• 6400 కోట్ల భూమిపై మంత్రి కన్ను
  • ఉద్యోగ సంఘాలతో సొసైటీ..
  • రూ.20 వేల చొప్పున వసూలు
  • కోర్టు చిక్కుల్లోని భూమి ఆక్రమణ, అభివృద్ధి.. ప్లాట్ల కేటాయింపు
  • ఉద్యోగుల ముసుగులో పెద్దల కబ్జా?..
  • డిమాండ్లలోనూ ప్రస్తావన
హైదరాబాద్‌: అది ఉమ్మడి రాష్ట్రంలో ఎన్జీవో సొసైటీకి కేటాయించిన 189 ఎకరాల భూమి. హైదరాబాద్‌ నడిబొడ్డున గచ్చిబౌలిలో ఉంది. 1991లో సొసైటీకి కేటాయించిన ఆ భూమిపై దాదాపు 27 కేసులు పెండింగులో ఉన్నాయి. ఆ భూమి విలువ ఇప్పుడు 6400 కోట్ల రూపాయల పైనే. రాష్ట్రం విడిపోగానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. రికార్డుల ప్రకారం భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కోర్టుల్లో ఎడా పెడా కేసులు పడటంతో ఇప్పట్లో తేలే వ్యవహారమని ఎవరూ భావించడం లేదు. దీన్నే అవకాశంగా తీసుకొని ఒక మంత్రి, ఆయన అనుచరులైన ఉద్యోగ నేతలు కలిసి ఎన్‌జీవో సొసైటీకి అనుబంధంగా మరో సొసైటీని సృష్టించారు.

హైదరాబాద్‌లో సొంతింటి కలను ఆశగా చూపించి తెలంగాణ ఉద్యోగుల్ని సభ్యులుగా చేర్పించారు. అసలు భూమే లేని సొసైటీలో సభ్యుడికి రూ.20 వేల చొప్పున కోట్ల రూపాయలు సభ్యత్వ రుసుముగా వసూలు చేశారు. ప్రభుత్వం స్వాధీనమైన ఎన్జీవో సొసైటీ భూమిని ఆక్రమించి, అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని ఆ భూమిని తమకు వదిలేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వత్తిడి ఎత్తుగడ ఫలిస్తే 189 ఎకరాల మీద పెత్తనం తమది అవుతుంది. ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తే భూమి ఎవరికీ దక్కదు. అయినా ఫర్లేదు… ఇప్పటిదాకా వసూలు చేసిన కోట్ల రూపాయల సభ్యత్వ రుసుమును జల్సా చేయొచ్చు! ఇదీ మంత్రి ఆశీస్సులతో జరుగుతున్న దందా!

గజం రూ.70 వేలు
ఈ సొసైటీలో గజం భూమి విలువ అక్షరాలా రూ.70 వేలు. ఎకరా రూ.33 కోట్లకు పైగా పలుకుతోంది. ఈ భూమిని కొట్టేయడానికి పథకం పన్నారు. మంత్రి బినామీలు సూత్రధారులైతే ఉద్యోగ సంఘాల నేతలు పరోక్షంగా సహకరిస్తున్నారు. ఈ భూమిపై నైతికంగా అధికారం ఎన్జీవోలది. చట్టబద్ధంగా ప్రభుత్వానిది. ఇటీవలే పురుడు పోసుకున్న ఓ హౌసింగ్‌ సొసైటీ ఈ భూమిని చెర బట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతునిస్తూ… ఉద్యోగుల డిమాండ్లు అంటూ సమర్పించిన డిమాండ్ల పత్రంలో ఇది కూడా ఎజెండాగా మారింది. నిజానికి కార్మికుల వ్యవహారంగా చెబుతున్నా బడాబాబుల కన్ను ఈ భూమిపై పడిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే 162.29 ఎకరాల్లో సగానికి పైగా అనర్హులకు కట్టబెట్టి, భూమిని అడ్డగోలుగా సొసైటీ పంచిపెట్టింది. ఆ పక్కన వివాదాలతో ఆగిపోయిన విలువైన భూమిపై కన్నేసింది.
ఈ భూమిని దక్కించుకోవడానికి బినామీ సొసైటీని ముందుపెట్టిప్రణాళికలు రచిస్తోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో సర్వే నెం.36, 37లలో 427 ఎకరాలను 1991లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు కేటాయించింది. 427 ఎకరాల్లో 189.11 ఎకరాలను ఏపీఎన్జీవో సొసైటీకి, మరో 162 ఎకరాలను టీఎన్జీవోల సొసైటీకి, 38 ఎకరాలను హైకోర్టు హౌసింగ్‌ సొసైటీకి, మరో 36 ఎకరాలను సచివాలయ హౌసింగ్‌ సొసైటీకి కేటాయించింది. అప్పట్లోనే 1992 నవంబరు 17వ తేదీన ప్లాట్ల కేటాయింపును సర్వీసు సీనియారిటీ ఆధారంగా చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ జీవోను కాదని 2010 ఏప్రిల్‌ 7న లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు. అందులో 75 శాతం మంది జూనియర్లకే ప్లాట్లు దక్కాయి. సీనియర్లంతా న్యాయస్థానంలో కేసు వేశారు. 2010లో భూములు దక్కించుకున్నా 2014 దాకా ఈ భూమిలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా జరుగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన 189.11 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భూములు కేటాయించినా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదనే ఏకైక కారణాలతో భూములను ప్రభుత్వం లాగేసుకుంది. ఉద్యోగులంతా న్యాయస్థానంలో కేసులు వేయడంతో ప్రస్తుతం భూమిపై యథాతథాస్థితి కొనసాగుతోంది. ఇలా వివాదాలతో ఆగిపోయిన ఉద్యోగుల సొసైటీ భూములను పెద్దల బినామీ సొసైటీ కొట్టేయడానికి ప్లాన్‌ చేస్తుండటం గమనార్హం.
తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం
హౌసింగ్‌ సొసైటీ యాక్ట్‌ ప్రకారం సభ్యత్వం తీసుకున్న ప్రతీ సభ్యుడికి ప్రాంతంతో సంబంధం లేకుండా స్థలాలు కేటాయించడం సొసైటీ ప్రాథమిక బాధ్యత. ఏపీఎన్జీవో సొసైటీలో 5415 మంది సభ్యులు ఉండగా… అందులో 1700 మంది దాకా తెలంగాణ స్థానికత కలిగినవారే. ఇక సర్వీసులో ఉన్న వారంతా ఏపీ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయారు. అక్కడి ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి తగిన చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉద్యోగాలు చేసి రిటైరైన వారు, ఏపీ స్థానికత కలిగిన వారు, ఏపీ ఎన్జీవో సొసైటీలో సభ్యులుగా ఉంటూ తెలంగాణ స్థానికత కలిగిన వారు మాత్రం ఇళ్ల స్థలాలు నోచుకోకుండా పోయారు. జీవితకాలంలో ఒకే ఒక్కసారి దక్కే భూమిని కాస్తా ప్రభుత్వం లాగేసుకోవడం, భూవివాదం తేలక ముందు మరో సంఘం పుట్టి, సదరు స్థలంపై కన్నేయడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అమాత్యులు, నాయకుల బినామీ సొసైటీ ఒక అడుగు ముందుకేసి, భూముల్లేకున్నా ప్లాట్లు కేటాయింపు పేరుతో దందా చేస్తున్నారు.
యథాతథ స్థితి ఉత్తర్వులున్నా
భూమిపై యథాతథాస్థితి కొనసాగుతున్నా ఏపీ ఎన్జీవో హౌసింగ్‌ సొసైటీకి అనుబంధంగా పుట్టిన మరో సంఘం గచ్చిబౌలి భూములను ప్లాట్లుగా చేసింది. లాటరీ తీసి కేటాయింపులు కూడా చేసేసింది. ఇక 2018 నవంబరులో ఈ సంఘం మరో అడుగు ముందుకేసి గోపన్‌పల్లిలో వివాదస్పద భూమిని జేసీబీలతో చదును చేసి… టెంట్లు వేసుకొని… భూమి స్వాధీన ప్రక్రియ చేపట్టింది.
కేసులే కేసులు
ఏపీ ఎన్జీవో హౌసింగ్‌ సొసైటీకి కేటాయించిన 189 ఎకరాల భూములపై 27 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవానికి 1991 దాకా ఇందులోని 100 ఎకరాల భూమి రైతుల సాగులో ఉంది. అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీకి కేటాయించింది. దీన్ని సవాలు చేస్తూ రైతులంతా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. తర్వాత కేసు తిరిగి హైకోర్టుకు చేరింది. ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. 27 కేసుల్లో స్థలాల కేటాయింపు విధానం, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ప్రధాన కేసులుగా ఉన్నాయి. ఇవి తేలకుండానే భూములను కొట్టేయాలని చూస్తున్నారు.
Courtesy Andhra jyothy