హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తామని హెచ్చరించారు. ప్రెస్ క్లబ్‌లో జరిగిన అఖిలపక్షం సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలన్నీ ఎంతో పోరాటం చేశాయని.. ఆ స్ఫూర్తితోనే తాము ఇప్పుడు ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె చేస్తున్నామన్నారు. ఉద్యోగ సంఘాలను ఏమైనా నొప్పించినట్టు మాట్లాడితే క్షమించి… తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో అఖిలపక్షం, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

Courtesy Andhrajyothi…