– సీతారాం ఏచూరి

(నిన్నటి సంచిక తరువాయి)
స్వాతంత్య్రోద్యమ వారసత్వం కోసం ఆరెస్సెస్‌ బీజేపీలు వెంపర్లాడుతున్నాయి. అందులో భాగంగా సర్దార్‌ పటేల్‌కు తామే వారసులమని చెప్పుకునేందుకు చేయని పని లేదు. ముందుకు తేని వాదనలేదు. 1948 ఫిబ్రవరి నాల్గో తేదీన జారీ చేసిన ఆదేశంలో నాటి భారత హౌం మంత్రిగా ఉన్న సర్దార్‌ వల్లభారు పటేల్‌ ”ఆరెస్సెస్‌ యొక్క అభ్యంతరకరమైన, ప్రమాదకరమైన కార్యక్రమాలు నేటికీ విస్తరిస్తూనే ఉన్నాయి. ఆరెస్సెస్‌ ప్రేరేపిత హింసోన్మాదానికి అనేకమంది బలయ్యారు. అలాంటి ఉన్మాదుల చేతుల్లో బలైన అత్యంత విలువైన వ్యక్తుల్లో గాంధీజీ కూడా ఒకరు.” అని హెచ్చరిస్తూ ఆరెస్సెస్‌పై నిషేధం విధించారు.
హౌం మంత్రి పటేల్‌కు, నాటి ఆరెస్సెస్‌ అధినేత గోల్వాల్కర్‌కు మధ్య జరిగిన చర్చలు సంప్రదింపుల్లో ఆరెస్సెస్‌ అనేక మోసపూరిత వాగ్దానాలు చేసింది. ఈ సంప్రదింపుల గురించి 1948 నవంబరు 14న కేంద్ర ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ‘ఆరెస్సెస్‌ నేతలు చేసే వాగ్దానాలకు, వారి శ్రేణులు సాగించే కార్యక్రమాలకు మధ్య పొంతన కుదరటం లేదు” అని హెచ్చరిస్తుంది. ఆరెస్సెస్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు పటేల్‌ తిరస్కరించాడు. మరోసారి కలిసేందుకు అవకాశం ఇవ్వాలన్న గోల్వాల్కర్‌ విజ్ఞప్తిని సర్దార్‌ పటేల్‌ తోసిపుచ్చాడు. అంతేకాదు. తక్షణమే ఢిల్లీ వదిలి నాగపూర్‌ వెళ్లాల్సిందిగా గోల్వాల్కర్‌ను ఆదేశించాడు. అంతిమంగా ఆరెస్సెస్‌ కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులను అంగీకరించిన తర్వాతనే 1949 జనవరి 11న సంఫ్‌ుపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆరెస్సెస ్‌కు రాజకీయా లకు ఎటువంటి సంబంధం ఉండరాదనీ, కేవలం అది ఓ సాంస్కృతిక సంస్థగా మాత్రమే ఉండాల న్నది కేరద్ర ప్రభుత్వం విధించిన షరతు.
వైరుధ్యం
ఇప్పుడు మనం మొదలు పెట్టిన చర్చకు తిరిగి వద్దాం. పైన ప్రస్తావించుకున్న వైరుధ్యాన్ని వివరిస్తూ ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ”మితవాదిగా ఉన్న గాంధీ దేశంలో ఓ విప్లవాత్మక ధోరణికి అంకురార్పణ చేశాడని – గ్రామీణ ప్రజలను సైతం ఆధునిక ప్రజాతంత్ర జాతీయోద్యమంలో భాగస్వాములును చేయటం – చెప్పటం పరస్పర వైరుధ్యంతో కూడిన అంశం. ఈ వైరుధ్యం మన జాతీయ రాజకీయ జీవితంలో ఉన్న వైరుధ్యాలకు ప్రతిరూపమే. వ్యక్తీకరణే. భూస్వామ్య వ్యవస్థతో మిలాఖత్‌ అయిన జాతీయ బూర్జువా వర్గం ఈ దేశంలో ప్రజాతంత్ర జాతీయోద్యమానికి నాయకత్వం వహించటంలోనే ఈ వైరుధ్యం ఇమిడి ఉంది” అంటారు.
వలస వ్యతిరేక పోరాటంలోకి విశాలమైన జనబాహుళ్యాన్ని సమీకరించగల శక్తి మాత్రమే కాదు. వారిలో ఉన్న సమరశీల స్వభావాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అదుపులో ఉంచి, ఆయా దోపిడీ వర్గాల దోపిడీకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసే శక్తి గాంధీజీకి ఉన్నందునే ఓ వైపున పెట్టుబడిదారులు, మరోవైపున భూస్వాములు గాంధీజీ నాయకత్వాన్ని అంగీకరించారు. ఆరాధించారు. ఈ సామర్ధ్యాన్ని గాంధీ పదే పదే ప్రదర్శిస్తూ వచ్చారు. అహ్మదాబాద్‌ బట్టల పరిశ్రమ కార్మికులు సమ్మెకు దిగి మిల్లు యజమానుల ఇండ్ల దగ్గర ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్మికులను నిలువరించటానికి గాంధీ నిరాహారదీక్షకు పూనుకున్నారు. చౌరీ చౌరాలో పోలీసు స్టేషన్‌పై రైతాంగం ఆందోళనకు దిగటంతో అది హిమాలయాలంత తీవ్రమైన పొరపాటు అని అలిగి శాసనోల్లంఘనోద్యమాన్ని నిలిపి వేశారు. గతంలో ఏ ఉద్యమం కంటే ఎక్కువగా శాసనోల్లంఘనోద్యమం భారతీయులను కదిలించింది. అటువంటి ఉద్యమాన్ని హఠాత్తుగా నిలిపివేయటాన్ని ప్రశ్నిస్తూ నెహ్రూతో సహా అత్యున్నత స్థాయి కాంగ్రెస్‌ నాయకులు జైల్లో నుంచే గాంధీజీకి లేఖలు కూడా రాశారు. నిజానికి గాంధీ శాసనోల్లం ఘనోద్యమాన్ని అర్థాంతరంగా నిలిపి వేసిన తర్వాతనే అప్పటివరకు అఖండ ఉద్యమంగా ఉన్న భారత స్వాతంత్య్రోద్యమం అనేక పాయలుగా చీలిపోయింది. భగత్‌సింగ్‌, ఆయన సహచరులు సోషలిజం, వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. సుందరయ్య, నంబూద్రిపాద్‌, రామ్మూర్తి, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ వంటి అనేక మంది స్వాతంత్య్రోద్యమ యోధులు సోషలిస్టు దృక్పథం పట్ల ఆకర్షితులై తర్వాత కాలంలో దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి అద్వితీయ నాయకత్వం అందించారు. ప్రజలను కదన రంగంలోకి నడిపించటం లోనూ, వారి సమరశీల శక్తిని అదుపులో ఉంచటంలోనూ గాంధీజీకి ఉన్న సామర్ధ్యం కారణంగానే స్వాతంత్య్రానంతరం ఈ దేశంలో తమ వర్గపాలన సుస్థిరం చేసుకున్న పెట్టుబడిదారులకు ఆయన ప్రియమైన నాయకుడుగా మారాడు. ఒకసారి స్వతంత్ర భారతంలో ఈ పాలక వర్గాల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాక బూర్జువా భూస్వామ్య వర్గాలు గాంధీయిజం, ఆయన పద్ధతులు లాభాలు పోగేసుకోవటానికి ఆటంకంగా కనిపించాయి. అందువల్లనే ప్రజల్లో పెరుగుతున్న సమరశీలతను నియంత్రించేందుకు గాంధీజీ పెద్దగా ఉపయోగ పడని వాడిగా మారాడు. అటువంటి కర్తవ్యం నెరవేర్చటానికి ఇప్పుడు వారి చేతుల్లో పోలీసు యంత్రాంగం, సైన్యం సిద్ధంగా ఉంది. చివరి రోజుల్లో సైతం గాంధీజీ తన విలువలకు కట్టుబడి ఉన్నప్పటికీ హిందూ ముస్లిం ఐక్యత వంటి అనేక విలువలను సరికొత్త పాలకులు తిరస్కరించే పరిస్థితి వచ్చిందని నంబూద్రిపాద్‌ సరిగ్గానే వక్కాణించారు.

1947 ఆగస్టు 15 నెహ్రూతో సహా జాతి యావత్తూ స్వాతంత్య్ర సాధన సంబరాలు చేసుకుంటూ నెహ్రూ ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేస్తున్న సమయంలో ఈ ఉత్సవాల్లో గాంధీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన ఎక్కడున్నాడు అన్నది ఈ తరానికి తెలియక పోవటం దురదృష్టం. ఆయన ఆ సమయంలో ఎక్కడున్నాడు? నౌఖాలి (ఇప్పుడు బంగ్లాదేశ్‌)లో ఉన్నాడు. దేశ విభజన సందర్భంగా జరిగిన దారుణ మతకలహా లను నియంత్రించేందుకు ఆయన నౌఖాలి వెళ్లారు. అప్పటికే ఉత్తరభారతదేశంలో మొదలైన మతోన్మాద అగ్ని కీలలు కలకత్తాను కూడా ఆక్రమించాయి. ఈ మతోన్మాద హత్యాకాండను అదుపులోకి తేవటానికి కలకత్తాలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఈ విషయాల గురించి నేటి యువతరం తెలుసుకోక పోవటం దురదృష్టం.

గాంధీ జయంతి జరపటం అంటే అర్థం …
గాంధీజీ నాలుగు విలువల కోసం జీవితం అంకితం చేశాడన్న విషయాన్ని పైన చెప్పుకున్నాం. ఈ విలువలే భారత రాజ్యాంగానికి పునాది విలువలుగా మారాయి. ఈ విలువలపై కొత్త పాలకులు బరితెగించి దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీజీని స్మరించుకోవటం అంటే ఆయన ఏ విలువల కోసం జీవితం అంకితం చేశారో ఆ విలువల పరిరక్షణ కోసం మనలను మనం కర్తవ్యబద్ధులను చేసుకోవటమే. ఈ విలువలను సవాలు చేస్తున్న హైందవ జాతీయవాదాన్ని నిలువరించే కర్తవ్యాన్ని స్వీకరించటమే. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర భారతదేశాన్ని ఫాసిస్టు బీజేపీ/ఆరెస్సెస్‌లు ధ్వంసం చేయకుండా కాపాడు కోవటానికి కంకణబద్ధులమవుదాం.

అనువాదం : కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037