ఐదేండ్లలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధికి రూ.90వేల కోట్ల కేటాయింపు
ఖర్చు రూ.52,782 కోట్లు
ఆ పేరుతో బీఆర్‌వోలు
రూ.37,820 కోట్ల దారి మళ్లింపు
‘విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. ఒక్క సంక్షేమానికే ఏడాదికి రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. దళిత, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేకాభివృద్ధి నిధికి భారీగా నిధులు కేటాయిస్తున్నాం’ అని చెబుతున్న సర్కారు.. వారికి కేటాయించిన నిధులు.. పెట్టిన ఖర్చులను చూస్తే విస్తుపోవాల్సిందే. టీఆర్‌ఎస్‌ సర్కారు గత ఐదేండ్లలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధికి రూ. 90,602 కోట్లు కేటాయించింది. ఇందులో నుంచి కేవలం రూ. 52,782 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం లెక్కలు చూపుతున్నది. అంటే మిగతా రూ. 37,820 కోట్లు దారి మళ్లించారని స్పష్టమవుతున్నది. దీంతోనే సంక్షేమం పట్ల సర్కారుకు ఎంత చిత్తశుద్ధి ఉందో విదితమవుతున్నది. సాధారణ పథకాలకు సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లిస్తుందే తప్ప, దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయడం లేదని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో నిధులు పెంచుతూ పోతున్న సర్కారు.. వాటిని ఖర్చు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నది. నిధులు ఖర్చు చేయడం లేదనే విమర్శలు రాకుండా నామమాత్రంగా బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లు (బీఆర్‌వోలు) విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నదన్న విమర్శలున్నాయి.
ఎస్సీ ప్రత్యేకాభివృద్ధి నిధికి..
గత ఐదేండ్లలో దళిత ప్రత్యేకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 56, 979 కోట్లు కేటాయించింది. అందులో నుంచి దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ. 36, 685 కోట్లు మంజూరు చేసి, అందులో రూ. 33, 361 కోట్లు ఖర్చు పెట్టింది. మిగతా రూ. 23,618 కోట్లను ఇతర పథకాలకు ఖర్చు చేశారని
ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధికి :
గిరిజన సంక్షేమం కోసం ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 2014 నుంచి 2018-19 సంవత్సరం వరకు రూ. 33, 623 కోట్లు కేటాయించింది. అందులో నుంచి కేవలం రూ. 19,421 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. మిగతా రూ. 14, 202 కోట్లను ఇతర సాధారణ పథకాలకు దారిమళ్లించింది.
సెక్షన్‌ 11, డీ, సీలతోనే మళ్లింపు
దళిత, గిరిజన ప్రత్యేకాభివృద్ధి చట్టంలోని సెక్షన్‌ 11, డీ, సీలను ఆసరాగా చేసుకునే నిధులను సర్కారు దారి మళ్లిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఈ సెక్షన్‌ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధులను దారి మళ్లించుకునేందుకే సెక్షన్‌ 11 డీ, సీ క్లాజును పెట్టింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధిని దారి మళ్లిస్తే ఆయా శాఖాధిపతులపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో పొందుపర్చింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో ఉన్న లొసుగులను 2017లో ప్రభుత్వం కొన్ని సవరణలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా ప్రత్యేకాభివృద్ధి నిధిని దారి మళ్లించకుండా, నిధులు ఖర్చు కాని పక్షంలో వాటిని వచ్చే ఏడాదికి క్యారీఫార్వర్డ్‌ అయ్యేలా సవరణలు చేసింది. కానీ అదే సంవత్సరంలో ఎస్సీ ప్రత్యేకాభివృద్ధి నిధి నుంచి రూ. 4,197 కోట్లు, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధిలో నుంచి రూ. 3, 586 కోట్లను దారి మళ్లించడం గమనార్హం.
బడ్జెట్‌లో భారీ కోతలు
సంక్షేమ రంగాలకు 2019-20 వార్షిక బడ్జెట్‌లో నిధుల కోత భారీగా పడింది. ఇందులో ముఖ్యమైనవి రైతుబంధు, కళ్యాణలక్ష్మీ, ఆసరా పెన్షన్‌ పథకాలతో పాటు ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు ఉన్నాయి. గతేడాది కేటాయింపులు, ఈ ఆర్థిక సంవత్సరం సంక్షేమ పథకాలకు ప్రగతి పద్దులో కేటాయింపులను చూస్తే ఎంత వ్యత్యాసం ఉన్నదో తెలుస్తోంది. 2018-19లో ఈ శాఖలకు ప్రగతి పద్దు కింద రూ.21,675 కోట్లు కేటాయించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు సగం కంటే ఎక్కువ తగ్గాయి. కేవలం రూ.9071 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు సంబంధించి కొత్త దరఖాస్తులను స్వీకరించకూడదని సర్కారు నిర్ణయించినట్టు సమాచారం. అదేవిధంగా సబ్సిడీ రుణాలను కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో నిలిపివేయాలని ప్రభుత్వం ఆర్థిక శాఖను ఆదేశించినట్టు తెలిసింది.

Courtesy Nava telangana