ఇదీ లెక్క….

గ్రేటర్‌లో రహదారులు: 9,103 కి.మీలు

జీహెచ్‌ఎంసీ పీపీఎంలో భాగంగా నిర్మించాల్సిన రోడ్లు: 827 కి.మీలు

పనులు పూర్తయినవి: 600 కి.మీలు

హెచ్‌ఆర్‌డీసీ నిర్మించాల్సిన రోడ్లు: 390 కి.మీలు

పనులు పూర్తయినవి: 100 కి.మీలు

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం: రూ. 800 కోట్లు

గ్రేటర్‌లో రోడ్ల నిర్వహణకు మరమ్మతుకు నిధులు పెంచుతున్నారే తప్ప.. మరమ్మతు విధానం మాత్రం మారడం లేదు. వాస్తవంగా గుంతలు పడిన చోట క్రమ ఆకారంలో బీటీ తొలగించి… ముందు ద్రావకం(బీటీ), హాట్‌ మిక్స్‌ వేసి రోలర్‌తో తొక్కించాలి… ప్యాచ్‌ వర్క్‌లకూ అదే పద్ధతిలో మరమ్మతు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతుంటారు. షెల్‌ మ్యాక్‌ వినియోగిస్తే ఆ మిశ్రమం గుంతలో గట్టిగా ఇమిడేలా వైబ్రేటర్‌ను తిప్పాలంటారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు చెబుతోన్న విధానాల్లో మరమ్మతు పనులు జరగవు. ఆ విషయం వారికి కూడా తెలిసినా మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేయరు. దీంతో అలా మరమ్మతు చేయగానే.. ఇలా కంకర, బీటీ మిశ్రమం తేలి రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. అంతకుముందు గుంతలు పడ్డ చోట ఇబ్బంది ఉండగా తారు లేవడంతో మరింత ఎక్కువ దూరం రోడ్డు పాడవుతోంది. దీంతో రోడ్లపై దుమ్ము లేచి వాహనదారుల కళ్లు పాడవుతున్నాయి. తారు తేలిన రోడ్లపై ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కింద పడి ప్రమాదాలకు గురవుతున్నారు. కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనదారులు కూడా టైర్లు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంకర.. దుమ్ముతో ప్రమాదాలు..గుంతల పూడ్చివేత, ప్యాచ్‌ వర్క్‌ పనులు కొంత మేర చేస్తున్నా… రోడ్లపై తేలిన కంకర, దుమ్ము తొలగింపును మాత్రం జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదు. కొన్ని మీటర్ల మేర కంకర తేలి ఉండడంతో సాధారణ వేగంతో వచ్చిన వాహనదారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో కంకర, దుమ్ము కనిపించకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బల్కంపేట నుంచి బేగంపేట లింకు రోడ్డులో కంకర తేలడంతో ఇటీవల పలువురు వాహనదారులు కింద పడి గాయాల పాలయ్యారు. మసాబ్‌ట్యాంక్‌, తాజ్‌ దక్కన్‌ రోడ్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అంబర్‌పేట, కూకట్‌పల్లి, తార్నాక, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీ, తదితర ప్రాంతాల్లో కంకర తేలిన రోడ్లు ఎక్కువగా ఉన్నాయి.

అంతర్గత రోడ్లు అధ్వానం…మహానగరంలో 2వేల లేన్‌ కి.మీ మేర ప్రధాన రహదారులు ఉండగా మిగతావి అంతర్గత రోడ్లు. మెయిన్‌ రోడ్ల నిర్మాణం, నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోన్న జీహెచ్‌ఎంసీ అప్రోచ్‌ రహదారులను అంతగా పట్టించు కోవడం లేదు. దీంతో కాలనీ, బస్తీల్లోని రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలు, బురదమయమవడంతో స్థానికులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తాజా కౌన్సిల్‌ సమావేశంలోనే సభ్యులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. రహదారులు బురదతో నిండి ప్రజలు బయటకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాష్ నగర్‌ ఫ్లై ఓవర్‌పై..బేగంపేట ప్రధాన రహదారి రోడ్డులో గుంతలకు అధికారులు మరమ్మతులు చేశారు. కాగా ప్రకా్‌షనగర్‌ ఫ్లై ఓవర్‌, బేగంపేట ఫ్లై ఓవర్‌పై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు నిర్వహించలేదు. ఈ ఫ్లైఓవర్‌పై పలుచోట్ల గుంతలు ఏర్పడడంతో వర్షానికి అందులో నీరు నిలుస్తుంది. అక్కడ గుంతలు ఉన్నాయని తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

రోడ్లపై రాకపోకలకు అంతరాయం….చిలకలగూడ చౌరస్తా నుంచి జామై ఉస్మానియా వరకు పలు ప్రాంతాల్లో రోడ్లు గుంతలు పడి అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతోపాటు ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది తాత్కాలికంగా గుంతలు పూడ్చినా కొన్ని రోజులకే తిరిగి గుంతలు పడుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలి.

సొంత డబ్బులతో ఎన్నోసార్లు మరమ్మతులు చేశాం…ఎన్నో ఏళ్లుగా నిజాంపేటలో ఉంటున్నా. నేను పదేళ్లలో పెరిగిన జనాభాతో రద్దీగా మారిన ఈ రోడ్డు గుంతలను పూడ్చాలంటూ పలుమార్లు అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. పలుసార్లు మా కామన్‌మన్‌ ఫోరం సభ్యులం ఫోరం డబ్బును ఖర్చుపెట్టి మరమ్మతులు చేయించాం.