• కలకలం రేపుతున్న ఐటీ ప్రకటన
  • ఈ నెల మొదటివారంలో భారీగా సోదాలు
  • బోగస్‌ బిల్లులతో రూ.3,300 కోట్ల నగదు బదిలీ
  • హవాలాతో బడా కార్పొరేట్ల బంధం
  • దక్షిణాది రాష్ట్రాల ప్రాజెక్టుల్లో ‘నకిలీ దందా’

అమరావతి: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వెచ్చించిన నిధులను తప్పుడు మార్గాల్లో దారి మళ్లించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లకుపైగా నగదు అందినట్లు సాక్ష్యాధారాలు లభించాయి’’ అని ఆదాయ పన్ను శాఖ పెద్ద బాంబు పేల్చింది. ‘ఎవరా ముఖ్య వ్యక్తి’ అనే విషయాన్ని మాత్రం బయటపెట్టకుండా ఉత్కంఠను రేకెత్తించింది. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, ఈరోడ్‌, పుణె, ఆగ్రా, గోవాలలోని 42 ప్రాంతాల్లో ఐటీ అధికారులు భారీగా సోదాలు నిర్వహించారు. దీనిపై ఆ శాఖ కమిషనర్‌ (మీడియా, టెక్నికల్‌ పాలసీ) సురభి అహ్లూవాలియా సోమవారం క్లుప్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘బోగస్‌ బిల్లులు, హవాలా లావాదేవీలు నిర్వహించే కొందరిపై ఈనెల మొదటి వారంలో దాడులు నిర్వహించాం. మౌలిక సదుపాయాల రంగంలో బోగస్‌ కాంట్రాక్టులు/బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్‌ను ఛేదించాం. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధులను ఎంట్రీ ఆపరేటర్లు, లాబీయిస్టులు, హవాలా డీలర్ల ద్వారా దారి మళ్లించారు.

ఇలాంటి కంపెనీలు ఎక్కువగా ఢిల్లీ, ముంబైలకు చెందినవే. ఇందులో ఒక కంపెనీపై ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఐటీ సోదాలు జరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో చేపట్టిన ప్రధాన మౌలిక సదుపాయాలు, ఈడబ్ల్యూఎస్‌ ప్రాజెక్టుల్లో బోగస్‌ బిల్లింగ్‌ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లకుపైగా నగదు చెల్లింపులు జరిగినట్లు మా సోదాల్లో ఆధారాలు లభించాయి’’ అని ఐటీ శాఖ తన ప్రకటనలో తెలిపింది. అంతేకాదు… బడా కార్పొరేట్లు, హవాలా ఆపరేటర్ల మధ్య కొనసాగుతున్న అక్రమ లావాదేవీల సంబంధంపై బలమైన ఆధారాలు లభించాయని తెలిపింది. బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా ఏకంగా రూ.3300 కోట్ల మేరకు నగదును పోగేయడం నుంచి పంపిణీ చేయడం వరకు ‘సరఫరా విధానం’ (చెయిన్‌ ఆఫ్‌ డెలివరీ) మొత్తం ఆధారాలతో బయటికి లాగగలిగామని ఐటీ శాఖ తెలిపింది. తమ సోదాల్లో రూ.4.19 కోట్ల నగదు, 3.2 కోట్లకు పైగా విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.

Courtesy Andhrajyothi…