• అడుగడుగునా పోలీసు నిర్బంధం నడుమ ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి అంతిమయాత్ర
  • సంప్రదాయ పద్ధతిలో చేయలేకపోయాం
  • కుటుంబసభ్యులు, బంధువుల ఆవేదన
  • కడసారి చూపునకు నోచుకోని మిత్రులు
ఖమ్మం: శాంతిభద్రతల పేరుతో పోలీసుల ఆంక్షలు.. ‘ఈ రాత్రికే అంత్యక్రియలు పూర్తిచేయాలి’ అంటూ ఒత్తిళ్లు.. అంతిమయాత్రకు అడుగడుగునా ఆటంకాలు, ఉద్రిక్తతల నడుమ.. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు ఆదివారం అర్ధరాత్రి ముగిశాయి. ఖమ్మంలో ఆత్మత్యాగం చేసిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి చివరి మజిలీలో అడుగడుగునా ఉత్కంఠ నెలకొంది. ఆయన మృతదేహాన్ని అదివారం రాత్రి పటిష్ఠ బందోబస్తు మధ్య హైదరాబాద్‌ నుంచి ఖమ్మానికి తీసుకొచ్చారు. ఖమ్మం నగరవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి ఉండటంతో 800 మందికి పైగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఇంటికి చేరిన శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని చూసి బంధువులు, మిత్రులు, ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఉద్విగ్నతకు గురయ్యారు. అయితే, శ్రీనివాసరెడ్డి మృతదేహానికి ఎలాగైనా సరే ఈ రాత్రికే అంత్యక్రియలు జరిపించాలంటూ కుటుంబసభ్యులపై పోలీసు లు ఒత్తిడి తెచ్చారు. మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి నేరుగా శ్మశాన వాటికకే తీసుకెళ్లాలనీ ప్రయత్నించగా.. కుటుంబసభ్యులు అంగీకరించలేదు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పటికీ గంటన్నర మాత్రమే ఉంచారు. దీంతో చాలామంది శ్రీనివాసరెడ్డిని కడసారి చూడలేకపోయారు.

ధర్మం కాదని చెప్పినా..

శ్రీనివాసరెడ్డి మృతదేహం ఇంటికి చేరిన కొద్దిసేపటి తర్వాత.. అంతిమ సంస్కారం త్వరగా కానివ్వాలని అక్కడ ఉన్న పోలీసులు ఒత్తిడి తెచ్చారు. రాత్రివేళ అంత్యక్రియలు చేయడం సంప్రదాయం కాదని.. సోమవారం చేసేందుకు అనుమతించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా.. పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో ఆదివారం రాత్రి 9:30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. రాపర్తినగర్‌ వద్దకు రాగానే.. అంతిమయాత్రను బస్‌డిపో వైపు మళ్లించాలని నాయకులు పట్టుబట్టగా.. పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో అరగంట పాటు వారు ధర్నా నిర్వహించారు. సీపీ తఫ్సీర్‌ డీజీపీతో మాట్లాడి అనుమతించారు. అప్పటికే డిపో వద్ద మోహరించిన పోలీసులు అంతిమయాత్ర వాహనాన్ని ఆపకుండా శ్మశానవాటికవైపు తరలించారు. రాత్రి 11:30గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి.

అన్నీ బంద్‌!
ప్రభుత్వ తీరుకు నిరనసగా విపక్షాలు, వివిధ రాజకీయ, ప్రజా సంఘాలు, ఆర్టీసీ జేఏసీ సోమవారం చేపట్టిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌ విజయవంతమైంది. దుకాణాలు, పెట్రోల్‌బంక్‌లు, సినిమాహాళ్లను స్వచ్ఛందంగా మూసేశారు. ప్రైవేటు బస్సులు కూడా ఎక్కడా తిరగలేదు. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు, రాజకీయపక్షాల నాయకులు తెల్లవారుజామున 5 గంటల నుంచే బస్సు డిపో, బస్టాండ్‌ వద్ద ధర్నా చేపట్టి బస్సులను బయటకు వెళ్లకుండా దిగ్బంధించారు. సీఎల్పీ నేత భట్టి, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం బస్టాండ్‌ వద్ద నేతలంతా ధర్నా చేశారు. ఖమ్మం డిపో వైపు చొచ్చుకుపోతున్న బీజేపీ నేతలు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Courtesy Andhra Jyothy