– ఎన్‌ఆర్‌ఈజీఏ కింద తిరస్కరించిన చెల్లింపులు
– జీతాలు పొందడానికి కార్మికుల ఇక్కట్లు : లిబ్‌ టెక్‌ నివేదిక

న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(ఎన్‌ఆర్‌ఈజీఏ) పథ కాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. ఎన్‌ఆర్‌ఈ జీఏ పథకం కింద కార్మికులకు చేసే చెల్లింపులు రిజక్ట్‌ కావడమే దీనికి నిదర్శనం. గత ఐదేండ్లలో దాదాపు రూ.5 వేలకోట్ల చెల్లింపులు తిరస్కరణకు గురయ్యా యని ఓ నివేదికలో వెల్లడి కావడం గమనార్హం. దీంతో ఈ పథకంపై ఆధారపడిన కార్మికులు తమ కొద్దిపాటి వేతనాలను సైతం పొందడానికి వినాశకర అడ్డంకుల ను ఎదుర్కోవలసి వస్తోందని సామాజిక శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, ఇంజినీర్లతో కూడిన బృందం తెలిపింది. వీరంతా అనేక రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌ఈజీఏ అమలుతీరుతో పాటు పనివిధానం, కార్యచరణ గురించి పలు రకాలుగా పరిశోధించి నివేదికను పొందుపరిచారు. ఈ నివేదికను లిబ్‌ టెక్‌ ఇండియా ప్రచురించింది. వేతన చెల్లింపుల్లో జాప్యం కార్మికులు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి. డైరెక్ట్‌ బెనిఫిట్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) నమూనా ద్వారా డిజిటల్‌ చెల్లింపుల నిర్మాణం సాంకేతిక అంశా లపై వివిధ ప్రభుత్వాలు గత దశాబద్దంలో చాలా శ్రద్ధ వహించాయి. దీని ద్వారా కార్మికులకు నేరుగా బ్యాంక్‌ ఖాతాల ద్వారా డబ్బు బదిలీ అవుతుంది. అయితే, వారు పొందే ఈ కొద్ది పాటి మొత్తాన్ని బ్యాంక్‌ లేదా పోస్టల్‌ ఖాతాలకు చేరుకున్న తర్వాత కూడా సదరు డబ్బును పొందటానికి కార్మికులు అధిక సంఖ్యలో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సర్వేలో భాగం గా ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌,జార్ఖండ్‌కు చెందిన1947 మంది కార్మికులను లిబ్‌టెక్‌ సంప్రదించింది. బ్యాంకు లు, కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్లు (సీఎస్‌పీలు) లేదా బిజినెస్‌ కరస్పాండెంట్టు (బీసీలు), పోస్ట్‌ ఆఫీస్‌లు, ఏ టీఎంలు అనే నాలుగు చెల్లింపుల పంపిణీ ఏజెన్సీల కు సంబంధించి వారి అనుభవం గురించి కార్మికుల ను అడిగారు.వీరిలో 45శాతం మంది కార్మికులు అనేకసార్లు బ్యాంకులను సందర్శించాల్సి ఉన్నదని సర్వేలో తేలింది. అలాగే 40శాతం మంది సీపీఎస్‌లు లేదా బీసీవినియోగదారులు బయోమెట్రిక్‌ వైఫల్యాల కారణంగా వాటి చుట్టు పలుసార్లు తిరగాల్సి వస్తున్నదని వివరించింది.

ఇక తమ పాస్‌బుక్‌లు అప్‌డేట్‌ కాలేదని 57శాతం మంది నివేదించారు. బ్యాంకుల నుంచి వేతనాలు పొందడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని జార్ఖండ్‌లో 42శాతం, రాజస్థాన్‌లో 38శాతం మంది తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 20 వేతన చెల్లింపు లావాదేవీలు.. తప్పు ఖాతా సంఖ్య లేదా బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ను తప్పుగా అనుసంధానించడం వంటి సాంకేతిక లోపాల వల్ల తిరస్కరించబడ్డాయి. కార్మికులు తమ జాబ్‌ కార్డులు, ఖాతాలను ఆధార్‌తో విజయవంతంగా లింక్‌ చేయగలిగినప్పటికీ వారు తమ ఖాతాలోని లావాదేవీలను ట్రాక్‌ చేయలేకపోతున్నారు. అన్ని బ్యాంక్‌, పోస్ట్‌ ఆఫీస్‌ వినియోగదారులకు పాస్‌బుక్‌లు జారీ చేయగా.. సీఎస్‌పీ లేదా బీసీలలో ఖాతాలు తెరిచినవారిలో 56 శాతం మందికి పాస్‌బుక్‌లో ఊసే లేకపోవడం గమనార్హం. 57శాతం మంది.. తమ పాస్‌బుక్‌లు ఎప్పుడూ నవీకరించబడలేదని నివేదించారు.

ఇక వేతనం కోసం పోస్టాఫీసులను సందర్శించ డానికి అయ్యే సగటు వ్యయం రూ.6గా ఉండగా, బ్యాంకుకు రూ.31 అని నివేదికక వివరించింది. ఇక సీఎస్‌పీ లేదా బీసీలకు రూ.11గా ఉండగా.. ఏటీఎంలకు రూ.67గా ఉన్నది. సాంకేతిక కారణాల వల్ల డీబీటీ నగదు బదిలీ విఫలమైనప్పుడు వేతన చెల్లింపుల తిరస్కరణ జరుగుతుంది. అయితే వీటిని సరిదిద్దకపోతే కార్మికులకు వేతనాలు లభించవు. అధికారిక గణాంకాల ప్రకారం.. జులై 2020 నాటికి గత ఐదేండ్లలలో దాదాపు రూ.4800 కోట్ల రూపాయల చెల్లింపులు తిరస్కరించబడ్డాయి. అలాగే, రూ.1274 కోట్ల మొత్తాన్ని కార్మికులకు చెల్లించాల్సి ఉండగా, అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం.

Courtesy Nava Telangana