Image result for పాలకుల బుట్టలో ఆర్టీసీ కార్మికులు!"రంగనాయకమ్మ

మీరు, ఆ భోజనాలకు వెళ్ళడం ఎంత తప్పు! ఈ పాలకుడు, గత 6 సంవత్సరాల నించీ పాలిస్తూనే వున్నాడు. అన్ని సమస్యలు ఎలా వచ్చాయి మీకు? మీ సమస్యల్ని ఏ నాడైనా అర్థం చేసుకున్నాడా? ఆరేళ్ళ తర్వాత ఇప్పుడా మీ సమస్యలు తీరుస్తాననే వాగ్దానం? మీరు సమస్యల పత్రం ఇచ్చిన వెంటనే దాన్ని పాలకుడు ఎందుకు పట్టించుకోలేదు?

ఆర్టిసీ కార్మికులే కాదు, ఏ శాఖలో కార్మికులైనా, పాలకుల బుట్టల్లో ఇప్పుడు కొత్తగా పడిందేమీ లేదు; ఎప్పటి నించో ఆ బుట్టల్లోనే వున్నారు.!

ఆ బుట్టలు మాత్రం ఎన్నాళ్ళు విచ్చిపోకుండా ఉండి పోతాయి? బుట్టల్లో వాళ్ళు రేపో మాపో బైట పడకుండా వుండి పోరు లెండి. అది ఎప్పటికీ జరగదనుకుంటే, బానిస మనుషుల్ని సంతల్లో అమ్మే-కొనే యజమానుల వ్యాపారాలు ఈ నాటికీ నిలిచి పోయి, జరుగుతూనే వుండేవి కదా?

వెనకటి కాలంలో బానిసలు ఎంతెంత పోరాటాలు చేసి బానిసత్వాన్ని వదిలించుకున్నా, ఆ పోరాటాలు తమకు జరిగే ‘శ్రమ దోపిడీ’ని వదిలించు కోవాలని తెలిసి కాదు. ఈనాటి కార్మికులు కూడా శ్రమ దోపిడీ సంగతి తెలియకే పరిపాలకులతో విందు భోజనాల్నీ, కరచాలనాల్నీ తమ అదృష్టాలుగా భావిస్తున్నారు!

ఆర్టీసీ కార్మికులు, తమ సమస్యల్ని పాలక యజమాని ముందు మొదట వినయంగానే పెట్టారు. కానీ, ఆ పరి పాలకుడు ఆ సమస్యల వేపు కన్నెత్తి చూడ లేదు. దానికే భయపడిన కార్మికులు కొందరు ప్రాణాలే పోగొట్టు కున్నారు. అయినా, పాలకుడి గుండెలు చలించ లేదు. పైగా అతని లక్ష్యం, కార్మికుల్ని రక రకాలుగా బెదిరించడాలుగానే సాగింది.

‘కార్మికులు’ అంటే, రక రకాల శ్రమలు, రాత్రింబవళ్ళూ చేసే వారే. తమ శ్రమ ఫలితాలు, తమ కోసం మాత్రమే కాదనీ, పాలక వర్గాల కుటుంబాల కోసం కూడా అనీ, ఈనాటి కార్మికులకైనా తెలుసా?

ఆర్టీసీ కార్మికులు, కార్మిక వర్గ సిద్ధాంత కర్తలైన మార్క్సు-, ఎంగెల్సుల పేర్లు విని వుండరా? ఆ పేర్లు ఎందుకు వినాలో తెలిసి వుండరా? నిన్నటి దాకా విని వుండకపోయినా, నేటి నించైనా ఆ పేర్లు విని వుంటే, కార్మికులు అసలు తమ శ్రమలు, తమ కోసమే కాదనీ, యజమానుల కోసం చెయ్యడమే అసలైన నిజం అనీ, తెలుసు కుంటారు.

శ్రమలు చేసే వాళ్ళు రెండు రకాల వాళ్ళు. ఎవరి స్వంతం కోసం వాళ్ళు చేసుకుంటే, అది మొదటి రకం. అది సహజత్వం. తమ కోసమేగాక, ప్రధానంగా యజమానుల కోసమే శ్రమలు చెయ్యడం, రెండో రకం. ‘శ్రామికులు’ అంటే, వాళ్ళు ఏ రకమో తెలియదు కాబట్టే, యజమానుల కింద శ్రమలు చేసే వారికి ‘కార్మికులు’ అని ప్రత్యేకమైన పేరు అవసరం. కార్మికులకు అందేవి ‘జీతాలు’. ఆ జీతాలతో వాళ్ళు కడుపు నిండా తిన లేరని మన పరి పాలకుడికి తెలిసినట్టే వుంది. కార్మికులకు ఒక పూట తిండి పెట్టి, ‘కడుపు నిండా తినండి!’ అనడం అంటే, ఏమిటి అర్థం?

రోజూ కడుపు నిండా తిండి లేని కార్మికులకు మన పరి పాలకుడు చెప్పేదేమిటంటే, ‘మీరు కార్మి కులు కారు; ఉద్యోగులు’ అని! ఒక బస్సు డ్రైవర్ని, ‘కార్మికుడు’ అన్నా, అతను బస్సుని నడిపే వాడే; ‘ఉద్యోగి’ అన్నా అతడు బస్సుని నడిపే వాడే. ఏ ‘ఉద్యోగి’ అయినా ఏదో ఒక శ్రమ చేసే వాడే.

పాలకుడు, ‘మీరు ఉద్యోగులు’ అన్నప్పుడు, కార్మికులు లేచి, ‘ఉద్యోగి’ పేరు వల్ల, డ్రైవర్‌కి ఆ శ్రమ మారుతుందా? క్లీనర్‌కి ఆ శ్రమ మారుతుందా?’’ అని అడగలేదు. పేర్లు మార్చినంత మాత్రాన శ్రమ సంబంధాలు మారతాయా?

యజమాని ఆగ్న్యెల క్రింద ఏ శ్రమ చేసే వాళ్ళయినా కార్మికులే. ‘కార్మికులు’ అనే పేరుని, యజమాని ‘ఉద్యోగులు’ అని మార్చడం, కార్మికుల్ని దగా చెయ్యడం! పాకీ పని చేసే కార్మికుణ్ణి, ‘ఉద్యోగి’గా అన్నా, అతను చేసేది పాకీ పెంటలు ఎత్తే పనే కదా? ‘ఉద్యోగి’ అనగానే అతని పని రకం మారుతుందా? – ఇంత చిన్న ప్రశ్న వెయ్యలేక పోయారా మీరు?

ఆర్టీసీ కార్మికులూ! మొదట మీరు మీ సమస్యల్ని మీ పాలకుడికి చెప్పుకున్నారు. వాటిని అతడు చెవిన పెట్ట లేదని, మీ పనులు ఆపుకున్నారు. అవును, శ్రమలు చెయ్యాలో, మానాలో, శ్రమలు చేసే వాళ్ళ ఇష్టం. ఆ ఇష్టం, సరదా కోసం ఏర్పడదు. అది, ‘అవసరాల్ని’ బట్టి ఏర్పడుతుంది. శ్రమలు చెయ్య లేని పరి’స్థితుల వల్లనే మీరు పనులు ఆపుకున్నారు. అది ‘మానుకోవడం’ కాదు; యజమానికి అర్థం కావడానికి చేసే ఇంకో ప్రయత్నం. అప్పటికీ ఫలితం లేక, మీ ఆగ్రహాన్ని మీరు అణుచుకుని, శ్రమల్లోకి దిగడానికి అంగీకరించారు.

కార్మికుల్ని అలా అణచడంలో కూడా మీ పాలకుడికి సంతృప్తి కలగ లేదు. ఇంకా ఇంకా బెదిరింపులు చేసి, అప్పటికి ఎంతో దయ దల్చినట్టు, ఒక పూట భోజనాలకు ఆహ్వానం! కడుపు నిండా తినమని! మీకు కడుపు నిండా ఎప్పుడూ దొరకదని పాలకుడికి తెలుసు.

మీరు, ఆ భోజనాలకు వెళ్ళడం ఎంత తప్పు! ఈ పాలకుడు, గత 6 సంవత్సరాల నించీ పాలిస్తూనే వున్నాడు. అన్ని సమస్యలు ఎలా వచ్చాయి మీకు? మీ సమస్యల్ని ఏ నాడైనా అర్థం చేసుకున్నాడా? ఆరేళ్ళ తర్వాత ఇప్పుడా మీ సమస్యలు తీరుస్తాననే వాగ్దానం? మీరు సమస్యల పత్రం ఇచ్చిన వెంటనే దాన్ని పాలకుడు ఎందుకు పట్టించుకోలేదు?

మీ సమ్మెని మీరు ఆపుకుంటే, దాన్ని మీ ఓటమి లాగ భావించి, పాలకుడు మీ మీద ప్రేమ జల్లులు కురిపించడం మొదలు పెట్టాడు.

యూనియన్‌ని పెట్టుకోవద్దన్నాడు. కార్మికులు, తమ సమస్యల గురించి చర్చించుకోడానికి ఒక సంఘం పెట్టుకుంటే, అది యజమానికి నష్టం. అది కార్మికులకు బలం! ఆ బలం, కార్మికులకు రాకుండా చెయ్యాలనేది, పాలకుడి దృష్టి.

అప్పుడైనా, ‘‘మా సంఘం, మా చర్చల కోసం. దాన్ని మీరు వ్యతిరేకించడం ఎందుకు?’’ అని ఎందుకు అనలేక పోయారు మీరు? పాలకుణ్ణి ప్రశ్న అడగ లేకపోతే, అక్కడికి వెళ్ళనే కూడదు కదా?

మీ సమస్యల కోసం, మీ యజమానే కమిటీలు పెడతాడా? ఆ కమిటీ సభ్యులు, కార్మికుల సమస్యల్ని చర్చించే వారే అయితే, ఆ కమిటీయే ‘కార్మిక సంఘం’ అవదా? ‘‘మా సంఘాన్ని మేమే పెట్టుకోగలం’’ అని మీరు చెప్పాలి. పనులు చెయ్యడమే గానీ, నోరు తెరవడం తెలియక పోతే, పనులన్నీ వదిలేసి, అడవుల్లోకి పోయి ఆకులో, అలములో తింటూ బతకడం మంచిది.

కార్మికులు, తమకి తాము అవమానాలు చేసుకునే పని ఏమిటంటే, పాలకుడికి పాలతో సత్కారం చేయడం! నాలుగు బకెట్ల పాలతో పాలకుడికి ప్రతి పూటా స్నానాలు చేయిస్తే, అది ఇంకా గొప్ప సత్కారం కదా? పాలతో స్నానం జరిగిన తర్వాత, చెంబెడు నీళ్ళని అయినా ఉపయోగించకూడదు. ఇక నించీ, పాల స్నానాలు చేయించండి!

రక రకాల శ్రమలు చేసే మీరు కార్మికులు. మీ శ్రమ ఫలితం అంతా మీకు జీతంగా రాదు. అయినా, వచ్చే జీతం తోనే సంతృప్తి పడతారు మీరు. మీకూ, మీ యజమానికీ, అంతే సంబంధం.

మీ సమస్య లెన్నో చెప్పుకున్నా, ఎందరో ఆత్మహత్యలతో ప్రాణాలు వదిలినా, చలించని పాలకుడు భోజనానికి పిలిస్తే వెళ్ళడమా? పాలకుడి ముందుకు వెళ్ళ వలిసింది చర్చలకు మాత్రమే. భోజనాలకు కాదు.

50 వేల మంది ఆర్టీసీ కార్మికుల్నే కాదు; ఇతర శాఖల్లో కూడా లక్షలాది కార్మికుల్ని నడిపే హక్కు, పాలకులదా? పాలకులు ఆ పదవుల్లోకి వచ్చింది, ప్రజల ఓట్లతో. వాళ్ళని ప్రజలే నిలబెట్టారు. పాలకులు తినేది, ప్రజల శ్రమలతో. అంతేగానీ, మీ కోసం వాళ్ళ నించి వచ్చేది ఏమీ వుండదు.

కడుపు నిండా తిండి దొరికినా, అదే ఆత్మ గౌరవం కాదు. బానిసత్వం లేకుండా ఐక్యతతో జీవించడమే ఆత్మ గౌరవం!

ఆర్టీసీ కార్మికులూ! మీ సంఘం మీరే నడుపుకోండి. అది మీ హక్కు! అది మీకు అవసరం! ప్రభుత్వ పాలకులు చేసే పనులు ఎన్ని వున్నా, అవి కార్మిక శ్రమలు కావు. అది తెలుసుకుంటే, మీరు ధైర్యస్తులవుతారు. పాలకుల్ని ప్రశ్నించ గలవారు అవుతారు.

‘‘మీకు అది ఇస్తా, ఇది ఇస్తా. సంవత్సరానికి లక్ష బోనస్‌ ఇస్తా’’ అన్నప్పుడు, మీరు చప్పట్లు కొడతారా?

‘‘బోనస్‌ అనేది మా శ్రమ విలువలో భాగమే. మా శ్రమ కాకపోతే, ఆ లక్ష ఎవరి శ్రమలో నించి వస్తుంది?’’ అని మీరు ప్రశ్నించ వద్దా?

ప్రపంచ వ్యాప్తంగా, కార్మిక వర్గం, పాలకుల ద్వారా అవమానాల తోటే గడుపుతోంది. అలాంటి అవమానాలు రాకుండా వుండాలంటే, సమ్మెల గురించి మార్క్సు అన్న మాటలు చూడండి. ‘‘పెట్టుబడితో తమ అనుదిన ఘర్షణలో, కార్మికులు పిరికి వారై, వెనుకంజ వేసినట్టయితే, అంతకన్నా పెద్ద ఉద్యమాన్ని దేన్నీ ప్రారంభించే అర్హతను తప్పని సరిగా కోల్పోతారు.’’

(Courtesy Andhrajyothi)