాఠశాల రుసుములు చెల్లించలేక అర్ధాకలితో అలమటిస్తున్నామని భోరున విలపించారు.

Courtesy Eenadu..