– సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు..
– తొలి దశ ప్యాకేజీ వివరించిన నిర్మలా సీతారామన్‌
– ప్రభుత్వం నుంచే మూడు నెలల ఈపీఎఫ్‌ చెల్లింపులు
– టీడీఎస్‌, టీసీఎస్‌ 25 శాతం తగ్గింపు
– దశలవారీగా ఆత్మ నిర్భర్‌ అభియాన్‌

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు రూ.3 లక్షల కోట్లు ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఎంఎస్‌ఎంఈలకు ఈ మొత్తం నుంచి రుణాలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రధాని మోడీ మంగళవారం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను బుధవారం నాడిక్కడ నేషనల్‌ మీడియా సెంటర్‌ (ఎన్‌ఎంసీ)లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో కలిసి ఆమె మాట్లాడారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌కు సంబంధించిన వివరాలను ఇప్పటి నుంచి ఒక్కొక్కటిగా దశలవారీ వెల్లడిస్తామని నిర్మలా తెలిపారు. ఈ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఆర్థికం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రజలు, గిరాకీ వంటి ఐదు మూల సూత్రాలుగా ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ను ప్రధాని ప్రకటించారని ఆమె తెలిపారు. ఆదాయపు పన్ను రిటర్నలను నవంబర్‌ 30 వరకు, పన్ను ఆడిట్‌ను 2020 అక్టోబర్‌ 31కి పొడిగిస్తున్నట్టు తెలిపారు.

ఎంఎస్‌ఎంఈలకు ఊతం
ఎంఎస్‌ఎంఈకు కేటాయించిన రూ.3 లక్షల కోట్లలో అత్యవసరాల కోసం రూ.20 వేల కోట్ల అప్పులు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ద్వారా ఈక్విటీ ఇన్ఫ్యూషన్‌ రూ.50 వేల కోట్లు నిధి కేటాయిస్తున్నట్టు తెలిపారు. 12 నెలల మారటోరియంతో ఈ రుణాలు మంజూరు చేస్తామనీ, ఎంఎస్‌ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలకు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఈ సాయం దోహదపడుతుందనీ, ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. రూ.200 కోట్ల లోపు కొనుగోళ్లకు గ్లోబల్‌ టెండర్లకు అవకాశం లేదన్నారు. సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి పరిధిని రూ.25 లక్షల నుంచి రూ.కోటికి పెంచుతున్నామనీ, రూ.5 కోట్ల టర్నోవర్‌ చేసే కంపెనీలు కూడా సూక్ష్మ పరిశ్రమలుగా గుర్తింపు ఇస్తామని పేర్కొన్నారు.

3 నెలల ఈపీఎఫ్‌ ప్రభుత్వమే చెల్లింపు
ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎంఈలకు మూడు నెలలు భవిష్య నిధి (పీఎఫ్‌) చెల్లింపులను ప్రభుత్వమే చేస్తుందని మంత్రి తెలిపారు. జూన్‌,జులై, ఆగస్టు నెలల పీఎఫ్‌ మొత్తం రూ.2,500 కోట్లు ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. వ్యాపారాలు, ఉద్యోగులకు మూడు నెలల పాటు ఈపీఎఫ్‌ లిక్వడిటీ సహకారం కోసం రూ.6,750 కోట్ల కేటాయించామన్నారు. ఉద్యోగులు నెలనెలా చెల్లించే ఈపీఎఫ్‌ను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు.

డిస్కంలకు రూ.90 వేల కోట్లు
తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రూ.90 వేల కోట్ల మేర నగదు లభ్యత కల్పిస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ఒప్పంద పనుల పూర్తికి ఆరు నెలలు అదనపు సమయం ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ), హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలకు రూ.30 వేల కోట్ల మేర నగదు లభ్యత కల్పిస్తామన్నారు. ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలకు రూ.45 వేల కోట్లు పాక్షిక క్రెడిట్‌ గ్యారెంటీ ఇస్తామని చెప్పారు.

టీడీఎస్‌, టీసీఎస్‌ 25 శాతం తగ్గింపు
ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్‌, టీసీఎస్‌ను 25 శాతం తగ్గిస్తున్నామని మంత్రి ప్రకటించారు. దీంతో రూ.50 వేల కోట్లు లబ్ది కలుగుతుందని ఆమె తెలిపారు. ఈ తగ్గింపు గురువారం నుంచి 2021 మార్చి 31 వరకు అమలులో ఉంటుందన్నారు.

స్థిరాస్తి ప్రాజెక్టులకు సడలింపులు
రియల్‌ ఎస్టేట్‌ (స్థిరాస్తి) ప్రాజెక్టుల రిజిస్టర్డ్‌ ప్రాజెక్టుల నమోదు, పూర్తి చేయాల్సిన తేదీని అదనంగా ఆరు నెలల వరకు పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. రెరా నిబంధనల ప్రకారం భవన నిర్మాణాల పూర్తికి కూడా గడువు ఆరు నెలలు పొడిగిస్తున్నామని ఆమె తెలిపారు.

Courtesy Nava Telangana