– సార్వత్రిక ఎన్నికలకు ముందు రూ.2410కోట్లు
– ఎన్నికలబాండ్ల ద్వారా రూ.1450కోట్లు
– రెట్టింపైన కమలం, కాంగ్రెస్‌ ఆదాయాలు : 2018-19 వార్షిక ఆడిట్‌ నివేదికలో వెల్లడి
– 2016-17 నుంచి బీజేపీ అందుతున్న విరాళాలు వెయ్యికోట్లు దాటింది. – -2018-19నాటికి పార్టీ విరాళాలు రెట్టింపు అయ్యాయి.– 2017-18లో బీజేపీ ఆదాయం రూ.989కోట్లు. ఇందులో బాండ్ల ద్వారా వచ్చిన మొత్తం రూ.210కోట్లు.
– ప్రముఖ కార్పొరేట్‌ సంస్థకు చెందిన ‘ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌’ బాండ్ల పథకంద్వారా బీజేపీకి దక్కిన విరాళాలు రూ.356 కోట్లు. న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల(మే 2019)కు ముందు బీజేపీకి వేలకోట్ల రూపాయలు విరాళాలందాయి. ఆ తర్వాత పెద్దమొత్తంలో కాంగ్రెస్‌కు రాజకీయ విరాళాలొచ్చాయి. గతంతో పోల్చితే ఆ రెండు పార్టీల ఆదాయాలు భారీగా పెరిగినట్టు తేలింది. 2018-19లో బీజేపీకి రూ.2410కోట్లు, కాంగ్రెస్‌కు రూ.918కోట్లను పార్టీ విరాళాలుగా అందుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2018-19 వార్షిక ఆడిట్‌ నివేదికల్లో వెల్లడించాయి. 2019 ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఎన్నికల బాండ్లలో (రూ.5వేల కోట్లు) అత్యధిక భాగం బీజేపీకే వెళ్లిందన్న విషయం కూడా తాజాగా బయటకొచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌ సహా వివిధ రాజకీయ పార్టీలు 2018-19 వార్షిక ఆడిట్‌ నివేదికల ఆధారంగా ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రిక వార్తా కథనాన్ని వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి..
ఎన్నికలవేళ కలిసొచ్చింది!
సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి ఎన్నికల బాండ్ల ద్వారా పెద్దమొత్తంలో విరాళాలుగా అందాయి. మొత్తం రూ.2410కోట్లు విరాళాలుగా రాగా, ఇందులో ఎన్నికలబాండ్ల ద్వారా రూ.1450కోట్లు బీజేపీ అందుకుంది. మొత్తం విరాళాల్లో 60శాతానికిపైగా ఎన్నికలబాండ్ల ద్వారా సేకరించినవే ఉన్నాయి. కాంగ్రెస్‌ అందుకున్న మొత్తం విరాళాల్లో
(రూ.918కోట్లు) 41శాతం (రూ.383కోట్లు) ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చాయి. ఎన్నికల బాండ్ల పథకానికి వ్యతిరేకంగా గళమెత్తిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (రూ.97 కోట్లు) పెద్ద మొత్తంలో నిధులు సేకరించటం చర్చనీయాంశమైంది.

వ్యయమెంత?
బీజేపీ : 2018-19లో రూ.1005కోట్లు వ్యయం చేసినట్టు బీజేపీ తెలిపింది. ఎన్నికల కోసం చేసిన ఖర్చు రూ.792కోట్లు. ఇందులో ప్రకటనలు, ప్రచారం నిమిత్తం అయిన వ్యయం రూ.435కోట్లు. ఎన్నికల్లో నిలబడ్డ పార్టీ అభ్యర్థులకు అందిన ఆర్థిక సాయం రూ.85కోట్లు. ర్యాలీలకోసం రూ.69కోట్లు, సభలు, సమావేశాలకు రూ.67కోట్లు ఖర్చుచేసినట్టు బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది.
కాంగ్రెస్‌ : పార్టీ ఖర్చు రూ.469కోట్లు, ఎన్నికల కోసం అయిన ఖర్చు రూ.369కోట్లు.
తృణమూల్‌ కాంగ్రెస్‌ : ఆదాయం(2018-19లో) రూ.192కోట్లు, ఇందులో బాండ్ల ద్వారా ఆదాయం రూ.97కోట్లు. ఖర్చు రూ.11కోట్లు.
బీఎస్పీ : ఆదాయం…2017-18లో రూ.14కోట్లు, 2018-19లో రూ.69కోట్లు. ఖర్చు రూ.48కోట్లు.

Courtesy Nava telagnana