– కామారెడ్డి డీఎమ్‌ ఓవర్‌యాక్షన్‌
– భగ్గుమన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు

హైదరాబాద్‌బ్యూరో : టీఎస్‌ఆర్టీసీలో కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పెరిగిన పనిభారాలు ఆరోగ్యాలను హరిస్తున్నాయి. సిబ్బంది అదనంగా ఉన్నారంటూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వారికి సంబంధించిన విధులు కాకుండా, ఇతరత్రా పనుల్ని అప్పగిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కార్మికులు వాటిని నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాలు వదులుకోలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన మానసిక వేదనలో అల్లాడుతున్నారు. తాజాగా కామారెడ్డి డిపోలో స్కావెంజర్‌ పనులు చేసేందుకు ఆర్టీసీ డ్రైవర్లు దరఖాస్తులు చేసుకోవాలంటూ అక్కడి డిపో మేనేజర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ ప్రకటనలో స్వీపర్‌, అటెండర్‌ పోస్ట్‌ అని రాసినప్పటికీ, నిర్వర్తించాల్సిన విధుల్లో రోజూ మరుగుదొడ్లు శుభ్రం చేయాలనీ, గిన్నెలు కడిగి, బయటినుంచి కాఫీ, టీలు తీసుకురావాలనీ, ఆఫీస్‌ అంతా ఊడ్చాలనీ, ఆఫీస్‌ పని మీద బయటి కార్యాలయాలకు వెళ్లి ఆయా సెక్షన్ల రికార్డులు అందించాలనీ, డిపో మేనేజర్‌, సూపర్‌వైజర్‌, సిబ్బంది చెప్పిన పనులు చేయాలనీ పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీన డిపో మేనేజర్‌ ఈ ప్రకటన ఇచ్చారు. దీన్ని చదివిన ఆర్టీసీ కార్మికులు ముఖ్యంగా డ్రైవర్లు తమ దీనస్థితిని తలుచుకొని దిగులుపడటం మినహా ఏమీ చేయలేని నిస్సహాయులుగా ఉండిపోయారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు అదనంగా ఉన్నారంటూ…వారితో బస్సులు శుభ్రం చేయిస్తూ, డిపోలు ఊడిపిస్తున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు స్కావెంజర్‌ పనులు కూడా చేయాలంటూ ప్రకటన చేయడం విచారకరం. వాస్తవానికి సదరు డిపో మేనేజర్‌ ఇచ్చిన ప్రకటన మూడు రకాల విధులకు సంబంధించింది. కానీ ఒకే వ్యక్తి ఆ పనులన్నీ చేయాలంటూ ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం డిపోలో డ్రైవర్లు అదనంగా ఉన్నారనే కారణంతో ఈ తరహా ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో బస్సుల సంఖ్యను కుదించారు. కరోనా నేపథ్యంలో ఉన్న బస్సులు కూడా పూర్తి స్థాయిలో రోడ్డు ఎక్కట్లేదు. స్వీపర్‌, అటెండర్‌, రికార్డు ట్రేసర్‌ ఉద్యోగాలు, వాటి విధులు వేర్వేరుగా ఉంటాయి. అలాగే మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు టెండర్లు పిలిచి స్కావెం జర్లను నియమించుకుంటారు. కానీ కేవలం డ్రైవర్లు అదనంగా ఉన్నారనే ఏకైక కారణంతో వారి ఆత్మాభి మానం దెబ్బతినేలా ఇలాంటి ప్రకట న ఇవ్వడాన్ని ఆర్టీసీ కార్మిక సంఘా లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అతితెలివి.. : కె రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌
టీఎస్‌ఆర్టీసీ కామారెడ్డి డిపో మేనేజర్‌ అతితెలివి ప్రదర్శించారు. మూడురకాల వేర్వేరు విధులు నిర్వహించేందుకు కేవలం డ్రైవర్లు అదనంగా ఉన్నారనే కారణంతో ఒకరితోనే అన్ని పనులు చేయించుకొనేలా ప్రకటన ఇచ్చారు. ఇది ఆర్టీసీ డ్రైవర్ల ఆత్మాభిమానాన్ని కించపరిచే చర్య. బస్సుల సంఖ్యను తగ్గించి, సిబ్బంది అదనంగా ఉన్నారనే సాకుతో సంబంధంలేని పనుల్ని వారితో చేయిస్తున్నారు. ఇప్పుడు స్కావెంజర్‌ పనిని కూడా వారినే చేయమంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తున్నాము.

Courtesy Nava Telangana