A.G. Noorani

కేంద్రం లోను, యు.పి లోని బిజెపి ప్రభుత్వాల సాయంతో సంఘపరివార్‌ తన విద్వేషపూరిత ఎజెండాను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన ముప్పయ్యేళ్లకు మధురలో శ్రీకృష్ణ జన్మభూమి, వారణాసిలో విశ్వనాథ ఆలయం వద్ద ఉన్న మసీదులపై ఏదో ఒక విధంగా రచ్చ చేయాలని చూస్తున్నది. ఈ దిశగా తన అనుబంధ గ్రూపులను, సంస్థలను ప్రేరేపిస్తున్నది. కుటుంబ నియంత్రణలో ఆర్‌ఎస్‌ఎస్‌కు నమ్మకం ఉన్నట్టు లేదు. అందుకే లెక్కకు మిక్కిలి అనుబంధ సంస్థలకు అది పురుడు పోసింది. తనపై ఉన్న నిషేధాన్ని తప్పించుకునేందుకు 1949 జులై 9న అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి)ని ఏర్పాటు చేసింది. పేరుకే అది విద్యార్థి సంఘం. హింసాత్మక దాడుల్లో తర్ఫీదు పొందిన మిలిటరీ తరహా బృందాలకు అది నెలవు. అక్కడి నుంచి వచ్చినవారే నరేంద్ర మోడీ. ఆ తరువాత విశ్వ హిందూ పరిషత్‌ ఏర్పడింది. 1964 ఆగస్టు 29, 30 తేదీల్లో ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌ దీనిని ఏర్పాటు చేశారు. కె.ఎం.మున్షీ కూడా విహెచ్‌పి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈ విహెచ్‌పి నుంచి 1984లో బజరంగ్‌ దళ్‌ పుట్టుకొచ్చింది. అయోధ్యపై చిచ్చు రేపేందుకే దీనిని ముందుకు తెచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక పితామహునిగా ఈ విభాగాలనన్నిటినీ నియంత్రిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగంగా మొదట జనసంఫ్‌ు పార్టీ (1951)ని ఏర్పాటు చేశారు. 1980 నాటికి వచ్చేసరికి భారతీయ జనసంఫ్‌ు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది.

1984లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అవమా నకరమైన ఓటమిని ఎదుర్కొంది. ఆ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ సమీకరణ కోసం హిందూత్వకు పదును పెట్టింది. భారత్‌లో, విదేశాల్లో ఉన్న సభ్యులను ముఖ్యంగా సాధువులను పోగేసింది. వారు కూడా ప్రాపంచిక జీవితాన్ని అనుభవించారు. ఈ సంస్థలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాల మేరకు బిజెపి కి మద్దతుగా ఎన్నికల బరిలోకి దిగాయి.

బిజెపి కుంగుబాటును తొలగించి, దానికి ఒక ఆశాజనకమైన మార్గాన్ని చూపించేందుకు విశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) మొదటి ధర్మ సంసద్‌ (1984లో) నిర్వహించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే 18 నిబంధనలతో ఒక నియమావళిని రూపొందించింది. ఆచార సంహిత పేరుతో వ్యక్తులకు, కుటుంబాలకు, రాజకీయ నాయకుల కోసం అని ఒక ప్రవర్తనా నియమావళిని నిర్దేశించింది. ఆధునిక యుగంలో హిందూ సమాజ అభివృద్ధికి ఆచరించాల్సిన ధర్మాలంటూ కొన్నిటిని పేర్కొంది. దాని ప్రధాన లక్ష్యం. ఇంకా సూటిగా చెప్పాలంటే మతం ద్వారా రాజకీయ సమీకరణలు చేపట్టడం. ‘మఠాలు, మందిరాల అభివృద్ధి, హిందూ మత ప్రయోజనాలు కాపాడేలా ప్రభుత్వాన్ని ఆదేశించడం, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ దేవుళ్లను, దేవతలను, హిందూ జీవన విలువలను విమర్శించే సినిమాలను అనుమతించకూడదు’ అని సంఫ్‌ు పరివార్‌ ఆ డాక్యుమెంట్‌లో నిర్దేశించింది. మరో ముఖ్యమైన అంశమేమిటంటే శ్రీకృష్ణుని జన్మస్థానం, కాశీ విశ్వనాథ ఆలయం, ఇతర చారిత్రిక ప్రార్థనా స్థలాలను హిందువులకు అప్పగించాలని పదకొండో నెంబర్‌ నిబంధనలో పేర్కొంది.

మొత్తం డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే మతం ప్రాపతిపదికన రాజకీయ సమీకరణకు ఉద్దేశించబడిందని స్పష్టమవుతుంది. ‘హిందూ చేతన్‌’ అనే విహెచ్‌పి పక్ష పత్రిక రాతలు కూడా దీనినే రుజువు చేస్తున్నాయి. మంజరి కట్జు ‘విశ్వహిందూ పరిషత్‌-భారత రాజకీయాలు’ అన్న తన పుస్తకంలో, ‘విహెచ్‌పి స్థాపించిన రెండు దశాబ్దాలలో తన అసలు లక్ష్యాలను అనుసరిస్తూ దేశం లోపల, వెలుపల హిందువులను ఏకీకరణ చేయడం, భారత్‌లో క్రైస్తవ మిషనరీల పనిని వ్యతిరేకించడంపౖౖె కేంద్రీకరించింది. తరువాత రాజకీయ సమీకరణల ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తూ, నేరుగా రాజకీయ సమస్యలను చేపట్టింది. అయోధ్యలో రామజన్మ భూమి, మధురలో శ్రీకృష్ణ జన్మభూమి, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం వంటి అంశాలపై ప్రచారం చేయడంతో బాటు ‘హిందూ పార్టీకి’ ఓటు వేయాలని అది ‘హిందువులకు’ పిలుపునిచ్చింది. మతం పేరుతో ప్రజలను సమీకరించే ఇటువంటి కుత్సిత రాజకీయాలతో ఉత్తర, పశ్చిమ భారత దేశంలో సంఘపరివార్‌ పునాదిని విస్తరించుకుంది. గోవధ, మత మార్పిడులు వంటి అంశాలపై విద్వేషాలను రెచ్చగొట్టి బిజెపి రాజకీయ పబ్బం గడుపుకుంటోంది (అలాగే ఆమె పుస్తకం హిందూవైజింగ్‌ డెమొక్రసీ: న్యూ టెక్స్ట్‌, న్యూ ఢిల్లీ-2017, కూడా చూడండి).

‘ఆలయ ఉద్యమం’ స్వభావ రీత్యా రాజకీయపరమైనదని, దానికి మతంతో ఏ విధమైన పని లేదని’ ఏప్రిల్‌ 14, 2000 నాడు భోపాల్‌లో అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ అంగీకరించారు. మరో మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అమెరికన్‌ బడా దౌత్యవేత్తతో సాగించిన సంభాషణలో ఎలాంటి దాపరికం లేకుండా ఇదే విషయాన్ని చెప్పారు. ‘రామజన్మ భూమి లేదా అయోధ్య సమస్య అనేక మంది సాధువులను విహెచ్‌పి వెనక సమీకృతులను చేస్తే, అది తిరిగి బిజెపి సాంఘిక పునాదిని దృఢపరిచింది.’ అని ఆయన వ్యాఖ్యానించారు. శక్తివంతంగా పైకి లేచిన హిందూత్వ (మందిర్‌ ఉద్యమంలో కీలకాంశమిదే)కు ఎన్నికల్లో బిజెపి ఎదుగుదలకు మధ్య అంతస్సంబంధం ఉందనేది స్పష్టం అని మంజరి కట్జు పేర్కొన్నారు. అయోధ్యలో అసెంబ్లీ స్థానాన్ని, ఫైజాబాద్‌ పార్లమెంటరీ స్థానాన్ని, అలాగే యు.పి అసెంబ్లీలో బిజెపి బలం పెంచుకోవడానికి ఇదే కారణం.

1990వ దశకం ప్రారంభంలో అంటే 1992 డిసెంబరు 6న వారు మసీదు కూల్చక ముందు బిజెపి, విహెచ్‌పి ఈ మూడు ఆలయాలపై తీసుకున్న వైఖరిని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. అయోధ్యలో బాబ్రీ మసీ దును వదులుకుంటే, మధుర, కాశీని తాము వదులు కుంటామని ఎల్‌.కె.అద్వానీ ఆనాడు పదే పదే వాగ్దానం చేసే వారు. మరో సందర్భంలో ఆయన, ఇతర బిజెపి నాయకులు మధుర, కాశీ ప్రస్తుతానికి తమ ఎజెండాలో లేవనేవారు.

ముస్లింలకు గుణపాఠం చెప్పాలి
1997లో డిసెంబరు 29న విహెచ్‌పి నేత అశోక్‌ సింఘాల్‌ మాట్లాడుతూ, ‘ముస్లింల మెడ పట్టుకుని, వారి స్థానం ఎక్కడో వారికి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది’ అన్నారు. ‘కాశీ, మధుర మావే’ అన్నారు. ముస్లింలు మున్ముందు మరిన్ని పరాభవాలకు గురికాకుండా ఉండాలని అనుకుంటే, వారు మారు మాట్లాడకుండా ఆ ప్రార్థనా స్థలాలను తమకు అప్పగించాలని’ అన్నారు. సింఘాల్‌ వ్యాఖ్యలను వాజ్‌పేయి ఖండించలేదు. ఆ వ్యాఖ్యలు అనాగరికమైనవి గనుక మర్యాద కోసమైనా వాటిని ఆక్షేపించి ఉండాల్సింది. లక్నోలో సింఘాల్‌ ముస్లింలపై వ్యాఖ్యలు చేసిన రోజునే తిరుపతిలో అద్వానీ మాట్లాడారు.

ఆ సందర్భాన్ని కాశీ, మధుర బిజెపి ఎజెండాలో లేవని స్పష్టం చేయడానికి ఆయన ఉపయోగించుకున్నారని ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది. కాశీ, మధుర బిజెపి మ్యానిఫెస్టోలో భాగంగా ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో సుస్థిరత, సుపరిపాలనే ప్రధాన ఎజెండాగా ఉందన్నారు. అంటే దాని అర్థం ఆ రెండు ఆలయాల అంశాన్ని పక్కన పెట్టినట్టు కాదని, ప్రతి ఎన్నికకు ‘కొన్ని కీలకమైన అంశాలు’ ఉంటాయని, ఈసారి సుస్థిరత కీలకమైన అంశమని చెప్పడమన్నమాట. అదే సంవత్సరం మార్చి 16న అద్వానీ మరో ప్రకటన చేస్తూ, ఇవి (కాశీ, మధుర) ఎజెండాలో లేవంటే అర్థం వాటిని వదిలేసినట్లు కాదని అన్నారు. అయోధ్య కూడా తొలుత ఎజెండాలో లేదని అన్నారు. ఊహించినట్లే సింఘాల్‌ 1998 జనవరి 1న వాజ్‌పేయి తిరస్కరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ప్రకటనల అర్థం ఆయనకు బాగా తెలుసు. ఇటువంటి అంశాలపై ఎవరేమి చెప్పినా అంతిమంగా సంఘపరివార్‌ మాటే వేద వాక్కు. దానికి ప్రతి ఒక్కరూ బద్ధులై ఉండాల్సిందే నన్నారు. బిజెపి-విహెచ్‌పి మధ్య భాషలో తేడా ఉండొచ్చు, కానీ భావజాలంలో మేము ఒక్కటే అని ఆయన చెప్పారు. జనవరి 9న ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఒకరు ఈ అంశానికి సంబం ధించి మాట్లాడుతూ, సంఘ పరివార్‌కు చెందిన రెండు విభాగాల మధ్య ఏ విధమైన వైరుధ్యం లేదని స్పష్టం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ రాజేంద్ర సింగ్‌ జనవరి 10న చేసిన ప్రసంగంలో అయోధ్య, ఆర్టికల్‌ 370, తదితర అంశాలపై ఎలాంటి శషబిషలకు ఆస్కారం లేదన్నారు. ‘నీకు ఆరోగ్యం బాగులేకుంటే స్నానం చేయకుండా ఉంటావు. కానీ, ఈ పరిస్థితి ఎప్పుడూ అలానే ఉండదు’ అంటూ బిజెపిని ఉద్దేశించి అన్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేత వెనక కుట్రకు సంబంధించి 2020 సెప్టెంబరు 9న సుప్రీం కోర్టు ఏకపక్షంగా వెలువరించిన తీర్పు తరువాత ఆరెస్సెస్‌ కాశీ, మధురను తెర పైకి తేవాలని చూస్తోందని, ఉమ్మడి సివిల్‌ కోడ్‌ అమలుకు యత్నిస్తోందంటూ ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఓ కథనాన్ని ప్రచురించింది. సుప్రీం తీర్పు తరువాత సంఘ పరివార్‌కు చెందిన గ్రూపులు కొన్ని కాశీ, మధుర అంశాన్ని లేవనెత్తాయి. దీనిపై ప్రజల నుంచి వచ్చే సెంటిమెంట్‌ను చూసి తదుపరి అడుగు వేయాలని ఆరెస్సెస్‌ భావిస్నుట్లు ఆ పత్రిక తెలిపింది.

ఆ తరువాత కొద్ది రోజులకే మధుర లోని మసీదు తమ స్వాధీనంలోనిదంటూ దాఖలైన సివిల్‌ పిటిషన్‌ గురించి పత్రికలు విస్తృతంగా ప్రచురించాయి. కోర్టు ఆ దావాను కోట్టివేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర మోసాలతో కూడినదని రికార్డులు తెలుపుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు లక్ష్యం గుడులు కాదు, అవి కేవలం లక్ష్యాన్ని తెలిపే వ్యక్తీకరణలు మాత్రమే. వాటిని ఉపయోగించుకుని ఫాసిస్టు తరహా మత రాజ్యాన్ని నెలకొల్పడం దాని లక్ష్యం. ఇందుకు సంబంధించి ఎదురయ్యే రాజకీయ, న్యాయపరమైన ఆటంకాలను అది లెక్కచేయదు. ప్రభుత్వ సాయంతో ప్రాచీన కట్టడాలు, పురాతన ప్రదేశాలు, అవశేషాల చట్టం (1958)ను అది బాహాటంగా వ్యతిరేక ిస్తుంది. మధురలో మసీదుకు సంబంధించి 1968లో హిందు వులు, ముస్లింల మధ్య చేసుకున్న ఒప్పందం ఏమైనట్టు? ఈ ఒప్పందం లక్ష్యం ఇరు పక్షాలు (మతాలు) మధ్య దీర్ఘకాలంగా ఉన్న వివాదాలను పరిష్కరించడం. అప్పుడున్న బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ లకు ఈ విషయం బాగా తెలుసు. ఇరు పక్షాలు ఆ ఒప్పంద పత్రాలు తీసుకున్నట్లు నమోదయి ఉన్నది. వాస్తవానికి దీనిని 50 ఏళ్ల క్రితం రిజిష్టర్‌ చేశారు. ముస్లింలు అయిష్టంగానే కొంత భూమిని ఇచ్చారు. దానికి హిందువులు ఒప్పుకుని ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకు న్నారు. అదే విధంగా హిందువుల భూమి కూడా ఇచ్చారు. అప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది. ఇరు వైపుల నుంచి పెట్టిన కేసులను వారు ఉపసంహరించుకున్నారు. ఆ ఒప్పందం అమలు చేయడం కోసం కోర్టుల సహకారం తీసుకోవచ్చు.

వ్యాసకర్త రాజ్యాంగ నిపుణులు

Courtesy Prajashakti