Image result for Rs 89,000 Cr flight to foreign countries black money– ఏడాదిలో విదేశాలకు రికార్డు స్థాయిలో తరలిన నిల్వలు 
– మోడీ హయాంలో అత్యధికం : ఆర్బీఐ రిపోర్టు 
– యూపీఏ-2 హయాంలో 35వేల కోట్లు.. 
– పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌ కోణంలో అనుమానాలు 

న్యూఢిల్లీ : మన దేశం నుంచి విదేశాలకు ధన ప్రవాహం జోరందుకున్నది. విదేశాల్లోని తమ ఆప్తులకు పంపే లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద పెద్దమొత్తంలో డబ్బు విదేశాలకు తరలివెళ్తున్నది. యూపీఏ హయాంలో కన్నా బీజేపీ అధికారంలోకి వచ్చాక..ఈ తరలింపు ప్రక్రియ అనుహ్యంగా పెరిగింది. ఓవైపు విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం మోడీ సర్కారు తలుపులు బార్లాతెరుస్తుంటే… మరోవైపు భారత్‌ నుంచే విదేశాలకు సొమ్ము అతివేగంగా తరలిపోతున్నది. మోడీ పాలనలో.. ఈ ధనప్రవాహం ఎంత పెరిగిందంటే.. యూపీఏ-2 హయాం(2009 ఏప్రిల్‌ నుంచి 2014 మార్చి వరకు)లో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద పంపిన మొత్తం సుమారు రూ. 35వేల కోట్లు ఉండగా.. 2018-19 ఆర్థిక సంవత్సరం(ఒక్క ఏడాదిలోనే)లో దాదాపు రూ. 89వేల కోట్లకు చేరుకోవటం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లోనే సుమారు 37.7వేల కోట్లు విదేశాలకు ఈ స్కీం కింద పంపించారు. అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌ కింద విదేశాలకు పెద్దమొత్తంలో తరలిపోతున్న సొమ్ముపై మొదటి నుంచి అనుమానాలు న్నాయి. ఎకాఎకిన ఇంత భారీస్థాయిలో మనీ ట్రాన్స్‌ఫర్స్‌ అవుతున్నతీరు పై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ కింద విదేశాలకు పంపిస్తున్న సొమ్ముపైనా నజర్‌ వేసింది. మనీలాండరింగ్‌ వ్యవహారమూ ఉండే అవకాశమున్నదని మరికొందరు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ధనప్రవాహం వెనుక కార్పొరేట్లు, బీజేపీ కనుసన్నల్లో మెలిగే సంపన్నులే ఎక్కువగా ఉన్నట్టు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఎల్‌ఆర్‌ఎస్‌ అంటే ఏమిటి? 
లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం కింద మన దేశంలోని వ్యక్తులు (మైనర్లు సహా) విదేశాల్లోని ప్రవాస భారతీయులకు ఒక ఆర్థిక సంవత్సరంలో అనుమతించిన కరెంట్‌, క్యాపిటల్‌ అకౌంట్లకు సుమారు రూ. 1.62 కోట్లు పంపించొచ్చు. సమీప బంధువుల మెయింటెనెన్స్‌, ప్రయాణాలు, విద్య, వైద్యావసరాల కోసం లావాదేవీలు కరెంట్‌ అకౌంట్‌ కింద జరుగుతాయి. కుటుంబ సభ్యులకు బహుమానాల రూపంలోనూ డబ్బు పంపించొచ్చు. క్యాపిటల్‌ ఖాతా కింద పంపిన డబ్బులు ఫారిన్‌ కరెన్సీ ఖాతాలను తెరిచి ఓవర్సీస్‌ బ్యాంకు సేవలు వినియోగించుకోవచ్చు. ఆస్తుల కొనుగోలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

ప్రవాహం తీరు తెన్నులు : 2010 నుంచి 2014 వరకు విదేశాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద పంపిన సొమ్ము ఒక బిలియన్‌ డాలర్లకు దరిదాపులో ఉంది. కానీ, 2015లో ఈ మొత్తం ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. యూపీఏ-2 హయాంలో 35వేల కోట్లు వెళ్లగా.. 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా సుమారు రూ. 30వేల కోట్లకు చేరింది. కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి(దాదాపు 89వేల కోట్లు)కి చేరింది. అయితే, ఈ సొమ్మంతా ఎక్కడికి పోతున్నదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత ఐదేండ్లలో ట్రావెల్‌ కోసం రమారమీ రూ. 91వేల కోట్లు, సమీప బంధువుల మెయింటెనెన్స్‌ కోసం సుమారు రూ. 65వేల కోట్లు, మరో రూ. 65వేల కోట్లు విద్య కోసం, దాదాపు రూ. 31వేల కోట్లు బహుమానాల రూపంలో ప్రవాస భారతీయులకు చేరినట్టు తెలిసింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ కింద విదేశాలకు వెళ్తున్న భారీ మొత్తంపై ఆర్థికవేత్తలు, విశ్లేషకుల అభిప్రాయాలు ప్రధానంగా ఇలా ఉన్నాయి..
1. ఎల్‌ఆర్‌ఎస్‌లోని ఫారెక్స్‌ లిమిట్‌ను 2014లో ఆర్బీఐ రెండింతల(దాదాపు రూ. 81లక్షల కోట్లు నుంచి సుమారు రూ. 1.62 కోట్లు)కు పెంచింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద విదేశాలకు నిధుల మొత్తం పెరుగుతుందన్న అభిప్రాయమున్నప్పటికీ కొందరు ఆర్థిక నిపుణులు కొట్టిపడేస్తున్నారు. ఉదాహరణకు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద అత్యధికంగా ట్రావెల్‌ క్యాటగిరీలో విదేశాలకు డబ్బు చేరింది. 2018లో ఈ క్యాటగిరీలో విదేశాలకు చేరిన సొమ్ముకు.. మన దేశం నుంచి విదేశాలకు జరిగిన విమాన ప్రయాణాలకు పొంతన కుదరడం లేదని స్పార్క్‌ క్యాపిటల్‌ నివేదిక తేల్చడం గమనార్హం. ట్రావెల్‌ క్యాటగిరీలో పెరిగిన మొత్తానికి విదేశాలకు జరిగిన ప్రయాణాలకు తీవ్ర అంతరం(తక్కువగా) ఉన్నదని ఈ నివేదిక వివరించింది.
2. ఎల్‌ఆర్‌ఎస్‌ రూపంలో పెట్టుబడులు విదేశాలకు వెళ్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదీగాక మధ్య తరహా వ్యాపారులు సింగపూర్‌, దుబారులాంటి విదేశాలకు తరలిపోతున్నారు. 2017లో సంపన్న భారతీయుల్లోని 2.1 శాతం మంది విదేశాలకు వెళ్లారని మోర్గాన్‌ స్టాన్లీ చీఫ్‌ రుచిర్‌ శర్మ వెల్లడించారు.
3. నల్లధనంపై దర్యాప్తు జరుపుతున్న సిట్‌ బృందం ఎల్‌ఆర్‌ఎస్‌ కింద విదేశాలకు తరలుతున్న డబ్బుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. పన్ను ఎగవేతకు ఇదొక మార్గంగా ఉపయోగించుకుంటు న్నట్టు భావిస్తున్నది. మనదేశంలో పన్నులను ఎగ్గొట్టేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ లోని బహుమానం విభాగం కింద కొందరు విదేశాలకు డబ్బును తరలి స్తున్నట్టు సిట్‌ అనుమానిస్తున్నది. నల్లధనాన్ని విదేశాల్లోని ప్రవాసులకు పంపించి పన్నులకు ఎగనామం పెడుతున్నట్టు సిట్‌ భావిస్తున్నది. అందుకే ఈ విభాగం కింద పంపే సొమ్మును రికార్డు చేసి పన్ను రిటర్నులో పరీక్షించాలని సిట్‌ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

(Courtesy Nava Telangana)