-బీహార్‌లో రూ. 263.47 కోట్ల ఖర్చుతో నిర్మాణం

పాట్నా : కనీస ప్రమాణాలు పాటించకుండా.. నాణ్యత లేమితో బీహార్‌లోని ఓ నదిపై నిర్మించిన బ్రిడ్జి కూలిపోయింది. దాదాపు నెల క్రితమే ఈ బ్రిడ్జిని ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌ అధికారికంగా ప్రారంభించారు. అయితే కొన్ని రోజులకే ఇది నేల మట్టం కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి నితీశ్‌ సర్కారుపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గోపాల్‌గంజ్‌లోని గండక్‌ నదిపై సత్తార్‌ఘాట్‌ బ్రిడ్జిలో భాగంగా దీనిని నిర్మించారు. దీనికి నితీశ్‌ సర్కారు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించింది. గతనెల 16న సీఎం నితీశ్‌ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అయితే ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. సీఎం ప్రారంభించిన కొన్నిరోజుల వ్యవధిలోనే బ్రిడ్జి కూలిపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీతో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన నాయకులు నితీశ్‌ సర్కారు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ”బ్రిడ్జి నిర్మాణానికి ఎనిమిదేండ్లలో రూ.263.47 కోట్లను ఖర్చు చేశారు. గతనెల 16నే సీఎం నితీశ్‌ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు.

29 రోజుల తర్వాత ఇది ఇప్పుడు కూలిపోయింది. ఇది నితీశ్‌ సర్కారు చేసిన అవినీతి అని ఎవరైనా అనగలరా? రూ.263 కోట్లు చాలా స్వల్పం” అని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో బీజేపీ-జేడీయూల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.

Courtesy Nava Telangana