* ఆర్‌ఎస్‌ఎస్‌ నేత పాఠశాలలో బాబ్రీ మసీదు విధ్వంస దృశ్యరూపం

న్యూఢిల్లీ : ఏ పాఠశాలలో అయినా అధ్యాపకులు, యాజమాన్యం విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు నేర్పించి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారు. కర్నాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించే ఒక పాఠశాలలో మత ఛాందసవాదం, మత విద్వేషాన్ని అభంశుభం తెలియని చిన్నారుల మెదడుల్లోకి కూడా చొప్పించేందుకు యత్నించారు.. మంగళూరులో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌)కు చెందిన వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘శ్రీరామ విద్యా కేంద్ర’ పాఠశాల దీనికి వేదికైంది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం ఎలా జరిగిందన్న దానిపై పాఠశాలలో ఒక కార్యక్రమం నిర్వహించారు. దీన్ని దృశ్య రూపేణా కూడా విద్యార్థుల చేత ప్రదర్శింపచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై పలువర్గాల నుంచి పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి. పలు కార్యక్రమాల ద్వారా మతాలన్నీ ఒకటే, అన్ని మతాల వారు సహోదరులే అని విద్యార్థుల్లో లౌకికతత్వాన్ని పెంపొందిం చాల్సిన పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
తెలుపు, కాషాయం రంగులో ఉన్న దుస్తులను ధరించిన కొంతమంది చిన్నారులు బాబ్రీ మసీదును ముద్రించి ఉన్న పోస్టర్‌ వైపు దూసు కెళ్తుండడం ఈ వీడియోలో ఉంది. ఈ సందర్భంగా అక్కడ మైక్‌లో ‘శ్రీరామచంద్రాకీ జై, ‘ భారత్‌ మాతాకీ జై’ అంటూ నిర్వాహకులు భిగ్గరగా చెప్తున్నారు. అయోధ్యలోని బాబ్రీ మసీదుకు సంబంధించి వారికి అనుకూలంగా బ్యాక్‌గ్రౌండ్‌లో చెబుతుండగా, విద్యార్థులు ఆ పోస్టర్‌ చుట్టూ చేరి పోస్టర్‌ను కిందకు లాగి పడేశారు. ఈ సందర్భంగా తిరిగి ‘జై హనుమాన్‌, ‘ బోలో బజరంగ్‌ బలికీ జై’ అంటూ గట్టిగా నినాదాలు వినిపించాయి.

హాజరైన కేంద్రమంత్రిగవర్నర్‌ బేడీ
పాఠశాలలో జరిగిన విద్వేషపూరిత కార్యక్రమానికి కేంద్ర మంత్రి డివి.సదానంద గౌడ, రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న పుదుచ్చేరి గవర్నర్‌ కిరణ్‌బేడీలు ముఖ్య అతిధులుగా హాజరుకావడం గమనార్హం. ఈ ఘటన జరిగిన పాఠశాలను ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ప్రభాకర్‌ భట్‌కు చెందిన ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తోంది. దీనిపై యూత్‌ కాంగ్రెస్‌ నేత వైబి శ్రీవాస్తవ మాట్లాడుతూ దేశం మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి చేతుల్లోకి వెళ్తే భవిష్యత్తులో ఇటువంటి విద్యాబోధనే చూడాల్సి వుంటుందని అన్నారు. మొత్తం హిందువులను తమవైపు తిప్పుకునేందుకే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని మరో నేత పేర్కొన్నారు.

Courtesy Prajashakthi