• ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి ఆత్మాహుతియత్నం
  • 90% గాయాలు.. చావుబతుకుల్లో ఆస్పత్రిలో
  • డిపో వద్ద ధర్నా నుంచి నేరుగా ఇంటికి
  • గేటు బయట పెట్రోలు పోసుకుని నిప్పు
  • మంటల్లో కాలుతూ నాకేమైనా పర్వాలేదు 48 వేల కార్మికులు బాగుండాలె’ అని కేక
  • మరో డ్రైవరూ ఆత్మహత్యాయత్నం
  • కార్మికుల్లో ఆగ్రహం.. బస్సులపై దాడులు
  • 2009 డిసెంబరు 1….తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్న రోజు. నా చావుతోనైనా తెలంగాణ రావాలని ఆయన బలిదానం చేశారు. ఆ తర్వాత దాదాపు 1200 మంది తెలంగాణ సాధన కోసం అమరులయ్యారు.
  • 2019 అక్టోబరు 12…శ్రీకాంతాచారి బలిదానం జరిగి పదేళ్లయినా కాలేదు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరోమారు అగ్ని జ్వాల. ‘నా చావుతోనైనా 48 వేల మంది జీవితాలు మంచిగుండాలి. నా బలిదానం చూసైనా ప్రభుత్వం ఆర్టీసీని పట్టించుకోవాలి’ అంటూ శ్రీనివాసరెడ్డి అనే ఆర్టీసీ డ్రైవర్‌ అగ్ని జ్వాలల్లో నిలువెల్లా కాలిపోయారు. జాతీయ భావాలు కలిగి, ఆర్థికంగా మంచి స్థితిలో ఉండి, ఇద్దరు కుమారుల్ని సైన్యంలో చేర్చిన ఆయన.. సహచరుల భవిష్యత్తు కోసం బలిదానానికి సిద్ధపడ్డారు.

ఆర్టీసీలో కొలువులు పోతే 48 వేల మంది కార్మికులు.. వారినే నమ్ముకున్న కుటుంబాలు ఏం కావాలి? పూట గడిచే దిక్కు లేక వారంతా రోడ్డున పడాల్సిందేనా?’ ఎనిమిది రోజులుగా ఓ ఆర్టీసీ డ్రైవర్‌ పడిన వేదన ఇది. బస్‌ డిపో వద్ద ఆందోళన చేస్తున్న తోటి కార్మికులతో ఇదే చెప్పుకొని బాధపడ్డాడు. ‘సర్కారు దిగొస్తుందో లేదో? మన గోడును పట్టించుకుంటుందో లేదో?’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఏమీ కాదులే.. నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి. బాధపడకు’ అని వారంతా ఆయన్ను ఓదార్చారు. అయినా ఆ డ్రైవర్‌లో నైరాశ్యం పోలేదు. జీవం లేని నవ్వుతో వెళుతున్నానని చెప్పి ఇంటికి బయలుదేరాడు. గేటు ఆవలే వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటి మీద కుమ్మరించుకొని నిప్పంటించుకున్నాడు! ఎగిసిన ఆ మంటలకు ఒళ్లంతా కాలిపోతున్నా.. ఆ తాళలేని బాధలోనూ.. ‘నేనేమైనా పర్వాలేదు. 48 వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు మంచిగుండాలె.

ఎంత మందిని మోసం చేస్తావు కేసీఆర్‌ అని అరిచాడు! 90ు గాయాలైన ఆయనను చికిత్స కోసం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. మరణ శయ్య మీద కొట్టుమిట్టాడుతున్నా.. ఆయన నోటి నుంచి అవే మాటలు! ‘కార్మికులు అంతా మంచిగుండాలె.. నాకేమైనా పర్వాలేదు’ అనే!! సాక్షాత్తు రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. ఈ విషాదంతో చలించిన శ్రీనివాస్‌ రెడ్డి సన్నిహితుడు, మరో డ్రైవర్‌ వెంకటేశ్వర్లు కూడా పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ‘తెలంగాణ కోసం పాటుపడిన మమ్ములను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసినట్లుగానే.. ఇప్పుడూ జరిగితేనే కానీ ప్రభుత్వం స్పందించేలా లేదు అని కన్నీరు పెట్టుకున్నాడు.

మంత్రి ప్రకటనతో నిర్వేదం!….8 రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు’ అంటూ మంత్రి అజయ్‌ చేసిన ప్రకటనతో వేడెక్కింది. ఉదయం ఖమ్మం బస్‌ డిపో వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు అక్కడ ధర్నా నిర్వహించారు. తానూ పాల్గొనేందుకు శ్రీనివాస్‌ రెడ్డి.. శనివారం ఉదయం 11 గంటలకు అక్కడికి వెళ్లాడు. మధ్యాహ్నం 3:20 గంటలకు రాపర్తి నగర్‌లోని ఇంటికి వెళ్లాడు. గేటు ఆవల ఒంటికి నిప్పు పెట్టుకున్నాడు. ఆయన్ను కుటుంబసభ్యులు హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంటలార్పే ప్రయత్నంలో చిన్న కుమారుడు సాయిహర్షిత్‌ చేతులకు స్వల్పగాయాలయ్యాయి. మంత్రి అజయ్‌ ప్రకటనతో శ్రీనివాస్‌ రెడ్డి తీవ్ర నిర్వేదానికి గురయ్యాడని, ఆ తర్వాతే ఆత్మాహుతికి ప్రయత్నించాడని తోటి కార్మికులు తెలిపారు. పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలపక్ష నాయకులతో కలిసి కార్మిక సంఘాల నేతలు కలెక్టరేట్‌ ఎదుట ఖమ్మం-వైరా ప్రధాన రహదారిపై బైఠాయించారు. సీఎం కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌, మంత్రి పువ్వాడ రాజీనామా చేయాలంటూ నినదించారు. మంత్రి పువ్వాడ చేసిన ప్రకటనతోనే శ్రీనివాసరెడ్డి ఆత్మాహుతి యత్నానికి పాల్పడ్డాడని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. పువ్వాడ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు అఖిలపక్ష నాయకులు, ఆర్టీసీ కార్మిక శాఖ జేఏసీ పిలుపునిచ్చాయి.

గంటంపావు దాకా చికిత్సే లేదు…ఆత్మాహుతి యత్నం చేసిన శ్రీనివాసరెడ్డి చికిత్సకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. 90 శాతం గాయాలైన శ్రీనివాస్‌ రెడ్డిని 4.15 గంటలకు ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తే.. 4.35 నిమిషాలకు పేరు నమోదు చేసి క్యాజువాలిటీకి తీసుకెళ్లారు. సాయంత్రం 5.30 గంటల వరకూ ఆయన్ను అత్యవసర వైద్య సేవలు కోసం తరలించలేదు. అక్కడికక్కడే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు ఆయన్ను అక్కడి నుంచి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి, పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. 6:50 నిమిషాలకు శ్రీనివాసరెడ్డిని బయటకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. స్థానికంగానే వైద్యం అందించాలని సూచించి, మళ్లీ అదే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెజిస్ట్రేటు వద్ద వాంగ్మూలం ఇప్పించాలంటూ ఆపడంతో ఇంకా సమయం పట్టింది. చివరకు, కార్మిక సంఘాల నాయకులు, కుటుంబ సభ్యుల ఒత్తిడితో హైదరాబాద్‌కు తరలించారు.

అందరూ చూస్తుండగానే మరో డ్రైవరు…శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మాహుతి యత్నం చేసిన విషయం తెలిసి చలించిపోయిన అదే డిపోకు చెందిన డ్రైవర్‌ వెంకటేశ్వర్లు కూడా ఆత్మాహుతి యత్నానికి ప్రయత్నించాడు. శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మాహుతి యత్నంపై ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద అఖిలపక్ష, కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేస్తుండగా అక్కడ బైఠాయించిన వెంకటేశ్వర్లు.. మనోవేదనకు గురై తానూ ఆత్మహత్య చేసుకుంటానని పరుగెత్తాడు. తోటి కార్మికులు, నాయకులు అడ్డుకున్నారు. కొద్దిసేపటికి బయటకు వెళ్లి పెట్రోలు తెచ్చుకున్నాడు. ధర్నా జరుగుతున్న ప్రదేశంలోనే పెట్రోలు ఒంటి మీద పోసుకున్నాడు. కార్మికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

నేను సూసైడు చేసుకొనుటకు ప్రభుత్వమే కారణం. టీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంతో విలీనం చేయాలి. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్‌, సీసీఎస్‌ డబ్బులను వెంటనే జమచేయాలి.బీఎస్‌ రెడ్డి

నిన్ననే మనవడి బారసాల చేశాడు,.మా బావ శ్రీనివాస్‌ రెడ్డి పొద్దున 11గంటలకు ఇంటినుంచి వెళ్లాడు. డిపోవద్ద కార్మికుల ఆందోళనలో పాల్గొన్నాడు. మధ్నాహ్నం 3:20కి ఇంటికొచ్చాడు. లోపలికి రాలేదు. గేటువద్దనే ఒంటికి నిప్పు పెట్టుకున్నాడు. మంటలు వస్తుండటంతో అక్కడున్న ఇద్దరు పిల్లలు కేకలు వేయడంతో కంగారుగా ఇంట్లోంచి బయటకువచ్చాం. మంటలను ఆర్పేసి ఆయన్ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాం. మంటలార్పే ప్రయత్నంలో సాయి హర్షిత్‌కు చేతులుకాలాయి. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నిన్ననే ఇంటివద్ద ఆయన తన మనుమడికి బారసాల ఘనంగా చేశాడు. ఈ రోజే (శనివారం) సాయిహర్షిత్‌ డ్యూటీ కోసం రాజస్థాన్‌కు వెళ్లాలి. అంతలోనే ఈ దారుణం జరిగింది.  శ్రీనివాస్‌ రెడ్డి బంధువు

Courtesy Andhrajyothi..